- ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి
- సామాజిక హక్కుల కార్యకర్త మేథా పట్కర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, : •హైదరాబాద్‌లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహిరించుకోవాలని ప్రముఖ సామాజిక హక్కుల కార్యకర్త మేథా పట్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు. శుక్రవారం నేషనల్
అలయన్స్ ఆప్ పీపుల్స్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సమావేశంలో మేథా పట్కర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జీవో 111ను రద్దు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం దారుణమనీ, మూసీ నదీ పరీవాహక ప్రాంతాలను పరిరక్షించే బదులు సీఎం ఏకంగా అందుకు సంబంధించిన జీవోనే రద్దు చేస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో రైతులు పండించే అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలనీ, కౌలు రైతులకు కూడా రైతు బంధుతో పాటు ఇతర అన్ని పథకాలలో లబ్దిదారులుగా చేర్చాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కూలీలలకు వేతనాలతో పాటు పని దినాలను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి బడ్జెట్‌లో అధిక శాతం నిధులు కేటాయించడంతో పాటు అటవీ హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. అసంఘిత రంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం వారి హక్కులను పరిరక్షించేలా సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలనీ, అలాగే, వలస కార్మికుల హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కిరణ్ విస్సా, మానవ హక్కుల వేదిక ప్రతినిధి ఎస్.జీవన్ కుమార్, మాన్ట్‌ఫోర్డ్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి బ్రదర్ వర్ఘీస్, వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ ప్రతినిధి లుబ్నా సర్వత్, దళిత్ బహుజన ప్రంట్ ప్రతినిధి పి.శంకర్, హెచ్‌ఆర్‌ఎప్ , ఎన్‌ఎపిఎం ప్రతినిధులు• సయ్యద్ బిలాల్, మీరా సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు.