Take a fresh look at your lifestyle.

బానిస వ్యవస్థది లోతైన విషాద గాథ – నిర్మూలనే పరిష్కారం

కన్నీటికి ఇంకి పోయే లక్షణమే లేకుంటే ఈ ప్రకృతిలో మరో సాగరం పొంగుతూ ఉండేది. ఈ అనంత చరిత్రలో బానిసలు కార్చిన కన్నీటిరాశి సాగరమంత పరి మాణంలో నే ఉంటుంది. ఆ వ్యవస్థది అంత లోతైనవిషాద గాథ. కానీ, శబ్దం చేయకుండా ఆ కన్నీటి సంద్రం చరిత్రనంతటినీ తడుపుతూనే ఉంది. పిరమిడ్ల నిర్మాణానికి రాళ్లెత్తిన వాళ్లూబీ అమెరికా, రష్యాల ఆర్థిక వ్యవస్థలకు పునాదులు తవ్విన వాళ్లూ బానిసలే. పురాతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాతలు వారే. అయినా ఈ భూప్రపంచం మీద ఏ జాతి, ఏ దేశం, ఏ కాలం, ఏ మతం బానిస వ్యవస్థ మౌన రోదనకు కరగలేదు? ఆధునిక నాగరికతకు ఆకృతినివ్వడానికి బానిసలు కురిపించిన ఘర్మజలానికి ఎవరూ ఖరీదు కట్టలేదు.బానిసత్వం, బానిసలు అనే పేర్లు వినగానే అదేదో వేల ఏళ్ల నాటిదని ప్రపంచం భావించవచ్చు. కానీ అది శుద్ధ అబద్ధం. వాస్తవానికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బానిసత్వాన్ని రద్దు చేశాయి. కానీ ఎక్కడ చూసినా ఆ వ్యవస్థ జాడ కనిపిస్తోంది. ఈ ఆధునిక ప్రపంచంలో కాళ్లకూ చేతులకూ గొలుసులతో, అర్ధనగ్నంగా బానిసలు కానరారు. కానీ బానిస వ్యవస్థ ఒక వాస్తవం. గ్లోబల్‌ ‌సర్వే ఇండెక్స్ అం‌చనా ప్రకారం ప్రపంచంలో ఇవాళ మూడు కోట్ల అరవై లక్షల మంది బానిసలుగా బతుకుతున్నారు.

బలవంతపు చాకిరి, రుణం చెల్లించలేక బానిసలుగా బతకడం, అక్రమ రవాణాతో స్త్రీ, పురుషులు బానిసలుగా మారిపోవడం, బలవంతపు పెళ్లిళ్లు ఇవన్నీ బానిసత్వం పరిధిలోనివేనని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. బానిసత్వం గురించి కొద్దికాలం క్రితం బీబీసీ చేసిన వ్యాఖ్య మరీ ఆందోళన కలిగిస్తుంది. 16వ శతాబ్దంలో ఆఫ్రికా నుంచి తెచ్చిన నల్ల బానిసలతో జరిగిన వ్యాపారం చరిత్రలోనే అతి పెద్దది. అప్పుడు విక్రయించిన బానిసలు కోటీ 20 లక్షలు. కానీ ఆ సంఖ్య ఇప్పుడు రెట్టింపు పైనే ఉందని (రెండు కోట్ల 70 లక్షలు) అని బీబీసీ వెల్లడించింది. ఈ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇప్పుడు తీవ్ర కృషి ప్రారంభించినా మరో 30 ఏళ్లు పడుతుందని ఆ అంతర్జాతీయ సమాచార వ్యవస్థ అభిప్రాయపడింది. అధికారికంగా 200 సంవత్సరాల క్రితమే బానిసత్వం అంతమైంది. కాని మానవుల అధికార దాహం వల్ల నేటికీ ఇది కొనసాగుతూనే వుంది. ప్రపంచం మొత్తంమీద వివిధ రూపాలలో 2.7 కోట్లమంది ప్రజలు బానిస బ్రతుకులు బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ బానిసత్వ విముక్తి దినోత్సవం గురించి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి మూన్‌ ‌మాట్లాడుతూ 2 డిసెంబర్‌ 1949‌లో మానవులను తస్కరించడంపై నిషేధం విధించాలని అప్పటి సభ్యులు పట్టుబట్టారని తెలిపారు. ఆ తర్వాత 2004లో డిసెంబర్‌ 2 ‌న ప్రపంచ వ్యాప్తంగా దాస్య శృంఖలాల విముక్తి దినోత్సవం పాటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికీ పిల్లలను అమ్మడం, బంధువులను, కూలీలను తస్కరించి అమ్మేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో ఉన్నప్పటికీ ఆ మూలాలు నేటికీ అలానే ఉన్నాయని ఆయన ఆవేదన చెందారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఎనిమిది లక్షలమందిని కిడ్నాప్‌ ‌చేసి అమ్మేస్తుంటారని, అలాంటివారిని బానిసలుగా మార్చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలలోని ఇండ్లల్లో పనిచేసేవారిని బానిసలకన్నా హీనంగా చూస్తున్నారని చెప్పారు. పాత తరాల వారు ఇప్పటికి కూడా తమ ఇండ్లల్లో పని చేసేవారిని బానిసల్లాగే చూస్తున్నారని, నెలకు 500 నుండి 1000 రూపాయల జీతం తీసుకునే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వీరిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా వున్నారని ఆయన తెలిపారు. మానవ సంబంధాలపై ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తీసుకు రావాల్సివుందని. దీంతో బానిసత్వాన్ని నిర్మూలించడానికి దోహదపడేలా చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని చెప్పారు.

అమెరికాలో 16 నుండి 19వ శతాబ్దం వరకు ఉన్న బానిసత్వం ఇప్పుడు కొత్త రకంగా తయారైంది. పిల్లల వద్ద బలవంతంగా పని చేయించుకోవడం, బలవంతపు పెళ్ళిళ్ళు, మానవులను కిడ్నాప్‌ ‌చేసి అమ్మేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. మనుషులను తస్కరించడాన్ని నిరోధించడానికి అమెరికా 2001 నుండి ప్రతి ఏటా 30 కోట్ల డాలర్లను 120 దేశాలకు పంపుతుంది. అమెరికాలో 1860లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అబ్రహం లింకన్‌ ‌గెలుపొందిన తర్వాత 13వ అధికరణం కింద బానిసత్వాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకచట్టం తీసుకువచ్చారు.
హమ్మురాబి స్మృతి (క్రీ.పూ.1754), రుగ్వేదం, మను స్మృతి, నారద స్మృతి, ఆర్థశాస్త్రం, బైబిల్లలో బానిస వ్యవస్థ స్వరూప స్వభావాలు కనిపిస్తాయి. అయితే భారతదేశంలో బానిస వ్యవస్థకీ, ప్రపంచంలో మిగిలిన చోట్ల కనిపించే బానిసత్వానికీ ఎంతో తేడా ఉంది. ఏమైనా క్రీస్తుపూర్వమే ఈ భూమ్మీద బానిస వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ ఘోర వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. నిగళాలు తెంపి పారేయడానికి బానిసల తిరుగుబాట్లు జరిగాయి. సంస్కరణోద్యమాలు జరిగాయి.

ఈ దారుణమైన వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ దిశగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన తొలియత్నం 1926 నాటి జెనీవా స్లేవరీ కన్వెన్షన్‌. ‌నానాజాతి సమితి దీనిని నిర్వహించింది. తరువాత 1930, 1948, 1956లలో అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. వీటితో మార్పు రాలేదని చెప్పడం లేదు. కానీ కొత్త రూపంలో మళ్లీ బానిసత్వం దర్శనమిస్తూనే ఉంది. ఇది ప్రపంచ మానవాళి చిత్తశుద్ధిని శంకించేదే. బానిసత్వ నిర్మూలన దినమంటూ పాటించడం దాని ఫలితమే. సాటి మనిషిని బానిసగా, పశువులా చూడ్డమనే కళంకం నుంచి ప్రపంచం బయటపడలేదని గుర్తు చేయడమే.
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply