Take a fresh look at your lifestyle.

నైపుణ్యం ఉంటే ప్రపంచం చేతుల్లో..

  • కొరోనా నేపథ్యంలో మారుతున్న ప్రాథామ్యాలు
  • నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ

వేగంగా మారుతున్న ప్రపంచంలో, అనేక రంగాలలో మిలియన్ల మంది నైపుణ్యం గల వ్యక్తుల అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల్లో నైపుణ్యం గల వారి అవసరం అధికంగా ఉందన్ననారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ‘స్కిల్‌ ఇం‌డియా మిషన్‌’‌ను ప్రారంభించిందని తెలిపారు. ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి వీడియో ద్వారా ప్రసంగించారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా వందలాది ప్రధాన మంత్రి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయన్నారు. ఐటీఐల సంఖ్యను పెంచామని, లక్షలాది కొత్త సీట్లను చేర్చామన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా యువతలో నైపుణ్య అభివృద్ధి జరిగిందని తెలిపారు. నాలుగైదు రోజుల క్రితం దేశంలోని కార్మికుల కోసం ‘స్కిల్‌ ‌మ్యాపింగ్‌ ‌పోర్టల్‌’‌ని ప్రారంభించామని మోదీ తెలిపారు. నైపుణ్యం కలిగిన వ్యక్తులను, కార్మికులను మ్యాపింగ్‌ ‌చేయడంలో ఈ పోర్టల్‌ ‌ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు, ఈ పోర్టల్‌ ‌ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను ఒకే క్లిక్‌తో చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. కొరోనా వల్ల ఏర్పడిన ఈ సంక్షోభం ప్రపంచంలో అన్నిదేశాలలో సమానంగా ఉంటుందన్నారు.

ఈ ప్రభావంతో ఉద్యోగ స్వభావం కూడా మారిందన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికత కూడా ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. చిన్న, పెద్ద ప్రతి రకమైన నైపుణ్యం కూడా స్వావలంబన భారతదేశానికి చాలా పెద్ద శక్తిగా మారుతుందని మోదీ స్పష్టం చేశారు. నైపుణ్యం అనేది స్వయం సమృద్ధిని సాధిస్తుందన్నారు. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలన్నారు. ప్రపంచం వేగంగా మారుతున్న సమయంలో.. వ్యాపారాలు, మార్కెట్లు అనునిత్యం ప్రభావానికి లోనవుతుంటాయని, కొరోనా మహమ్మారి నేపథ్యంలో నైపుణ్యం అనేది చాలా కీలకమైందని, ఇలాంటి సమయంలోనే యువత తమ నైపుణ్యానికి పదును పెట్టాలన్నారు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. కొరోనా మహమ్మారి వల్ల ఉద్యోగ ప్రవృత్తి మారిపోయిందని, టెక్నాలజీ కూడా మారుతూపోతున్నదని, కానీ మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా యువత నైపుణ్యాన్ని సంపాదిస్తున్నారని మోదీ తెలిపారు. నైపుణ్యం అనేది మనకు మనం ఇచ్చుకునే బహుమతి అని, అది అనుభవంతో వృద్ధి చెందుతుందని, కాలానికి దీనితో సంబంధంలేదని, సమయం గుడస్తున్నాకొద్ది నైపుణ్యం పెరుగుతుందని మోదీ అన్నారు. నైపుణ్యం విశిష్టమైందన్నారు. ఇది ఇతరుల నుంచి మిమ్మల్ని వేరు చేస్తుందన్నారు. జ్ఞానం, నైపుణ్యం మధ్య కొందరు ఎప్పుడూ అయోమయపడుతుంటారని ప్రధాని అన్నారు. పుస్తకాల్లో చదివి, ఇంటర్నెట్‌లో చూసి ఎలా సైకిల్‌ ‌తొక్కాలో తెలుసుకోవచ్చు, దీన్నే మనం నాలెడ్జ్ అం‌టామని, కానీ ఆ జ్ఞానం ఉన్నంత మాత్రన సైకిల్‌ ‌తొక్కే గ్యారెంటీ ఉండదన్నారు. వాస్తవానికి సైకిల్‌ ‌తొక్కాలంటే.. స్కిల్‌ ఉం‌డాలని ప్రధాని ఓ ఉదాహరణ ఇచ్చారు. ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవాలన్న తపన లేకుంటే.. అప్పుడు జీవితం ఆగిపోతుందన్నారు. దాంతో అతని జీవితం భారంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply