Take a fresh look at your lifestyle.

కేసీఆర్ చెంప చెళ్లు..

  • హుజరాబాద్ ప్రజలకు నా గెలుపు అంకితం…!
  • అకుంఠిత దీక్షతో పోరాడిన కార్యకర్తలకు శిరస్సువంచి నమస్కరిస్తున్న
  • ఎమ్మెల్యేను కాదు, ఉద్యమ బిడ్డనే
  • ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా 
  • హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హుజురాబాద్,నవంబర్2( ప్రజాతంత్ర విలేకరి): రాష్ట్రంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో తన విజయానికి అహర్నిశలు శ్రమించి, గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నా గెలుపును అంకితం ఇస్తున్నానని మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రకటించారు. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఎంతో కృషి చేసి, ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తనకు విజయాన్ని అందించారని అన్నారు. తన విజయానికి సహకరించిన ఓటర్లకు శిరస్సువంచి దండం పెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.  టిఆర్ఎస్ ప్రభుత్వం నీచమైన రాజకీయాలకు ఒడి కట్టిందని గత ఆరు నెలలుగా జరిగిన సంఘటనలను, వేధించిన విషయాలను చెప్పుకుంటూపోతే కొత్త చరిత్ర అవుతుందన్నారు.  రాస్తూ పోతే ఒక పుస్తకమే తయారవుతుంది అన్నారు. అన్ని ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు తనను ఎంతగానో ఆవేదనకు గురిచేశాయి అన్నారు.  ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించేందుకు ప్రయత్నించినా శత్రువులకు చిక్కకుండా ఓటర్లు తనకు విజయాన్ని కట్టబెట్టారని అన్నారు.  రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను, మాట్లాడే నోల్లను మూయించి పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  స్వేచ్ఛగా రాయలేక, చూపించలేక కవులు, కళాకారులు అనేక ఇబ్బందులకు గురయ్యారని వివరించారు. ధర్మాన్ని నమ్ముకుంటే ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తారు అనేది ఈ ఎన్నికతో తేలిందన్నారు.
25 వందల కోట్లు ఖర్చు పెట్టి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ నా దళిత సోదరులు తనను నమ్ముకుని వెన్నంటి ఉన్నారని ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. యువకులు పులిబిడ్డ పనిచేసి తన గెలుపుకు కృషి చేశారని తెలిపారు. ఎన్నికల అధికారులు పోలీసు అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తన విజయానికి సామాన్య కార్యకర్త తో పాటు కేంద్ర నాయకత్వం వరకు కష్టపడి పని చేసిందని ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.  నరేంద్ర మోడీ నుంచి మొదలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధర్రావు, అరవింద్, బొడిగె శోభ, వివేక్, తుల ఉమ వందలాది మంది నాయకులు తన కోసం కష్టించి పని చేశారని వారందరికీ పేరు  పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఏమాత్రం నిజాయితీగా పని చేయలేదని విమర్శించారు.
తమ అధిష్టానం 68 దరఖాస్తులను ఇచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించలేదని అన్నారు.  ఇప్పటికైనా వెనుకంజ వేయనని మళ్ళీ సెంట్రల్ కమిటీని కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఐదు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్నారు హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రతి దళిత బిడ్డకు వెంటనే దళిత బంధు అందజేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక దళిత కుటుంబానికి చేరవేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  అదేవిధంగా మిగతా బిసి ఎస్టీ ఓసి కులాలు అన్నిటికీ ఇదే పథకాన్ని వర్తింపజేయలన్నరు. పేదలను ఆదుకోవాలని ముందుకు వెళ్తానన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తమ సొంత జాగాలో కట్టుకునేందుకు ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.
నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నియామకాల ఈ విషయంలో ప్రభుత్వం మాటేత్తడం లేదని,  వెంటనే నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువతను ఆదుకోవాలన్నారు.  రాష్ట్రంలోని నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు.  రైతులకు గిట్టుబాటు ధర,  అర్హులైన 57ఏళ్ల వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు ఒత్తిడి తెస్తాం అని వివరించారు. తన ప్రస్థానం ఇంకా ఉద్యమ బిడ్డగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు.  అసంఘటిత కార్మికులకు, ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తాం అని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన తో పాటు ఆయన సతీమణి జమున,  వివేక్ వెంకటస్వామి, ధర్మారావు రాష్ట్రస్థాయి,  జిల్లాస్థాయి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply