“కన్యాశుల్కం నాటి సామాజిక బలహీనతకు దర్పణం. వివాహ వ్యవస్థలో సొమ్ము కోసం వృద్ధులకు చిన్నపిల్లలను అమ్ముకునే దురాచారం నేపథ్యంలో రాసిన నాటకం. అందులో పాత్రల చర్చ జీవితం, ఘర్షణ కూడా ముఖ్యమైనవే. కన్యాశుల్కం ముగింపు నాటకీయత మాత్రమే. గిరీశం పాత్ర ప్రగతిశీల ప్రాబల్యంతో సాగుతుందని నాటకం సూచిస్తుంది. రాజకీయాలను సామాజిక పరిస్థితులను విశ్లేషించడానికి లభించిన అరుదైన రచన కన్యాశుల్కం.”
చారిత్రక పరిణామ క్రమంలో సమాజం ద్వారా సమాజం కోసం మేలు చేసేవారు చరిత్రకు , ప్రజలకు కృతజ్ఞులు గా ఉండాలి. గురజాడ వర్తమానానికి భవిష్యత్తుకు ఒక వారధి.. ఆయన ఒక వైతాళికుడు. 1862 సెప్టెంబర్ 21న లో విశాఖపట్నం లో జన్మించిన గురజాడ, 1915 నవంబర్ 30 న విజయనగరంలో మరణించారు. గురజాడ 19వ శతాబ్దంలో జన్మించినా ఆయన రచనలు మాత్రం 20, 21వ శతాబ్ద ప్రజల కోసమని 1962 సెప్టెంబర్ 21 గురజాడ శతజయంతి సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు రాసిన మాటలు వాస్తవం.. గురజాడ రచనల అర్థంచేసుకోవడంలో సమకాలికులే కాదు తదనంతర సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తలు కూడా స్పందించలేదన్న విమర్శ ఉంది. తెలుగు సాహిత్య రంగంలో ఇంకా గురజాడను పూర్తిగా అర్థం చేసుకోలేక పోవడానికి కారణం ఆయనను లోతుగా అధ్యయనం చేయకపోవడం కావచ్చు. ఆయన సృజనాత్మక ఆలోచన అర్ధంచేసుకోవడానికి నేటి తరం కృషి చేయవలసిఉంది.
కన్యాశుల్కం నాటి సామాజిక బలహీనతకు దర్పణం. వివాహ వ్యవస్థలో సొమ్ము కోసం వృద్ధులకు చిన్నపిల్లలను అమ్ముకునే దురాచారం నేపథ్యంలో రాసిన నాటకం. అందులో పాత్రల చర్చ జీవితం, ఘర్షణ కూడా ముఖ్యమైనవే. కన్యాశుల్కం ముగింపు నాటకీయత మాత్రమే. గిరీశం పాత్ర ప్రగతిశీల ప్రాబల్యంతో సాగుతుందని నాటకం సూచిస్తుంది. రాజకీయాలను సామాజిక పరిస్థితులను విశ్లేషించడానికి లభించిన అరుదైన రచన కన్యాశుల్కం. కుల బేధం, కుల వివక్ష, మత విచక్షను, నిరసించి ప్రశ్నించిన గురజాడకు దళితులగురించి, వారికి జాతీయత గురించి ,ఐక్యత గురించి, అస్పృశ్యత గురించి మాట్లాడలేదన్న విమర్శ గురజాడ ఎదుర్కొన్నారని సాహితీపరుల అభిప్రాయం. చరిత్ర రచనలో తొంగిచూస్తున్న మతతత్వ దూరాచారాన్ని నిరసించిన ప్రజలు బుద్ధుని దేశం నుంచి తరిమివేసి దేశం చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’’ గేయం ద్వారా శాస్త్రీయ విజ్ఞానమే భవిష్యత్తుకు సోపానం అని గురజాడ అంగీకరించారు. ‘‘మన కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఒక భాష గ్రంథ రచనకు మరో భాషా?’’ అని ప్రశ్నించిన గురజాడ మాట్లాడుకునే భాషలోనే రచనలు ఉంటే ఎక్కువమందికి అర్థమవుతుందన్న యోచనతో వ్యవహారిక భాషలోనే రచనలు రావాలని గిడుగు రామమూర్తి తో కలిసి భాషా ఉద్యమంలో పాలుపంచుకున్నారు. విద్యారంగం గురించి ప్రస్తావిస్తా, విద్య సార్వత్రికమైన అంశమైనందువల్ల జనం మాట్లాడుకునే భాష లోనే బోధన, అభ్యాసం జరగాలని ఆయా ఆకాంక్షించాడు. సాహిత్యంలో, సమాజంలో కొత్తపాతల కలయిక ద్వారా సమగ్ర చర్చ జరగాలని ఆయన కోరుకున్నారు. కన్యాశుల్కం కథ ద్వారా గురజాడ సాహిత్య రంగంలో చేసిన కృషి అమోఘం.. వ్యాసాలు, చరిత్ర, కథలు, డైరీలు, నాటికలు, పుస్తకాల పై రాసుకున్న విశ్లేషణలు, వ్యాఖ్యలు, పాఠ్య భాషపై సమర్పించిన పత్రాలు ఆయన సాహితీ కృషికి ఆనవాళ్లు.
గురజాడ – ఠాగూర్ సారూప్యం:-
ఒకే కాలంలో వేరు వేరు ప్రాంతాలలో జీవించినప్పటికీ గురజాడ- ఠాగూర్ ఆలో చనలు భిన్నంగా ఉన్నా అభ్యు దయం భావం ఒకటే. వీరి ద్దరూ 1862 లోనే జన్మిం చారు. 2012 లోనే 150 ఉత్సవాలు జరిగాయి.. సమకాలికులుగా పరస్పరం తెలిసినవారే. ఠాగూర్ అంత విస్తృతంగా గురజాడ రచనలు చేసి ఉండక పోవచ్చు కానీ వాసిలో తక్కువేమీకాదని మహాకవి శ్రీశ్రీ నే అంగీకరించారు. జాతీయ ఉద్యమాలలో, సాహిత్య సాంస్కృతిక కృషిలో బెంగాలీలది ప్రత్యేక స్థానం. మానవతా వాదానికి ఊపిరిపోసిన గురజాడ 150వ ఉత్సవాల కంటే, ఠాగూర్ ఉత్సవాల స్థాయి ఎత్తులో ఉృడడానికి కారణం ప్రధాని ఠాగూర్ కార్యక్రమంలో పాల్గొనడం కావచ్చు.
కవి జీవించు ప్రజల నాలుకల యందు అన్న జాషువా మాట నిజం చేయాలంటే తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని వినీలాకాశంలో నిలిపిన సాహితీవేత్తలను స్మరించే జయంతి, వర్ధంతి సందర్భాల్లో సామాజిక అంశంగా ప్రజల మధ్య ఉత్సవాలు జరగాల్సిఉంది. ప్రభుత్వాలు నడుంబిగిస్తేనే, సాహిత్యం – పాలన పరస్పరం ప్రభావితమై నూతన వ్యవస్థ ఆవిష్కరణకు మార్గం సుగమమవుతుంది.
