Take a fresh look at your lifestyle.

సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం..!

  • అక్కన్నపేటలో ఏకే 47తో కాల్పులు
  • ఒకరికి గాయాలు, పరారీలో నిందితుడు
  • దర్యాప్తునకు 3 ప్రత్యేక పోలీసు టీంలు

Man fires with AK 47 rifle in Siddipetసిద్దిపేట జిల్లాలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇరు కుటుంబాల మధ్య ఉన్న ప్రహారీ గోడ పంచాయతీ కాల్పులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని అక్కన్నపేటకు చెందిన దేవుని సదానందం, గుంటి గంగరాజు కుటుంబాల మధ్య మూడు రోజుల క్రితం ప్రహరీ గోడ విషయంలో మాటామాట పెరిగి గొడవ పెద్దదైంది. సదానందం కోపోద్రిక్తుడై తన ఇంట్లో ఉన్న ఏకే-47 గన్‌ తీసుకుని గంగరాజుపై కాల్పులు జరిపాడు. గంగరాజుకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తుపాకీ కాల్పులతో అక్కన్నపేట గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలియగానే అక్కన్నపేటలో భారీగా పోలీసులు మోహరించారు. నిందితుడు పరారీలో ఉన్నా ఆయన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఏకే 47 గన్‌ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.

ఘటనపై కామారెడ్డి జిల్లా ఎస్పీ, సిద్దిపేట ఇంఛార్జి పోలీస్‌ ‌కమిషనర్‌ ఎన్‌.‌శ్వేతా శుక్రవారమిక్కడ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ..గంగరాజుకు, సదానందం భార్య కృష్ణవేణికి సిమెంట్‌ ఇటుకల విషయంలో గొడవ జరిగిందని తెలిపారు.ఈ గొడవను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 6న రాత్రి 9 గంటల సమయంలో సదానందం, గుంటి గంగరాజు ఇంటి కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీలో నుండి తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడన్నారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు అక్కన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు.నిందితుడి వేటకు హుస్నాబాద్‌ ఎసిపి మహేందర్‌, ‌సిద్దిపేట ట్రాఫిక్‌ ఎసిపి బాలాజీ, సిద్దిపేట ఎసిపి రామేశ్వర్‌ల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు సిపి శ్వేతా వివరించారు. కేసును త్వరలోనే చేధిస్తామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply