పనిచేసే చోట లైంగిక వేధింపులపై ఫిర్యాదులు అందితే కలెక్టర్లు తక్షణమే స్పందించి అక్కడికక్కడే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మహిళల భద్రత కోసం ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారులతో ఏర్పాటైన అత్యున్నతస్థాయి కోర్ గ్రూప్ కమిటీ శుక్రవారం స్మితా సబర్వాల్ అధ్యక్షతన భువనగిరిలో సమావేశమైంది. మహిళలకు అత్యవసర సహాయం కోసం, భద్రత కోసం ఏర్పాటు చేసిన డయల్ 100, 181 తదితర హెల్ప్‌లైన్ వ్యవస్థల పనితీరు గురించి, ఇతర సలహాలను, సూచనలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ..మహిళా శక్తిని మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదన్నారు. మహిళల భద్రతా పరమైన సమస్యలు తెలుసుకుని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
మహిళల భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లపై విస్తృత ప్రచారం కల్పించి అవగాహన కలిగి ఉండేలా చూడాలన్నారు. మహిళల భద్రతా పరమైన సమస్యలు తెలుసుకుని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలోని ప్రతి మహిళా భద్రతతో ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. మహిళల భద్రత , రక్షణ కోసం హెల్ప్లైన్నెంబర్లపై విస్తృత అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న భరోసాతో పాటు చేపట్టాల్సిన చర్యలను క్షేత్రస్థాయిలో నిజానిజాలు తెలుసుకుని నివేదికను రూపొందిస్తామని తెలిపారు. గత 4, 5 సంవత్సరాల్లో ఇదే కమిటీ నివేదిక ఆధారంగా షీ టీమ్స్ ఏర్పాటు అయ్యిందన్నారు. ఉద్యోగులు పనిచేసే చోట లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేసినట్టయితే కలెక్టర్లు వ్యక్తిగతంగా స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఈ విషయంలో సర్క్యులర్ ఆదేశాలు ఉన్నందున బాధ్యులను అక్కడిక్కడే సస్పెండ్ చేయంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్లను కోరారు. ఈ విషయంలో ఇంకా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. గ్రామాలలో స్థలాలు లేకున్నా సిసిరోడ్లు కావాలని కోరడం కాకుంఆ భద్రత కోసం వీధి దీపాలు కావాలని, పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రశ్నించాలని ఆమె అన్నారు. హింస జరిగిన వెంటనే 181 నెంబరు ద్వారా సభి సెంటర్ హెల్ప్‌లైన్‌కు కాల్చేయాలన్నారు. అవసరమైతే 100 హెల్ప్‌లైన్‌కు వెంటనే ఫార్వర్డ్ చేసే బాధితులకు సత్వర భద్రత చేకూర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను అధిగమించేందుకు మానసికంగా బలోపేతం కావాలన్నారు. సమావేశంలో స్త్రీ, శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజ్, సీనియర్ ఐఎఎస్ అధికారి యోగితా రాణా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్, హైదరాబాద్ షీటీమ్ ఇన్చార్జి అనసూయ తదితరులు పాల్గొన్నారు.