అప్రమత్తతతో ప్రాణ నష్టాన్ని నివారించాం

– వరదలపై సీఎం సమీక్షిస్తున్నారు
– సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయి
– వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 28: ప్రభుత్వం, అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామని, వరద ముంపులో చిక్కుకున్న అనేకమందిని రక్షించామని మహిళా, శిశు సంకేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారన్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా క్లౌడ్‌ బరస్ట్‌ జరగటం వరద ఉధృతి పెరిగిందన్నారు. నష్టాన్ని అంచనా వేస్తున్నామని, బాధితులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని, ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయకుండా ఎవరికి తోచినట్టు వారు బాధితులకు అండగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వర్షాల కారణంగా కోతకు గురైన రహదారులను, ముంపునకు గురైన లోతట్టు గ్రామాల్లో పరిస్థితులను ఆమె గురువారం పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌ షెట్కార్‌ కూడా ఉన్నారు. రవాణా, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. అంతకుముందు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను మంత్రి సీతక్క అప్రమత్తం చేశారు. షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌లతో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, జిల్లా అధికారులు, బాన్స్‌వాడ సబ్‌ కలెక్టర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో వరద పరిస్థితిపై సమీక్షించారు. ప్రాజెక్టులు, చెరువులు పూర్తిగా నిండి నీటిని కిందకు వదిలినప్పుడు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఇండ్లలోకి చేరిన వరద నీటిని త్వరగా బయటకు పంపే ఏర్పాటు చేయాలని సూచించారు. పాత ఇండ్లు ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉన్నందున వర్షాలు తగ్గు ముఖం పట్టినప్పటికీ ఆయా ఇళ్లలో ప్రజలు నివాసం ఉండకుండా, ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, పాడుబడ్డ భవనాల వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలన్నారు. వ్యవసాయ, విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, మిషన్‌ భగీరథ వాటర్‌ పైప్‌లైన్‌ లీక్‌ కాకుండా చూడాలని, ప్రమాదకరమైన బ్రిడ్జిలు, కల్వర్టుల మీదుగా ప్రయాణాలు కొనసాగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ సురేష్‌ మాట్లాడుతూ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున నిజాంసాగర్‌, పోచారం ప్రాజెక్టుల నుండి నీరు వదిలే ముందు పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాబాద్‌ ప్రత్యేక అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రిలీఫ్‌ కేంద్రాలకు వరద బాధితులను తరలించాలని, నిజాంసాగర్‌ కింది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి నీటిని వదలాలని అధికారులకు తెలిపారు. లో లెవెల్‌ కాజ్‌వేలు, బ్రిడ్జిల వద్ద 100 నుండి 200 మీటర్ల దూరంలోనే ట్రాఫిక్‌ని ఆపేసి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని, పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ నిజాంసాగర్‌ నుండి అధిక మొత్తంలో నీటిని వదులుతున్నందున పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, బాన్స్‌వాడ సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోలు ఎప్పటికప్పుడు మండలస్థాయి అధికారులతో సమీక్షిస్తూ రిలీఫ్‌ కేంద్రాలను నిర్వహించాలని, శుద్ధమైన తాగునీరు, నిరంతరాయ విద్యుత్తు సరఫరా అయ్యేలా చూడాలని, వరద నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *