Take a fresh look at your lifestyle.

హుజురాబాద్‌ ‌లో వోటు కు ఆరు వేలు ..అయినా భిన్న సంకేతాలు

అధికారపక్షం ఈ విధంగా డబ్బు పంచిన తర్వాత ఉపఎన్నిక ఫలితం ఎలా ఉండాలి..? తిరుగులేని మెజారిటీతో అధికారపక్షం అభ్యర్ది విజయం సాధించాలి. అవునా..! కానీ హుజూరాబాద్‌ ‌నుంచి వస్తున్న సంకేతాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున అధికారపక్షం ప్రలోభపెట్టిన తర్వాత కూడా ఆ పార్టీ ఆభ్యర్ధి పరాజయం పాలయితే… హుజూరాబాద్‌ ‌వోటర్లు ఎవరిని గెలిపించాల్సిందీ ముందే నిర్ణయించుకున్నారనీ, డబ్బులు పంచినందువల్ల ఆ నిర్ణయం మారదనీ హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం తీరును గమనించిన పరిశీలకులు కొందరు చెబుతున్నారు. ఆ నిర్ణయాన్ని వోడించేందుకే అధికారపక్షం వోటు విలువను అంత పెద్ద స్థాయికి తీసుకువెళ్లిందని అంటున్నారు. అప్పటికీ అక్కడ అధికారపక్షం గెలిస్తే టిఆర్‌ఎస్‌ ‌ధనస్వామ్యం  విజయం సాధించినట్లు. లేని పక్షంలో ప్రజాస్వామ్యం గెలిచినట్లు. రెండవదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రానున్న ఎన్నికలపై ఈ ఫలితం స్వాగతించదగిన ప్రభావం  చూపకమానదు.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం పరిసమాప్తి అయింది. ఇక అసలు వ్యవహారం మొదలయింది. పోలింగ్‌ ‌కు మిగిలిన వ్యవధిని రాజకీయపక్షాలు సద్వినియోగం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో సహజంగానే ప్రతిపక్షాల కన్నా అధికారపక్షం ముందుంది. వోటుకు ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు లక్షా 50 వేల మందికి నిన్న మూడు గంటల వ్యవధిలో గప్‌ ‌చిప్‌ ‌గా పంపకం జరిపినట్లు మీడియా రిపోర్టు చేసింది. వీణవంక మండలంలోనయితే వోటుకు ఎనిమిది వేల రూపాయల చొప్పున పంచారట.. ఈ పంపకంలో అధికారపక్షం సహజంగానే కొంతమందిని పక్కన పెట్టింది. బీజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ ‌కు దగ్గర వారనో, బీజెపి సానుభూతిపరులనో ఈ వోట్లు ఎటూ మనకు వచ్చేవి కావులే అన్నట్లు కొందరిని దూరం పెట్టారు. దానితో మాకెందుకు డబ్బులు పంచరు మేమేం పాపం చేశాం అంటూ కొందరు రోడ్డు కెక్కారు. పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చింది. ఈ పరిస్థితిని మనం ఎలా అర్ధం చేసుకోవాలి.. ఒక అసెంబ్లీ సీటును ఉపఎన్నికలో కైవసం చేసుకోవడానికి వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టే రాజకీయపక్షం ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తుంది..? ఇక్కడ ఒక్క అధికారపక్షాన్నే నిందించాల్సిన పని లేదు. బీజెపి కూడా ఆ దారిలోనే పయనిస్తున్నది. కాస్త ఎక్కువ తక్కువ అంతే. కాంగ్రెస్‌ ‌మిగతావారికన్నా వెనుక ఉన్నది కాబట్టి డబ్బుల జోలికి వెళ్లడం అనవసరంలే అని ప్రస్తుతానికి అనుకోవచ్చునేమో కానీ, ఆ పార్టీ కూడా తక్కువేం తినలేదు.

నిత్యం ఈ రాజకీయాలలో పొర్లే పార్టీల నేతలు అవినీతి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం అసలు విచిత్రం. ఉపఎన్నికలను హైస్టేక్స్ ‌పోటీగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దే..! ఆ మధ్య నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో కూడా ఇలానే వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. నిజానికి సమైక్య రాష్ట్రంలో ఈ ధోరణికి మొట్టమొదటిగా నాంది పలికిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాలలో క్రమంగా ఎన్నికలు భయంకరమైన ఖర్చు తో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ప్రజాస్వామ్యం అని మనం అనుకోవడమే కానీ..నిజానికి ఇది ధనస్వామ్యం తప్ప మరోటి కాదు. ఓ మధ్య తరగతి మనిషి శాసనసభ ఎన్నికలలో గానీ, లోక్‌ ‌సభ ఎన్నికలలో గానీ పోటీ చేయడాన్ని ఊహించగలమా మనం ఇప్పుడు.. ఈ పరిస్థితికి విరుగుడు ఏమిటి..? పోటీ చేసే రాజకీయపక్షాలు డబ్బు పంచడం మానుకోవాలి.. అది సాధ్యమేనా..? డబ్బు నీళ్లలా ఖర్చు చేసి ఎన్నికలలో గెలిచిన తర్వాత అసలూ.. వడ్డీ కూడా అవినీతి దారుల్లో పోగేసుకోవడం అలవాటయిన తర్వాత రాజకీయపక్షాలు, అభ్యర్ధులు డబ్బు పంచడం మానుకుంటారా..! మరో పరిష్కారం ప్రజలు డబ్బు తీసుకోవడానికి నిరాకరించడం. డబ్బు అందనివారు మాకెందుకు పంచరంటూ రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి నుంచి వెనక్కువెళ్లడం సాధ్యమేనా.. విచ్చలవిడిగా డబ్బు పంచుతూ వోట్లు అమ్ముకోవడం జనానికి   అలవాటు చేసిన రాజకీయపక్షాలను నిందిద్దామా, లేక రాజకీయపక్షాల నుంచి డబ్బులు డిమాండ్‌ ‌చేస్తున్నందుకు ప్రజలను నిందిద్దామా..?

2019 ఎన్నికలలో జనసేన డబ్బు పంచదంటూ పవన్‌ ‌కళ్యాణ్‌ ఒక స్టాండ్‌ ‌తీసుకున్నారు. అంతటా అది అమలయి ఉండకపోవచ్చు కానీ ఆయన స్టాండ్‌ ‌వల్ల ఒక చర్చ అయితే జరిగింది. ఈసారి పవన్‌ ‌కళ్యాణ్‌ ఏం ‌చేస్తారు.. అప్పుడు డబ్బు పంచకపోవడం వల్లనే వోటమి పాలయ్యామని ఈసారి పంపకం మొదలుపెడతారా. లేక పాత వైఖరికి కట్టుబడిఉంటారా..? ఇది పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది. పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుంది తరహా పరిస్థితి. దీని నుంచి బయటకురావడం అంత తేలిక కాదు కానీ.. ప్రస్తుతం హుజూరాబాద్‌ ఉపఎన్నికలో అధికారపక్షమే ఒక పరిష్కారం చూపిస్తున్నట్లు కనబడుతోంది. వోటుకు ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకూ పంచడం అన్నది ఇంతవరకూ ప్రజలు ఎప్పుడూ ఎరగని విషయం. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈసారి హుజూరాబాద్‌ ఉపఎన్నికను ఆ స్థాయికి తీసుకువెళ్లారు. ఎలాగైనా సరే ఈటల రాజేందర్‌ ‌తిరిగి శాసనసభలో ప్రవేశించకుండా అడ్డుకోవాలన్న పంతం ఆయనలో విచక్షణను నశింపజేసినట్లు కనబడుతోంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి డబ్బు కవర్‌ ‌లో పెట్టి లక్షా 50 వేల మందికి చాలా పకడ్బందీగా ఆ కవర్లు అందించగలిగారు. ఇలా ఒక క్రమ పద్ధతిలో డబ్బు కవర్లు అందించడం కూడా ఇదే మొదటిసారి. మిగిలిన వారికి మరింత ఎక్కువ డబ్బు అందించనున్నట్లు వినబడుతోంది. అధికారపక్షం ఈ విధంగా డబ్బు పంచిన తర్వాత ఉపఎన్నిక ఫలితం ఎలా ఉండాలి..? తిరుగులేని మెజారిటీతో అధికారపక్షం అభ్యర్ది విజయం సాధించాలి. అవునా..! కానీ హుజూరాబాద్‌ ‌నుంచి వస్తున్న సంకేతాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున అధికారపక్షం ప్రలోభపెట్టిన తర్వాత కూడా ఆ పార్టీ ఆభ్యర్ధి పరాజయం పాలయితే… హుజూరాబాద్‌ ‌వోటర్లు ఎవరిని గెలిపించాల్సిందీ ముందే నిర్ణయించుకున్నారనీ, డబ్బులు పంచినందువల్ల ఆ నిర్ణయం మారదనీ హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం తీరును గమనించిన పరిశీలకులు కొందరు చెబుతున్నారు. ఆ నిర్ణయాన్ని వోడించేందుకే అధికారపక్షం వోటు విలువను అంత పెద్ద స్థాయికి తీసుకువెళ్లిందని అంటున్నారు. అప్పటికీ అక్కడ అధికారపక్షం గెలిస్తే టిఆర్‌ఎస్‌ ‌ధనస్వామ్యం  విజయం సాధించినట్లు. లేని పక్షంలో ప్రజాస్వామ్యం గెలిచినట్లు. రెండవదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రానున్న ఎన్నికలపై ఈ ఫలితం స్వాగతించదగిన ప్రభావం  చూపకమానదు.

Leave a Reply