కేంద్ర మంత్రి బండి సంజయ్
పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
కరీంనగర్, ప్రజాతంత్ర, జులై 9: ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలని మాలో స్పూర్తినింపిన నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ అని, ఆయన బాటలో నడుస్తూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో టెన్త్ విద్యార్థులకు బుధవారం సైకిళ్లను పంపిణీ చేశారు. 20 వేల సైకిళ్లను కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని దశలవారీగా పంపిణీకి శ్రీకారం చుట్టారు. తొలుత నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నానని, బేటీ బచావో-బేటీ పఢావో కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని కలెక్టర్ పమేలా సత్పతి ప్రతిపాదించారని, ఆ ఆలోచనతోనే ఈరోజు సైకిళ్లు పంపిణీ చేస్తున్నానన్నారు. తన దగ్గరకు వచ్చిన కొందరు కార్పొరేట్ కంపెనీల యజమానులతో మాట్లాడగా వారు ఇచ్చిన సీఎస్సార్ ఫండ్‌తో సైకిళ్లను కొని మీకు పంపిణీ చేస్తున్నానని చెప్పారు. మోదీ ప్రభుత్వం విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోందన్నారు. ఈరోజు మీకందిస్తున్నవి సైకిళ్లు మోదీ గిఫ్ట్ అని, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అతి త్వరలో ‘మోదీ కిట్స్‌ను అందజేయబోతున్నామని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నంత కాలం ఏటా టెన్త్ చదివే విద్యార్థులకు సైకిళ్లు, మోదీ కిట్స్ అందజేస్తానని చెప్పారు. టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ బండి సంజయ్ చేపట్టిన ఈ కార్యక్రమం తమకు ఆదర్శం అని, ఇతర ప్ర్రజా ప్రతినిధులు కూడా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచనను తీసుకొచ్చారని చెప్పారు. కష్టపడి చదువుకుంటే లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులందరికీ 20 వేల సైకిళ్లను ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కు ప్రతీక సైకిల్.. మీరందరూ బాగా చదివి టెన్త్ క్లాస్ ఫలితాల్లో అగ్రగామిగా నిలవాలని, భవిష్యత్తులో బాగా చదువుకుని గొప్ప వాళ్లు కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఇది చాలా గొప్ప కార్యక్రమం.. కేంద్ర మంత్రికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నా అన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలనే ఆలోచనను కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలుత తమతో పంచుకున్నారు.. ఒక చిన్న ఆలోచన ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం.. అది కేంద్ర మంత్రికే చెల్లింది అని అన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని మాట్లాడుతూ
సైకిళ్లను అందజేయడం వల్ల పిల్లలకు సమయం ఆదా అవుతుందని, తల్లిదండ్రులకు రవాణా ఖర్చుల భారం తగ్గుతుందని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్ర మంత్రికి రుణపడి ఉంటారన్నారు.



