Take a fresh look at your lifestyle.

సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి సీఎం కేసీఆర్‌

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు నాగార్జునసాగర్‌ ఆయకట్టును కూడా కలుపుకుని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని అన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్‌, ‌వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరేరామ్‌, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియా, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిందన్నారు. దుమ్మగూడెం పాయింట్‌ ‌వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుందనీ, ఈ నీటి ద్వారా యావత్‌ ‌ఖమ్మం జిల్లాను నీరు అందించవచ్చన్నారు. దుమ్మగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి అటు ఇల్లంద వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్‌కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలని సూచించారు. దీంతో పాటు సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాల్వలకు సంబంధించి మిగిల పనుల సర్వే వెంటనే పూర్తి చేసి టెండర్లు పిలవాలని ఆదేశించారు.

మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి పాలేరు రిజర్వాయర్‌ ‌వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్‌ ‌కల్లా పూర్తి చేయాలనీ, కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్‌ ఆయకట్టుకు నీరు అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Leave a Reply