ఈ మధ్య కొందరికి కొరోనా సోకి తగ్గిన తర్వాత మళ్లీ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరిద్దరిలో ఇలాంటి లక్షణాలు బయపడ్డాయి. పదే పదే పాజిటివ్‌గా రావడమనేది ఒకరిద్దరి సమస్య కాదు. చాలామందికి ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో తాము ఇంకా చికిత్స తీసుకోవాలా, కుటుంబ సభ్యులతో కలిసి ఉండొచ్చా, లేదా, అన్న ప్రశ్నలు వారిని పట్టిపీడిస్తున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో రెండోసారి వచ్చిన వారికి యాంటీజెన్ పరీక్ష చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. వైరస్ ఉన్న వారిలో 5 నుంచి 10శాతం మందికి రెండోసారి కూడా పాజిటివ్‌గా నిర్దారణ అవుతోందని వైద్యులు చెబుతున్నారు. ర్యాపిడ్ పరీక్షలు చేయించుకున్న వారిలో నెగెటివ్ వస్తోండగా, ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌గా వస్తోందన్నారు. శరీరంలో వైరస్ ఆనవాళ్లు 0.1 శాతం ఉన్నా.. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్‌గా చూపిస్తోందని, దీంతో ముప్పు ఏ ఉండదని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
14 రోజుల తర్వాత శరీరంలో వైరస్ ఉన్నా కదలదని..దాని వల్ల రోగికి, అతడి చుట్టుపక్కల వారికి ఎటువంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేస్తున్నారు. రెండు వారాలు గడిస్తే వైరస్ ఇతరులకు సోకే గుణం కోల్పోతుందని పేర్కొంటున్నారు. ఒక వైరస్ నాశనం అయిపోయినా, దాని అవశేషాలు శరీరంలో ఉంటాయని వివరిస్తున్నారు. కొరోనా వైరస్ వ్యక్తిలో పూర్తిగా అంతరించిందా లేదా అని నిర్దారించుకోవడానికి కల్చర్ పరీక్ష చేస్తారు. అయితే, అది మన దేశంలో అందుబాటులో లేదు. ఖర్చుతో కూడుకున్నదే కాక నిర్దారణ చేసే వ్యక్తులకు కూడా ముప్పు ఉంటుంది. దీంతో ఈ రకం కల్చర్ పరీక్షలు చేయడం అరుదు. ఒకవేళ శరీరంలో వైరస్ అవశేషాలు ఉన్నటైతే, వారిని కోవిడ్ లేని వారిగానే పరిగణించాలని వైద్యులు చెబుతున్నారు.
పాజిటివ్ వచ్చిన కొందరిలో రెండు, మూడు నెలల వరకు వైరస్‌కు సంబంధించిన అవశేషాలు ఉంటాయి. వాటి కారణంగానే పరీక్షలో పాజిటివ్ అని వస్తుంది. ఇలాంటి వారికి ఏ చికిత్స అవసరంలేదు. •ం క్వారంటైన్లో ఉన్న వారు 14 రోజుల తర్వాత అసలు పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ప్రాణవాయువు తగ్గుదల, జ్వరం, దగ్గు తగ్గకపోతేనే వైద్యులను సంప్రందించాలి. అనవసర ఆందోళనతో ఇబ్బందులు పడవద్దని ఫీవర్ హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు. రెండోసారి పాజిటివ్‌గా నిర్దారణ అయితే మరో 14 రోజులు •ం క్వారంటైన్లో ఉండడం మంచిదంటున్నారు. ఎక్కడకెళ్లినా మాస్కులు ధరించడం, శానిటైజ్ చేయడం, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం తప్పనిసరిగా చేయాలి. 14 రోజుల తర్వాత ఎలాంటి లక్షణాలు లేకపోతే వైరస్ లేదనే నిర్దారించుకోవాలి. జబ్బులున్న వారిలో ఏ మాత్రం వైరస్ చలనం ఉన్నా, మళ్లీ తిరగబెట్టే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.