Take a fresh look at your lifestyle.

దుబ్బాక బై ఎలక్షన్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత..?

  • అనేక సమీకరణలు, ఇంటెలిజెన్స్ ‌నివేదిక ఆధారంగా అభ్యర్థి ఖరారు
  • త్వరలో అధికారికగా ప్రకటించనున్న గులాబీ దళపతి
  • నమ్మకానికే  మరోసారి కేసీఆర్‌ ‌వోటు

దుబ్బాక బై ఎలెక్షన్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇప్పటిదాకా నడుస్తున్న అనేక అనుమానాలకు, ఊహాగానాలకు, ప్రచారాలకు, చర్చలకు ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే ఫుల్‌స్టాప్‌ ‌పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారనీ సమాచారం. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి, గులాబీ బాస్‌ ‌కేసీఆర్‌ ‌సోలిపేట సుజాత పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు సోమవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ ప్రతినిధికి వివరించాయి. అనేక సమీకరణలు, ఇంటెలిజెన్స్ ‌నివేదికల ఆధారంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిగా సోలిపేట సుజాత అభ్యర్థిత్వాన్ని సిఎం కేసీఆర్‌ ‌ఫైనల్‌ ‌చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్లితే…గత నెల 6న ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన విషయం విధితమే. గతంలో ఎప్పుడూ, ఎక్కడ లేని విధంగా రామలింగారెడ్డి చనిపోయిన మరుసటి రోజు నుంచే దుబ్బాక బై ఎలక్షన్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎవరు? కొడుకు సతీష్‌రెడ్డా? భార్య సుజాతనా? లేదంటే కొత్తగా మరెవరినైనా బరిలోకి దించుతారా? అంటూ అనేక విధాలుగా ప్రచారం జరిగింది.

మరి కొందరు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలైతే మరో అడుగు ముందుకేసి ఈ బై ఎలక్షన్‌లో సోలిపేట కుటుంబానికి టికెట్‌ ఇవ్వొద్దంటూ బహిరంగంగానే మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే, సిఎం కేసీఆర్‌ అన్ని అంశాలపై లోతైన అధ్యయనం చేసి, ఇప్పుడున్న పరిస్థితులలో ఏరకంగా చూసినా కూడా.. దుబ్బాక బై ఎలక్షన్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతను పోటీకి పెట్టాలనే కచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిగా సోలిపేట సుజాతను రోజుల వ్యవధిలోనే అధికారికంగా ప్రకటించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాలకు, ఊహాగానాలకు సిఎం కేసీఆర్‌ ‌ఫుల్‌స్టాప్‌ ‌పెట్టే అవకాశం ఉందనీ సమాచారం. ఏది ఏమైనా సోలిపేట సుజాతను అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా సిఎం కేసీఆర్‌ ‌తనను నమ్ముకున్న వారిని ఎన్నడూ వదులుకోరనీ, నమ్ముకున్న వారికి పెద్దపీట వేస్తారనీ ఇప్పటి వరకు ఉన్న ప్రచారం మరోసారి నిజం కానున్నది. మొత్తంగా టిఆర్‌ఎస్‌లోని ఆశావహులు, అసంతృప్తివాదులకు సిఎం కేసీఆర్‌ ‌తీసుకునే నిర్ణయం ఊహించని షాకే ఇవ్వనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply