Take a fresh look at your lifestyle.

‘‘సాంఘిక సాహిత్యం’’

‘అం‌తర్గత దృక్పథం ఎట్లా ఏర్పరుచుకున్నా యెవరికీ అభ్యతరం వుండకపోవచ్చును. కానీ ప్రత్యేకంగా వర్గ విద్వేషాలను ‘‘సాంఘిక సాహిత్యం’’లో వాంతి చేసుకోవటం నేరమన్న సోయి లేకుంట పోతాంది. కులమతాలు, ప్రాంతీయ, జాతివిద్వేషాలు సృష్టించిన రక్తపాతాల చరిత్ర నేర్పిన పాఠాలు తెలియని వారెవ్వరు!. ప్రత్యేకించి ఈ దేశమంతా ఒకే మతం, ఒకే భాషకు పరిమితం కావాలనే రహస్య ఎజెండా ఈ వర్గవిద్వేషాలను గోమూత్రమంత పవిత్రంగా తలకెత్తుకోవటం బహిరంగంగనే సాగుతున్నది.’

yelamandhaఇవతల చెప్పే విషయమేంటో దాని ప్రయోజనాల సారమెంతో అవతల అర్థం కావాలి. ఎవరికి వాళ్ళు వారి వారి ప్రయోజనాల పరిపృష్ణం కోసం సామాజిక మాధ్యమాల్ని భ్రష్టు పట్టించటం సాధారణ విషయంగా మారింది. చెప్పదల్చుకున్న విషయం అవుతల వారికి అర్థం కానప్పుడు చెప్పిన దానికి ‘‘ప్రయోజనమూ, గోంగూర’’లు యేముండక చదువరులకు కరోనా కన్నా కాలకూట విషంలాంటి దేదో తగిలే అవకాశం లేకపోలేదు. ఇలాంటి వర్గ విద్వేషాల చెత్తను సాహితీకరించి సాంఘిక మాధ్యమాల్లోకి పంపటానికి గల పరమార్థం ఏముంటుంది. రహస్య ఎజెండా సాధనలు తప్ప రహస్యంగా సంభాషించినా, మైకులో అరచినా, ట్విట్టర్‌లో మీటినా ఆ రాతల వెనుక యేముంది!? యెవరి ప్రయోజనాలున్నయనేది అర్థం కావటమే మెయిన్‌ ‌పాయింటన్నమాట!. అవతల అంటే పాఠకుడికి అన్నమాట! అట్టి పాఠకుడు చదివాక కుడి ఎడమలైనా, ఎడమ కుడియైనా అర్థం కాక జుత్తు పీక్కుంటూ వుంటే మనకెందుకు? రాయటం రాయటమే! అంటే రాసే వారి ఖర్మం! మన దారిలో మనంపోవటమే ‘‘మన (మను)ధర్మం’’ అనుకోక తప్పదు. అనుకుంటే మానవసమాజం కాపాడే వాళ్ళెవరూ కనిపించటం లేదు మరి! ఈ కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌జైలుకాలంలో పొద్దు పోక సోషల్‌ ‌మీడియాలో ముఖం పెడితె గనుక గుండె ఆగిపోయే వాక్యం భళ్ళున వాంతి జేసుకుంటది. అప్పటికప్పుడే రక్త పోటు పెరిగి, పోస్టుల్లో వాంతి జేసుకునే వాక్యాల దారులెంట నడిచే ప్రయత్నంచేస్తే గనుక, ఒళ్ళంతా గాయాలే! ఆ అక్షర గాయాలు కాగితంపై పరిస్తే దేశ ప్రజానీకం మానసిక చిత్త జాడ్యాలు యెలా వుంటుందోనన్న మన మస్తిష్కాల్లో మొలకత్తే ప్రశ్నలు కరోనాను మించి ప్రాణం తీసే అవకాశం వుంటున్నదని వీటిని నివారించేందుకు ప్రభుత్వం చట్టంచేసి చర్యలు తీసుకుంటున్నది. అయినా వాటి ధాటినాపటం యెవరి తరం కావటం లేదు. ఇది విచారకరం.

చాలాకాలంగా మనలో సహజంగా వున్న అనుమానం యేమిటంటే సోషల్‌ ‌మీడియాలో ఏదో ఓటి రాయటం అంత ‘వీజీ’ కాదూ! రాసిందేదైనా ఎంతో కొంత వాస్తావానికి జరంత దగ్గరుండాలని మనసు గోస పడ్తది. ఇప్పడది సూతలేకుంటనే ఛస్‌!…ఏదో ఒకటి రాయటం చాలా చాలా ‘వీజీ’అని చెప్పుకునేందుకు అనుకోకుండా కలిసొచ్చిన కాలం ఈ కరోనా లాక్‌ ‌డౌన్‌. ఇప్పుడు ఎవరిని చూసినా ‘‘ఆడర్‌! ఆడర్‌!’’ అనే న్యాయమూర్తి లాగనే కానత్తాండు. రకరకాల జాతీయ అంతర్జాతీయ విషయాలపై క్షణాల్లో తీర్పులు జెప్పుతున్నరు. గడప దాటకుండానే రెండు చేతులా, మూడుపూటలా రాస్తున్న తమ పైత్యాన్ని మాత్రం అవలీలగా ప్రపంచం దాటిస్తున్నారు. అలాంటి పైత్యం ధాటికి కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో నెటిజన్లంతా ఏది నిజమో! ఏది ‘‘దాల్చా’’ నో తెల్వక గాయ్‌ ‌గాయ్‌ ‌కాబట్టిండ్లు. కరొనా ఇంకా తన పని ముగించుకోని విమానమెక్కి వెళ్ళక ముందే ఈ కరోనా కాలపు సాంఘిక సాహిత్యం చదువరుల వర్తమాన, భావి జీవితాల్ని ఏం జేయనుందో ఊహించటం అంత ‘వీజీ’ కాదు. అది మిగల్చబోయే అవశేషం ఎంత భయంకరంగా వుంటుందో ఒక స్పష్టమైన చిత్రం మన వద్ద లేదు. కానీ, అనూహ్యమైన ఫలితం మానవ సమాజాన్ని ఖిన్నులను చేయటంమాత్రం ఖాయం. సోషల్‌ ‌మీడియా గందరగోళపు రాతలన్నింటినీ ‘‘కరోనా కాలపు సాంఘిక సాహిత్యం’’గా అచ్చేసే ప్రయత్నం చేస్తే కాల్పనిక సాహిత్యంలో ఎకాడమీ పురస్కారం సులభంగా లభించవచ్చునని అనుమానం అవగతమైతాంది.

ఈ ‘‘సాంఘిక సాహిత్య సైన్యం’’ లక్ష్యాలన్నీ విద్వేష ప్రచారాల్ని ముమ్మరం చేస్తున్న క్రమంలో మానవ సమాజంలో విభజన రేఖలు గీయకుంటా బాధ్యత వహించాల్సిందెవలు!? రాజ్యాంగం రక్షించి, దానిని తూ.ఛా. తప్పకుండా అమలు జేయాల్సిన వారే రాజ్యాంగంలోని లౌకిక భావనల్ని పాతరేషి, ప్రజల్లో ‘‘విద్వేషభక్తి’’ని ప్రవహింపజేయటం రేపటి ప్రమాదాలను సూచించటమని తెలిసిపోతున్నది. ఒక మతంపైన ప్రత్యేకంగా విద్వేషం జల్లే పని పథకం ప్రకారం సాగుతుంది, ఇది మానవ సమాజ సంక్షేమానికి విఘాతమని బుద్దిజీవులు సంతకాలతోని వినతులియ్యాల్సిన దుస్థితి మన దేశంలో నెలకోవటం విచారదాయకం. రాసిచ్చిన ‘‘రాతలే’’ తీర్పులయ్యే చోట, పరివార సాంఘిక మీడియా సైన్యం రాతలే రేపటి చట్టాలుగా రూపు దాల్చనున్నాయేమోనన్న భయాందోళనలు రేకెత్తుతున్నాయి. అంతర్గత దృక్పథం ఎట్లా ఏర్పరుచుకున్నా యెవరికీ అభ్యతరం వుండకపోవచ్చును. కానీ ప్రత్యేకంగా వర్గ విద్వేషాలను ‘‘సాంఘిక సాహిత్యం’’లో వాంతి చేసుకోవటం నేరమన్న సోయి లేకుంట పోతాంది. కులమతాలు, ప్రాంతీయ, జాతివిద్వేషాలు సృష్టించిన రక్తపాతాల చరిత్ర నేర్పిన పాఠాలు తెలియని వారెవ్వరు!. ప్రత్యేకించి ఈ దేశమంతా ఒకే మతం, ఒకే భాషకు పరిమితం కావాలనే రహస్య ఎజెండా ఈ వర్గవిద్వేషాలను గోమూత్రమంత పవిత్రంగా తలకెత్తుకోవటం బహిరంగంగనే సాగుతున్నది.

కరోనా విపత్తులో ఈ ‘‘సాంఘిక సాహిత్యపు’’ఉత్పాతం మరింత తీవ్రదశకు చేరి మైనారిటీ ప్రజల ఉనికికి ప్రమాద మేర్పడుతున్నది. అభద్రతా భావనలతో వారు పురుడు పోసుకున్న దేశంలోనే పరాయి వారుగా గుర్తించబడి, అవాంఛిత దేశద్రోహులుగా ముద్రలేయబడుతూంటె మానవ సమాజాన్ని భిన్న ధృవాలుగా చీల్చి ‘‘విద్వేషభక్త’’ ప్రవక్తలు సాధించదల్చిన అఖండ లక్ష్యమేందో తెలిసి వస్తున్నది.మానవ సమాజ హితాన్ని కోరేటి రచయితలూ, కవులూ, ఉపాధ్యాయ మేథో వర్గ ప్రతినిధులపై ‘‘అనుమానం’’ముద్రలేసి జనంలో భయాందోళనలు సృష్టించే చర్యలు పెరుగుతున్నాయి. ఈ ధోరణులను నిరసించకుంటే దేశభక్తి నినాదం చాటున ‘‘అఖండ’’ లక్ష్య సాధనకు దారులు సరిచేసుకునే ప్రయత్నాల్ని వేగవంతం చేసుకుంటుంది. ఈ లక్ష్యాల సాధన ప్రయత్నాల కోసం ప్రజల ఆలోచనలను పక్కదారుల బట్టించే క్రమంలో ‘‘సాంఘిక సాహిత్యపు’’ రాతలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని అరికట్టే చట్టాల్ని కఠినతరంగా అమలుచేయాల్సిన అవసరముంది. ఇందుకు న్యాయవ్యవస్థ తటస్థ వీక్షణ తక్షణ అవసరంగా తోస్తుంది. సూడ్రా బయ్‌! ‘‘ఇ‌క్రమార్క్’’! ఇం‌టానవు కదా! ఇన్నేండ్ల స్వాతంత్యం తరువాత సూత దేశభక్తులంటే ఎవలు!? అనే అనుమానం కలుగుతాంది!? నా ఈ ప్రశ్నకు సరైన జవాబు చెప్పాలె!? లేకుంటె నువు కూడ మర్కజ్‌ ‌మీటింగ్ల పోయినవని పుకార్‌ ‌లేపి ఫేస్‌ ‌బుక్‌ల పోస్ట్ ‌చేస్త! పైలం’’! అని బెదిరిచ్చే భేతాళ్‌ ‌ను ఎప్పటిలాగనే భుజానేసుకోని ‘‘విను! భేతాళ్‌! ‌రహస్య ఎజెండాలను బహిరంగంగనే జెప్పుకునే కాలమొచ్చింది. దేశమంత ఒకే భాష, ఒకే మతం కిందికి తేవాలనేది ఓట్లు రాల్చుకోని, అటెంక కార్పొరేట్‌ ‌శక్తుల ఊడిగంల తరించటమే ‘‘దేశభక్తి’’ అనేదే నేటి నిర్వచనం’’ అని జెప్పుకుంట భయం, భయంగ నడ్వబట్టిండు..నడ్వబట్టిండు.

– ఎలమంద, తెలంగాణ

Leave a Reply