- దిగ్భ్రాంతికి గురయిన ప్రపంచ క్రీడాభిమానులు
- సాకర్ ప్రపంచంలో అద్భుతాలు చాటిన ఆటగాడిగా రికార్డు
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, 1986 ఫిఫా ప్రపంచకప్ విజేత డిగో మారడోనా(60) హఠాన్మరణం చెందారు. బుధవారం గుండెపోటుకు గురైన ఆయన మృతి చెందారు. ఈ నెల ఆరంభంలో చేయించుకున్న మెదడు శస్త్రచికిత్స విజయవంతమైనా.. హఠాత్తుగా గుండెపోటుకు గురై మారడోనా ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. అర్జెంటీనా తరఫున 91 మ్యాచ్‌లు ఆడిన ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్ మారడోనా 34 గోల్స్ చేశారు. దేశం తరఫున నాలుగు ప్రపంచకప్‌ల్లో ప్రాతినిధ్యం వహించారు.
1986 మెగా టోర్నీలో జట్టుకు సారథ్యం వహించి అద్భుత ప్రదర్శనతో టైటిల్ అందించారు. ఆ విశ్వటోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై మారడోనా చేసిన గోల్.. శతాబ్దానికే అత్యుత్తమ గోల్‌గా చరిత్రలో నిలిచి పోయింది. మరో గోల్ చేయి తాకి నమోదైందన్న ఆరోపణలు ఫేమస్ కావడంతో అది ’హ్యాండ్ ఆఫ్ గాడ్’ గానూ పేరుతెచ్చింది. అలాగే 1990 ప్రపంచకప్‌లోనూ అర్జెంటినాను మారడోనా ఫైనల్‌కు చేర్చారు. క్లబ్ కెరీర్లో బార్సిలోనా, నపోలీ తరఫున బరిలోకి దిగిన డిగో ఆ జట్లకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. నపోలీకి రెండు సిరీస్-ఏ టైటిళ్లను సాధించిపెట్టారు.