Take a fresh look at your lifestyle.

సావిత్రిబాయికి…స్మృత్యంజలి

స్త్రీల హక్కుల గొంతుక
బహుజనుల ఆశా దీపిక
సంఘ సంస్కరణల భూమిక
సామాజిక ఉద్యమాల పతాక
విజ్ఞానప్రదాయి..సావిత్రిబాయి

వెలివాడల వెలితి బతుకుల్లో
వెలుగు నింపిన వెన్నెల రాణి

అజ్ఞానం కమ్మిన జీవితాలకు
విజ్ఞానం పంచిన అక్షరవాణి

విధివంచిత వితంతువులకు
పునర్వివాహం చేసిన కళ్యాణి

అంతరాల అగ్రవర్ణ వ్యవస్థపై
యుద్ధం ప్రకటించిన నారీమణి

మహిళా విముక్తి ఉద్యమాలకు
సంఘటితం చేసిన విప్లవకారిణి

స్త్రీ హక్కులే మానవ హక్కులని
దశ దిశలా చాటిన విదూషిమణి

కొత్త దారులు చూపడమే కాదు
ఆచరించి చూపిన ఆదర్శమణి

భర్త జ్యోతిరావు ఆశయ పథాన
నడిచి గెలిచి నిలిచిన ధర్మపత్ని

అక్షరాస్యతే ఆయువుగా
స్త్రీ సంక్షేమమే స్వప్నంగా

బహుజనోద్ధరణమే లక్ష్యంగా
సమసమాజ స్థాపనే సమస్తంగా

కడదాక ఉద్యమాల బాటన సాగి
చరిత్రలో సువర్ణాక్షరమై నిలిచింది
తొలి ఉపాధ్యాయిని
సావిత్రిబాయి పూలేకు
స్మృత్యంజలి ఘటిద్దాం
అక్షర నీరాజనం అర్పిద్దాం
మార్చి 10 న సావిత్రిబాయి పూలే వర్దంతి సందర్బంగా…
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply