- మర్రిమిట్ట వద్ద ఆటో ఢీకొన్న లారీ
- పెళ్లింట తీరని విషాదం..సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాతి
- సంతాపం ప్రకటించిన మంత్రులు…అండగా ఉంటామని ప్రకటన
మహమూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లో గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద లారీ-ఆటో ఢీకొన్న సంఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు పురుషులు ఉన్నారు. మృతుల వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, గూడూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్నారు. ఓ శుభకార్యానికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కినట్లు సమాచారం. ఈ క్రమంలో గూడురు శివారులో లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతోనే అది నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపు తున్నారు.
మరికొన్ని రోజుల్లో ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల వీరి కుమార్తె వివాహం కుదిరింది. పెళ్లికి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి దుస్తులు కొనుగోలు చేసేందుకు వధువుతో పాటు వారి కుటుంబసభ్యులు ఆటోలో వరంగల్‌కు వెళ్తున్నారు. అంతలోనే వీరు ప్రయాణిస్తున్న ఆటోను మర్రిమిట్ట వద్ద లారీ ఢీకొనడంతో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహబూబాబాద్ పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రొక్లెయినర్ సహాయంతో ఆటోను పక్కకు జరిపారు. మృతదేహాలను బయటకు తీశారు.
గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఎర్రకుంట తండా వాసులుగా భావిస్తున్నారు. మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ సైతం ఘటనపై దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులతో మాట్లాడారు.