Take a fresh look at your lifestyle.

కొన్ని విజయాలు… కొన్ని విమర్శలు.. మరికొన్ని వైఫల్యాల ఆరేళ్ళ తెలంగాణ

దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి నేటికి ఆరేళ్ళుపూర్తయింది.. ఒక ప్రాంతంకోసం పద్నాలుగేళ్ళపాటు ఏకదాటిగా ఉద్యమించి, ఫలప్రదం చేసుకోవడమే కాకుండా, ఉద్యమనేతే  రాష్ట్రానికి మొదటిసారిగా ముఖ్యమంత్రి కావడమన్నది బహుషా దేశచరిత్రలో ఒక్క తెలంగాణలోనే జరిగి ఉంటుంది.  ఈ పద్నాగేళ్ళ ఉద్యమంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, మరెన్నో కన్నీటి గాథలు. వీటన్నిటికి మూలకారణమైన  నిధులు, నీళ్ళు, నియామకాల కోసం చేసిన పోరాటం ఫలితంగా ఆరేళ్ళకింద ప్రత్యేక రాష్ట్రంగా సాక్షాత్కారమైంది. సాకారమైన రాఫ్ట్రాన్ని పైన చెప్పిన లక్ష్యాలవైపుకు తీసుకువెళ్ళడంలో పాలకులు ఇప్పటికే ఎంతోకొంత ప్రగతిని సాధించినప్పటికీ, ఇంకా సాధించాల్సింది చాలానే ఉంది.  పాలనను వికేంద్రీకరించి, ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్ళేందుకు పదిజిల్లా రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విస్తరించింది మొదలు  దేశంలో ఎక్కడాలేని విధంగా వందలాది సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి, విజయవంతంగా అమలుపరుస్తున్న నేపథ్యం లో దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అమలుచేయడంలో ఆసక్తిని కనబరుస్తున్నతీరు నిజంగా తెలంగాణకు గర్వకారణమే. ప్రధానంగా అసరా,కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, ‌రైతుబంధు లాంటి పథకాలు సమ్మోహనాస్త్రాలుగా ప్రజల్లోకి దూసుకుపోయాయి. వృత్తి, కులసంఘాలు మొదలు  సమాజంలోని ప్రతిఒక్కరినీ ఏదో పథకరూపేణ ఆర్థికంగా ఆదుకునే ప్రణాళికలెన్నిటినో ఈ ఆరేళ్ళకాలంలో ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు  ఎదుర్కున్న కరెంటు కష్టాలిప్పుడులేవు.  మొదటినుండి మనది వ్యవసాయాధారిత దేశం. రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతంమంది ఇంకా గ్రామాల్లో వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతకాలంగా వారు వరుణుడి  కోసం ఎదురు చూడడంతప్ప మరో మార్గంలేకుండా పోయింది. దశాబ్ధాలకాలంగా ఇక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సాగునీటి కష్టాన్ని కేవలం ఆరేళ్ళలోనే  తెలంగాణ ప్రభుత్వం తీర్చడమన్నది ఆశామాషీ విషయంకాదు. సాగు, తాగు నీటికష్టాలను తొలగించడంకోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఉద్యమనాయకుడు అటు ముఖ్యమంత్రి బాద్యతలతోపాటు, ఇంజనీర్‌ అవతారాన్నెత్తి, సాధించిన సాంకేతిక ప్రగతికి ప్రపంచమే అబ్బురపడిందంటే అతిశయోక్తికాదేమో. తన మేథాశక్తితో పలు నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేయడమే కాకుండా, దాదాపు రికార్డుసమయంలో వాటిని పూర్త్చ్ఱి యడంకూడా గొప్పవిషయమే. కేవలం నాలుగేళ్ళ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని పూర్తిచేయడం ద్వారా తెలంగాణ ఇంజనీరింగ్‌ ‌సామర్ధ్యం ప్రపంచవ్యాప్తమైంది. నీటిపారుదల రంగంలో దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడమన్నది ఓ సాహసచర్యే. అదే వరుసలో తాజాగా కొండపొచమ్మ సాగర్‌ ‌ప్రాజెక్టు ప్రారంభోత్సవంచేసుకుంది. గడచిన ఆరేళ్ళకాలంలో నిర్విరామంగా వివిధ ప్రాజెక్టుల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని పూర్తి కాగా, మరికొన్నిటి పనులు చురుగ్గా సాగుతున్నాయి.  ఉమ్మడిపాలనలో తాంబాళాలుగా మారిన చెరువులను మిషన్‌కాకతీయ పథకంతో పునర్‌ ‌జీవింపజేయడంతో పాటుగా వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని కృష్ణా, గోదావరికింద నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులు, కాలువల ద్వారా నింపి, వాటికింద వేలాది ఎకరాలను సేద్యంలోకి తీసుకురావడంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఆకుపచ్చని పంట పొలాలతో ఇవ్వాళ తెలంగాణ కళకళలాడుతోంది.. చంద్రబాబు పాలనలో వరుసగా పదేళ్ళు ఏర్పడిన కరువు పరిస్థితులు, వైఎస్‌ అధికారం చేపట్టినప్పుడు  కొంత సడలినప్పటికీ, ప్రత్యేకరాష్ట్రంలో భవిష్యత్‌లో కరువు అన్నమాటే ఉండదనిపించే విధంగా విస్తృత సాగునీటి సదుపాయం లభ్యమవుతున్నది.అలాగే ఈ రంగానికి ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ‌తోడుకావడంకూడా సాగు విస్తీర్ణం పెరిగేందుకు వీలేర్పడింది. అందుకే జాతీయోత్పత్తిలో అరవైశాతం తెలంగాణ భాగమే ఉండటం ఈ రాష్ట్రానికి గర్వకారణం. ఈ పంట కాలంలో  దేశవ్యాప్తంగా 83 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరిస్తే అందులో 53 లక్షల టన్నుల ధాన్యం తెలంగాణనుండి వచ్చిందేనని ఇటీవల ఫుడ్‌కార్పోరేషన్‌ ‌ప్రకటించడాన్నిబట్టి  బంగారు తెలంగాణకు దారులు పడుతున్నట్లుగానే కనిపిస్తున్నది.
ఇదిలా ఉంటే ప్రభుత్వంపై విమర్శలుకూడా లేకపోలేదు.  వివిధ రంగాల్లో ప్రగతి సాథిస్తున్నట్లుగా  చెబుతున్న ప్రభుత్వం వాటిల్లో అనేక అవినీతి, అక్రమాలను మూటకట్టుకున్నదన్న ఆరోపణలున్నాయి.  ప్రపంచంలోనే ఆద్భుత ఇంజనీరింగ్‌ అని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అక్రమాలు దొర్లాయని నేటికీ ప్రతిపక్షాలు చెవులో గూడుకట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాయి. నీటి లభ్యత సరిగాలేని దగ్గర ప్రాజెక్టు నిర్మాణంచేసి కోట్ల రూపాయలను వృధాచేస్తున్నారని, కమీషన్ల కోసమే పనికిరాని ప్రాజెక్టులను చేపడుతున్నారంటూ కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.  కృష్ణాలో మావాటా ఎంత అంటూ ఉద్యమకాలంలో గొంతెత్తిన కెసిఆర్‌ ‌పోతిరెడ్డుపాడు విషయంలో ప్రతిపక్షాలు ఉద్యమించేవరకు మాట్లాడకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.     కనురెప్ప వాల్చేంత సేపుకూడా కరెంటు పోకుండా విద్యుత్‌ను అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం విద్యుత్‌ ‌కొనుగోలు, విద్యుత్‌ ‌ప్రాజెక్టులపై చేస్తున్న వ్యయంపై ఆ పక్షాలు అనుమానాలను  వ్యక్తంచేస్తున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే ఉండకూడదని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కుట్రచేస్తోందన్న విమర్శకూడా లేకపోలేదు. తెలంగాణ ఉద్యమకాలంలో ఆందోళనకారులపై లాఠీలు ఝళిపించి, తిట్టి తరిమికొట్టిన వారినే ఇవ్వాళ మంత్రిపదవుల్లో కూర్చోబెట్టడాన్ని ప్రజలింకా జీర్ణిఇంచుకోలేకపోతున్నారు. ప్రాణాలకు తెగించి పోరాటంచేసినవారు ఇవ్వాళ తెలంగాణ వ్యతిరేకుల పాలనకింద బ్రతుకాల్సిన పరిస్తితి ఏర్పడిందన్న విమర్శ చాలాకాలంగా ప్రజలమద్య నలుగుతోంది. వోటుకు నోటు తదితర కేసులలాంటివెన్నిటినో ప్రభుత్వం ఎటూ తేల్చకుండా వదిలేస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అలాగే ప్రణాళికలను రూపొందించి వదిలివేయడమేగాని, అవి కింది స్థాయిలో ఎలా అమలవు తున్నాయో తెలుసుకునే విషయంలో ప్రభుత్వం విఫలమవుతుందన్న విమర్శకూడా లేకపోలేదు. తాజాగా లాక్‌డౌన్‌ ‌కాలాన్నే పరిశీలిస్తే ఒక్క గింజ కూడా మిగులకుండా రైతుల దగ్గరి మొత్తం పంటను కొనుగో లుచేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, కొనుగోలు విషయంలో జరిగిన తీవ్ర జాప్యం చివరకు రైతులకు నష్టాలను, కష్టాలను తెచ్చిపెట్టింది. ధాన్యం నింపేందుకు కావాల్సిన గోనె సంచలు లేవని, తీసుకెళ్ళేందుకు లారీలు లేవని, రైస్‌ ‌మిల్లర్లు పేచీ పెడుతున్నారని ఇలా అడుగ డుగునా అనేక ఇబ్బందులను రైతులు ఎదుర్కున్నారు. ధాన్యం కొనుగోలుచేసి నెలరోజులు కావస్తున్నా ఇంకా డబ్బులు రాలేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికంతటికీ సిబ్బందిపై ప్రభుత్వానికి సరైన అజమాయిషీలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవ్వాల్టికీ కొంతమంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాలను పొందలేకపోవడం, కొత్త వ్యవసాయ విధానంపై  రైతులతో ముందస్తుగా  సంప్రదించకుండానే తమకు తోచినట్లుగా పంటలను రైతులపై రుద్దటాన్ని కూడా రైతులు, ప్రతి పక్షపార్టీలుకూడా తీవ్రంగా విమర్శి స్తున్నాయి.  గడచిన ఆరేళ్ళ పాలనలోని లోటుపాట్లను బేరీజు వేసుకుని భవిష్యత్‌లో పాలనను రూపకల్పన చేసుకుని బంగారు తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం బాటవేస్తుందని ఆశిద్దాం.

Leave a Reply