Take a fresh look at your lifestyle.

నైపుణ్యమే ఉపాధికి ఉత్తమ మార్గం…!!!

ఏ దేశ ప్రగతినైనా ప్రభావితం చేసే అంశాల్లో మానవ వనరులే కీలకమైన పాత్ర పోషిస్తాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్న వైనం మనందరికీ తెలిసిందే. ఘనమైన మన వారసత్వాన్ని కొనసాగిస్తూ, రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యతలను తమ భుజ స్కంధాలపై మోసే యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతీ ఏడాదీ జూలై 15 రోజున ‘‘ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం’’ నిర్వహించడం ముదావహం. యువతకు ఉపాధి కల్పించే వివిధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఉద్యోగుల సంఘాలు, విధాన నిర్ణేతలు మరియు యువత అభ్యున్నతిని కాంక్షించే పలువురు శ్రేయోభిలాషులు పరస్పరం చర్చించుకునే విధంగా ఈ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఐక్య రాజ్య సమితి నిర్వచనం ప్రకారం 15 – 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తులను యువతగా పరిగణిస్తారు. ప్రపంచంలో వీరి సంఖ్య దాదాపుగా 1.2 బిలియన్లు లేదా 120 కోట్లు (ప్రపంచ జనాభాలో 16 శాతానికి సమానంగా) ఉన్నదని, 2018 సంవత్సరానికి సంబంధించిన ‘వరల్డ్ ‌యూత్‌ ‌రిపోర్ట్’ ‌ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మన భారతదేశ జనాభా 139 కోట్లు ఉంటే అందులో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సులో నున్న యువత దాదాపు 25 కోట్లు ఉన్నట్లు సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గత యేడాదిన్నర కాలంగా అధిక శాతం విద్యార్థులే అయిన యువత చదువు లేదా వివిధ వృత్తి పరమైన శిక్షణకు దూరమై, ఘోరమైన దుస్థితిలోనున్నారు. సాంకేతిక, వృత్తి పరమైన విద్య మరియు శిక్షణా సంస్థలపై ఇటీవలే జరిపిన ఒక సర్వే ద్వారా యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ప్రపంచ బ్యాంకులు సంయుక్తంగా సేకరించిన సమాచారంలో తేలిందేమిటంటే పాఠ్యప్రణాళిక రూపు రేఖలు మారిపోవడం, విద్యార్థి – గురువుల మధ్య బంధం కృత్రిమంగా మారడం, నెట్‌ ‌వర్క్ ‌సమస్యలు మొదలైన ఒడిదొడుకులెన్నో ఎదురైనా కూడా ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో దూర విద్యా పద్ధతిలోనే చదువు లేదా శిక్షణ కొనసాగించడం అనివార్యమైందని. కరోనా సంక్షోభం కారణంగా 2020 సంవత్సరంలో యువత ఉపాధి అవకాశాలు 8.7 శాతం మేరకు తగ్గిపోయినట్లుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాలు తెలుపుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా యువతలో నైపుణ్యాభివృద్ధికి యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ మొదలైన సంస్థలు నిరంతరం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి. భారతదేశంలో యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ‘మినిస్ట్రీ ఆఫ్‌ ‌స్కిల్‌ ‌డెవలప్మెంట్‌ అం‌డ్‌ ఎం‌టర్ప్రెన్యూర్షిప్‌’ ‌మంత్రిత్వ శాఖ ఇతోధిక కృషి చేస్తున్నది. దేశంలో నైపుణ్యాల అభివృద్ధికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల సమన్వయం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల డిమాండ్‌ – ‌సప్లై ల మధ్య అంతరాన్ని నిర్మూలించడం, సాంకేతిక మరియు వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, కొత్త నైపుణ్యాలను ప్రవేశపెట్టడం, వినూత్నమైన ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం లాంటి విధులను వర్తమానానికే గాక భవిష్యత్తులో కూడా పనికొచ్చే విధంగా ఈ శాఖ నిర్వహిస్తున్నది. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 38 సెక్టార్‌ ‌నైపుణ్య మండళ్లు, 33 జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలు, 15000 పారిశ్రామిక శిక్షణా సంస్థలు మరియు 187 భాగస్వామ్య శిక్షణా సంస్థలు పనిచేస్తున్నాయి. కోటి మంది యువతలో నైపుణ్యాలను పెంచేందుకు గాను 12,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ ‌కేటాయింపులతో ప్రవేశ పెట్టబడిన ‘‘ప్రధాన మంత్రి కౌశల్‌ ‌వికాస్‌ ‌యోజన (పి. ఎమ్‌. ‌కె. కె. వై)’’ 2016- 2020 సంవత్సరాల మధ్య కాలంలో 95 లక్షల మంది యువతకు 375 వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వగలిగింది. దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఉచితంగా అందజేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ‘నైపుణ్య భారత్‌ ‌మిషన్‌’ ‌క్రింద ఈ మంత్రిత్వ శాఖ అధునాతనమైన శిక్షణా సంస్థలను ప్రతీ జిల్లాకు ఒకటి చొప్పున ‘ప్రధాన మంత్రి కౌశల్‌ ‌కేంద్ర (పి. ఎమ్‌. ‌కె. కె)’ పేరుతో నెలకొల్పడానికి చర్యలు చేపట్టడం విశేషం.

2021 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని ‘మహమ్మారి అదృశ్యానంతరం యువత నైపుణ్యాలను తిరిగి ఊహించడం’ (రీ ఇమాజినింగ్‌ ‌యూత్‌ ‌స్కిల్స్ ‌పోస్ట్ ‌పాండెమిక్‌) అనే ఇతివృత్తం ఆధారంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించి పోర్చుగల్‌ ‌మరియు శ్రీలంక దేశాల శాశ్వత మిషన్లు యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ, యువతకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ‌రాయబార కార్యాలయాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తాయి. కరోనా మూడో వేవ్‌ ‌రూపంలో పొంచి ఉన్న ప్రమాదం తదితర కారణాల వల్ల అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడి సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం అవాంఛనీయం కనుక ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలన్నీ అంతర్జాల మాధ్యమంలోనే నిర్వహిస్తున్నారు.

అపారమైన మానవ వనరులు కలిగిన దేశంగా గుర్తింపు పొందిన మన దేశంలో ఇప్పటికే దాదాపు 25 కోట్ల సంఖ్యలో యువత తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో తగిన ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా సంక్షోభం యువత భవిష్యత్తుపై ఒకింత నిరాశ, నిస్పృహలను వెదజల్లిందనేదొక చేదు నిజం. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అని బోధించిన వివేకానందుడి మాటల్లోని పరమార్ధాన్ని గ్రహించి మన దేశంలోని యువతకు నైపుణ్యాలను పెంపొందించేందుకు సరైన శిక్షణను అందించి, వివిధ వృత్తుల్లో మన యువత తమ ప్రతిభను సమర్ధవంతంగా ప్రదర్శించి, ఉత్పాదకతను పెంచి ప్రపంచానికే వారు ఆదర్శమై వెలుగొందడానికి ఈ ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా మనమంతా కూడా మన వంతు కృషి చేద్దామని ప్రతిన బూనుదాం.
– మోహన్‌ ‌లింగబత్తుల
9398522294

Leave a Reply