మందకొడిగా మున్సిపల్ నామినేషన్లు

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్భందీ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన నామినేషన్ దాఖలు కేంద్రాన్ని బుధవారం జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ప్రావీణ్య, ఐఎఎస్ సందర్శించి పలు సూచనలు సంబంధిత అధికారులు సూచించారు. జిల్లాలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది.
పలు పార్టీల అభ్యర్థులు, ఆశావహులు, నేతల మద్దతు కూడగట్టి పార్టీ అధికారిక అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. బుధవారం రోజున పెద్దపల్లిలో 36 వార్డులకు గాను కొన్నింటిలో 29 నామినేషన్లు దాఖలు చేయగా, మరికొన్ని వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 15వార్డులకుగాను మొదటి రోజు 8నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే మంథని మున్సిపాలిటీలోని 13 వార్డులకుగాను మొదటి రోజు13 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో అధికార పార్టీకి చెందిన జడ్పిచైర్మన్ పుట్ట మధుకర్ సతీమణి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పుట్ట శైలజ తొలిరోజు నామినేషన్ దాఖలు చేయడం విశేషం. రామగుండం కార్పొరేషన్లోని 50 డివిజన్లకు గాను మొదటిరోజు 42నామినేషన్లు దాఖలయ్యాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
Tags: sultanabad, telangana municipal elections 2020, peddapalli district