Take a fresh look at your lifestyle.

‘‘‌చిన్నతోక -పెద్దలోపం’’

ఆ చిన్న తోకతోనే ఆడుతుంది
లోకమంతా…
దానికి లోబడి నడుస్తుంది
కాలమంతా….

ముందు కనిపించని
వెనుకరహస్యం.
వెనుకుండి నడిపించే
ముందు నిజం.

పేరుచివరలోనూ
ఊరుమొదటలోనో
వీధి మధ్యలోనో
మాట పొట్టలోనో
ఎక్కడున్నా చాలు.
ఆ బలమే ఆయుధం
ఆ బలగమే శాసనం.

ఎంతటి దూరాన్ని కూడా చేధించి
దగ్గరగా చుట్టేసి చుట్టుకుపోతూ
మనసులో మునిగి మనుషుల్ని తేల్చి
ఓ ఒడ్డుకు నెట్టి
గిరి గీసి ‘‘కులాన్ని ఆ చిన్నతోక’’గా
గౌరవంతో తాపడం చేసి
దూకుడును, ధిక్కారాన్ని
వరుసను, వర్గాన్ని,
గర్వాన్ని, బంధాన్ని
ఓ గొలుసుతో లోకానికి
అనుసంధించిన భావజాలమే
బహిరంగ రహస్యమే ‘‘కులం’’.

ఒక రంగు రుచిమరిగిన కళ్ళు
ఒక మత్తుకు బానిసైన మనసులు
ఒక రుచికి లొంగిన నాలుక
ఒక స్వరానికి అలవాటైన కంఠం
మరొకనేమాట వినిపించుకొని
చెవుల్లో ఏపుగా పెరిగిన వివక్ష
పీల్చే గాలికి గీతలు గీసి
తాగే నీటికి తగాదా నేర్పి
బతుకుల్లో విపరీతాలని
మనసుల్లో వైపరిత్యాలను
పోషించే విషం.
పూజించే కల్మషం ‘‘కులం’’

వీరిమధ్యజి
ఏ తోకలేనివారే అనాధులు.
అన్ని ఉన్నా ఒంటరి విరోధులు
నిత్యం ఏదో ఒక చోట
పీడించబడే అభాగ్యులు.

పుట్టేది ఏ కులమో తెలియకపోయినా
కళ్ళు తెరిచేలోగే
ముఖంపై ఓ ముద్రతో
అడుగుపెట్టే లోకంలో
శాసించే శక్తికి వారసులు గానో
వివక్షకు బలయ్యే బలహీనులు గానో
ఎవరికి ఎవరు తెలియదు.

పుట్టుక ,చావు
చీము, నెత్తురు
ఆకలి, నిద్ర
కోరిక, కల
అంతా, అన్నిటా ఒకటే
అయినా ఒక్క పదం మనసును నిలువుగా చీల్చే అభిమానం ఒకచోట
అనివార్యం మరో చోట.

ఎక్కడిదీ వైరస్‌…ఎప్పటికో వాక్సిన్‌
ఎవడికి పుట్టిన బుద్దిలోపమో?
లోకంలో అడుగడునా శాపమే.
ఏప్పుడూ ఎక్కడో ఒక చోట ఘోరమే.
– చందలూరి నారాయణరావు
9704437247

Leave a Reply