Take a fresh look at your lifestyle.

సోలిపేట.. ఇక సెలవ్‌..!

  • రామలింగారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసీఆర్‌
  • ‌రామలింగారెడ్డి మృతదేహం చూసి కన్నీటి పర్యంతమైన సిఎం కేసీఆర్‌
  • ‌కుటుంబ సభ్యులకు ఓదార్పు…
  • పాడె మోసిన మంత్రి హరీష్‌రావు, ఎంపి కేపీఆర్‌

ఒక ఉద్యమవీరుడు, ఒక ప్రజా గొంతుక మూగబోయింది. లింగన్నా అని అందరూ ముద్దుగా పిలుచుకునే పేద ప్రజల మనిషి, గరీబోళ్ల నాయకుడు ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న గరీబోళ్ల నాయకుడు పోరాటం నిలిపివేసి జీవన రంగస్థలం నుంచీ కానరానిలోకాలకు వెళ్లిపోయారు. సిద్ధిపేట జిల్లాలోని చిట్టాపూర్‌లో 1962 అక్టోబర్‌ 2‌న జన్మించిన సోలిపేట రామలింగారెడ్డి…మొదటిసారిగా 2004లో దొమ్మాట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాలలోకి రాకముందు రామలింగారెడ్డి జర్నలిస్టుగా, పీపుల్స్‌వార్‌ ఉద్యమంలోనూ పని చేశాడు.  రామలింగారెడ్డి ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సోలిపేట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.  సోలిపేటకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రామలింగారెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు,
ఈటల రాజేందర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌పువ్వాడ అజయ్‌, ‌సత్యవతి, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి,  జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, ‌పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ‌ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సిఎం కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామలింగారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిఎం కేసీఆర్‌ ‌కన్నీటి పర్యంతమయ్యారు. సిఎం కేసీఆర్‌ ‌రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉద్యమ జ్ఞాపకాలను కేసీఆర్‌ ‌గుర్తు చేసుకున్నాడు.  తెలంగాణ ఉద్యమంలో సహచరుడిగా, ఒకే ప్రాంతవాసిగా రామలింగారెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని సిఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. రామలింగారెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కాగా, రామలింగారెడ్డి పాడెను మంత్రి హరీష్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి మోయగా…రామలింగారెడ్డిని కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు చిట్టాపూర్‌ ‌తరలివచ్చారు. . ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సహకారంతో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు రామలింగారెడ్డి. అందుకే ప్రజలు కూడా ఆయనకు గుండెల్లో గుడి కట్టుకున్నారు. నిరంతరం ప్రజలతో కలిసి, ప్రజల్లో గడిపి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అయ్యారు రామలింగారెడ్డి. ప్రజా నేతగా మారిన సోలిపేట రామలింగా రెడ్డి మృతిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే ఆయన… తమను వదిలేసి వెళ్లిపోయారని దుబ్బాక ప్రజలు విషాదంలో మునిగిపోతున్నారు. రామలింగారెడ్డి తమకు చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు కూడా అయ్యో… ఇలా జరగకుండా ఉంటే బాగుండేది… మంచి నేత అంటూ… ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రామలింగారెడ్డి మృతదేహంను చూసి అభిమానులు, సన్నిహితులు, పార్టీ శ్రేణులు కన్నీటిపర్యంతమయ్యారు. చిట్టాపూర్‌ ‌పరిసర ప్రాంతమంతా శోకసముద్రంలో మునిగిపోయింది.

అంతిమ యాత్రలో  కాలినడకన …
అన్నీ తానై వ్యవహరించిన మంత్రి హరీష్‌రావు
శాసన సభ్యుడు రామలింగారెడ్డి మరణించిన వార్త తెలిసిన వెంటనే  కుటుంబ సభ్యులను మంత్రి  హరీష్‌ ‌రావు  ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. మృతదేహం వచ్చినప్పటి నుంచి అంత్యక్రియల వరకు దగ్గరుండి ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. అంతిమ యాత్రలో సూచనలు చేస్తూ అన్నీతానై వ్యవహరించారు.   రామలింగారెడ్డి   మృతదేహం హైదరాబాద్‌ ‌నుంచి స్వగ్రామం చిట్టాపూర్‌  ‌వచ్చేవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అంతిమసంస్కారాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం  అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. దహన సంస్కారాలు జరిగే చోట అవసరమైన అన్ని ఏర్పాట్లను మంత్రి  దగ్గరుండి చేయించారు. పూలతో అలంకరించిన వాహనంలో శాసన  సభ్యుడు రామలింగా రెడ్డి భౌతిక కాయాన్ని ఉంచి అంతిమ యాత్ర నిర్వహించారు.    అంతిమ యాత్ర ప్రారంభంలో కొద్ది సేపు పాడెను మోసారు. అంతిమయాత్రలో ముందుండి సుమారు సుమారు కిలోమీటరున్నర దూరం వరకు కాలినడకన సాగారు. కడసారి అంతిమ వీడ్కోలు పలికేందుకు.. రామలింగా రెడ్డి  బంధువులు,  ప్రజలు,అభిమానులు,ప్రజలు   పెద్ద ఎత్తున తరలివచ్చారు. దారిపొడవునా ఇరువైపులా జనం నిలబడి నివాళి అర్పించారు.   రామలింగా రెడ్డి అమరహై అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినదించారు. అమర్‌ ‌రహే అంటూ అంతిమ యాత్ర సాగుతున్నంత సేపూ ప్రజల  నినాదాలు మిన్నంటాయి. జిల్లా కలెక్టర్‌  ‌వెంకట్రామ రెడ్డి ఆదేశాల మేరకు  వేల సంఖ్యలో వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు  ఏర్పాట్లు చేసి అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకున్నారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో చిట్టాపూర్‌ ‌గ్రామంలో   ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతికకాయానికి దహన సంస్కారాలు పూర్తయ్యాయి.

Leave a Reply