Take a fresh look at your lifestyle.

తాత్కాలిక అధ్యక్షురాలిగా మరికొంతకాలం.. సోనియా గాంధీ కొనసాగుతారు

  • కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ తీర్మానం టీకప్పులో తుఫాన్‌లా ముగిసిన కమిటీ భేటీ
  • నేతల లేఖపై సుదీర్ఘ చర్చ సోనియా లేదా రాహుల్‌ ‌కొనసాగాలని మెజార్టీ నేతల పట్టు

కాంగ్రెస్‌ ‌పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మరికొంత కాలం పాటు సోనియా గాంధీనే కొనసాగనున్నారు. సీడబ్ల్యూసీ భేటీలో సుదీర్ఘ సమయం పాటు చర్చించిన నేతలు పార్టీ సారథ్య బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించారు. ఎక్కువ మంది నేతలు సోనియానే కొనసాగాలనీ.. అనారోగ్య సమస్యలు ఉంటే ఆ బాధ్యతలు రాహుల్‌కి అప్పగించాలని కోరినట్టు తెలుస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య కొనసాగిన ఈ సీడబ్ల్యూసీ భేటీలో మళ్లీ సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు తథ్యంగా కనిపిస్తోందన్న చర్చోపచర్చల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. ప్రస్తుతానికి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని పార్టీ ముఖ్య నేతలంతా సీడబ్ల్యూసీలో తీర్మానించారు. రాబోయే 6 నెలల్లో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. దీంతో.. నాయకత్వ బాధ్యతల నుంచి సోనియా తప్పుకోనున్నారన్న వార్తలకు తెరపడింది. సోనియా రాజీనామా చేశారని, ఇక రాహుల్‌ ‌సారథ్యంలో కాంగ్రెస్‌ ‌ముందుకెళ్లనుందనే వార్తలు తెరపైకొచ్చాయి. అయితే.. సీడబ్ల్యూసీ తాజా ప్రకటనతో ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. మొత్తంగా టీకప్పులో తుఫాన్‌లా కాంగ్రెస్‌ ‌సమావేశం ముగిసింది. సోనియా రాజీనామాను మన్మోహన్‌ ‌సింగ్‌, ఆం‌టోనీలు వ్యతిరేకించి ఆమెనే సారథిగా కొనసాగాలని అభ్యర్థించారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగాలని పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, కర్నాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అభ్యర్థించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అత్యున్నత పదవిని చేపట్టేలా అవసరమైతే రాహుల్‌ ‌గాంధీని ఒప్పించాలని ఆయన కోరారు.

ఈ మేరకు ఆయన తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పార్టీకి పూర్తిస్థాయి సారథిని నియమించాలనీ.. సీడబ్ల్యూసీ ఎన్నికలు నిర్వహించడం సహా పార్టీ పార్లమెంటరీ బోర్డు పునర్నించాలని కోరుతూ 20 మంది సీనియర్‌ ‌నేతలు సోనియాకు లేఖ రాయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ నాయకత్వంలో ఉమ్మడి భాగస్వామ్యం ఉండాలని కొందరు డిమాండ్‌ ‌చేస్తుండగా.. మరికొందరు గాంధీ కుటుంబమే సారథ్యం వహించాలని పట్టుపడుతుండడంతో మరింత గందరగోళం నెలకొంది. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ ‌గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో… తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదంటూ సోనియా తప్పుకోవడంతో మళ్లీ కాంగ్రెస్‌ ‌పార్టీ కొత్త చీఫ్‌గా ఎవరు వస్తారన్నది హాట్‌ ‌టాపిక్‌గా మారింది. ఈ పదవిని చేపట్టేందుకు రాహుల్‌, ‌ప్రియాంక గాంధీలు ఇప్పటికే విముఖత వ్యక్తం చేయడంతో కొత్త సారథి ఎంపిక కత్తిద సాములా మారిన సమయంలో మరో ఆరునెలలపాటు సోనియానే కొనసాగనున్నారు. సోమవారం ఉదయం 11గంటల నుంచి జరిగిన సుదీర్ఘ భేటీ అనంతరం సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంతా భావించినప్పటికీ.. నాయకత్వ మార్పు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం. సోమవారం ఉదయం నుంచి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షురాలిగా తాను కొనసాగలేననీ.. మరొకరిని నియమించాలని సోనియాగాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలను కోరారు. అయితే, ఆమె కోరిన వెంటనే మన్మోహన్‌ ‌సింగ్‌, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ ‌పటేల్‌ ‌వంటి సీనియర్‌ ‌నేతలు ఆ పదవిలో సోనియానే కొనసాగాలని కోరారు. ఈ అంశంపై చర్చించిన నేతలు పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోకముందే మరో అంశంపై చర్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు, 23మంది కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు ఇటీవల సోనియాకు రాసిన సుదర్ఘలేఖపై సమావేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. పార్టీలో నాయకత్వ లోపం, నిర్ణయాల లేమి తదితర అంశాలపై నేతలు రాసిన లేఖపై చర్చించిన నేతలు తుది నిర్ణయానికి రాలేకపోయారు. ఈ లేఖపైనే దృష్టి పెట్టిన ఈ భేటీలో రాహుల్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇతర పార్టీల కుట్రలు చేస్తున్న సమయంలో సోనియా హాస్పిటల్‌ ‌పాలైన నేపథ్యంలో సీనియర్లు, పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేతలు ఈ రకంగా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. లేఖలు రాసేటప్పుడు సమయం, సందర్భం చూసుకోవద్దా? అని అన్నారు. సోనియా ఏ నిర్ణయమూ తీసుకోవడానికి అవకాశం లేని సమయంలో లేఖ రాసి ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో భాజపా ప్రోద్బలంతో ఇలాంటి లేఖలు రాశారా? అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే, రాహుల్‌ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అవి తప్పని గులాం నబీ ఆజాద్‌ ‌వెల్లడించారు. అయితే, సోనియా గాంధీ ఎప్పటి వరకు అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారు అనేది మాత్రం స్పష్టంచేయలేదు. కొన్ని నెలల పాటు అని మాత్రమే తీర్మానంలో పేర్కొన్నారు. కొత్త అధ్యక్షుడు, పార్టీలో తీసుకోవాల్సిన నాయకత్వ మార్పు, క్షేత్రస్థాయి నుంచి ఏఐసీసీ స్థాయి వరకు చేయాల్సిన మార్పులు, చేర్పులు, పార్టీ తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై చర్చించిన సీడబ్ల్యూసీ మరికొంత కాలం పాటు సోనియానే కొనసాగించాలని నిర్ణయించినట్టు స్పష్టంచేసింది. కొత్త అధ్యక్షుడు గాంధీ కుటుంబం నుంచా గాంధీయేతర కుటుంబం నుంచి వస్తారా అనే అంశంపైనా స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. మరోసారి సీడబ్ల్యూసీ మరోసారి భేటీ అయ్యే ఆస్కారం ఉంది. నూతన అధ్యక్షుడి ఎంపిక జరిగే వరకు సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఉదయం నుంచి జరిగిన వ్యవహారాలన్నింటిపైనా స్పష్టమైన నివేదికను తయారు చేయబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

రక్తంతో సోనియాకు లేఖ:
రాహుల్‌ ‌గాంధీని కాంగ్రెస్‌ ‌పార్టీకి తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని పార్టీకి చెందిన ఓ నేత.. సోనియా గాంధీకి రక్తంతో లేఖ రాశారు. ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ‌బోర్డ్ ‌కౌన్సిలర్‌, ‌కాంగ్రెస్‌ ‌నేత సందీప్‌ ‌తన్వార్‌ ‌రాసిన ఈ లేఖ ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్‌ ‌గాంధీని పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమించాలని రక్తతర్పణం చేసి అడుగుతున్నాను. రాహుల్‌ ‌గాంధీ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశంలో ఎన్నో గొంతుకలు నినదిస్తున్నాయి. రాహుల్‌ ‌గాంధీ కనుక పార్టీ అధ్యక్షుడు కాకపోతే కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎంత మాత్రమూ మేలు చేయదని సందీప్‌ ‌తన్వార్‌ ‌రాసుకొచ్చారు.

Leave a Reply