Take a fresh look at your lifestyle.

‘సిట్‌’ ‌దర్యాప్తు అటకెక్కిందా ..!

“పీపుల్స్‌వార్‌తో చర్చల సందర్భంలో, చర్చలకువచ్చిన దళసభ్యులు రెండవ రోజు, నయీం వల్లతమ దగ్గరికి వచ్చే వారికి ప్రమాదం ఉంటుందని, అప్పటి ఇంటెలిజెన్స్ అధికారికి నయీం దగ్గరి వ్యక్తి అని, అందువల్ల నయీంను కొంత కాలం రాష్ట్రం నుండి బయటకు పంపమని హోం మంత్రికి చెప్పమని మాకు చెప్పంపారు. నేను, బాలగోపాల్‌, ‌పాశం యాదగిరి గారు వెళ్ళి హోంమంత్రికి ఈ విషయం చెప్పాము.”

(‌నిన్నటి సంచిక తరువాయి )….

నయీం ఎన్‌కౌంటర్‌ ‌తర్వాత ఒక టివీ ఛానెల్‌లో మాట్లాడుతూ, మాజీ డి.జి.పి. దినేష్‌ ‌రెడ్డి ‘‘అప్పుడున్న పరిస్థితిలో నక్సలైట్‌ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వ అనుమతితో నయీమ్‌ను వాడుకోవలసి వచ్చింది’’ అని చెప్పాడు. 1997 – 2000 వరకు ఎస్‌ఐబీ చీఫ్‌గా పని చేసిన రిటైర్డ్ అధికారి శ్రీరామ్‌ ‌తివారి, నక్సలైట్ల సమాచారం చేరవేయడానికి మాకు నయీం సహాయం చేసేవాడని పత్రికలకు తెలిపాడు. అప్పుడప్పుడు తన ఆఫీసుకు వచ్చి కలిసే వాడని, జైళ్లో నుండి కూడా జైలులోని ఉద్యోగుల ద్వారా సమాచారం పంపించేవాడని చెప్పాడు. ఆయన చాలా ధైర్యశాలి అని, పార్టీలో ఉండగా చాలా బాధలు పడ్డాడని, ప్రతీకారంతో మసలుతుండేవాడని చెప్పాడు. నయీం జైలు నుండి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిపై పీపుల్స్‌వార్‌ ‌చేయబోయే యాక్షన్‌ ‌గురించి కోడ్‌ ‌భాషలో చెప్పంపాడు కాని, మేము ఆ భాష సరిగ్గా అర్థం చేసుకోలేక హోం మంత్రిని కాపాడలేకపోయామని ‘‘సాక్షి’’ పత్రికలో శ్రీరాం తివారి చెప్పినట్టు కథనం వచ్చింది.
నయీంకు పకడ్బందీ సమాచార వ్యవస్థ ఉండేది. ఎవరు ఎక్కడ తన గురించి మాట్లాడినా ఆయనకు అందేది. ఒకసారి బాలగోపాల్‌ ‌గారితో, మాజీ ఎపిసిఎల్‌సి సభ్యుడొకాయన యురేనియంకు వ్యతిరేకత పాదయాత్రలో పాల్గొంటూ, నయీం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, నయీంకు తెలిసాయి.

ఇంటికి వెళ్ళిన రాత్రి ఆ వ్యక్తిని చంపుతానని నయీం ఫోనులో బెదిరించడంతో, నల్లగొండ విడిచివెళ్ళి, ఆరు నెలల తర్వాతతిరిగి వచ్చి, ఒక పత్రికా విలేకరి ద్వారా రాజీ కుదుర్చుకున్నాడు. పీపుల్స్‌వార్‌తో చర్చల సందర్భంలో, చర్చలకువచ్చిన దళసభ్యులు రెండవ రోజు, నయీం వల్లతమ దగ్గరికి వచ్చే వారికి ప్రమాదం ఉంటుందని, అప్పటి ఇంటెలిజెన్స్ అధికారికి నయీం దగ్గరి వ్యక్తి అని, అందువల్ల నయీంను కొంత కాలం రాష్ట్రం నుండి బయటకు పంపమని హోం మంత్రికి చెప్పమని మాకు చెప్పంపారు. నేను, బాలగోపాల్‌, ‌పాశం యాదగిరి గారు వెళ్ళి హోంమంత్రికి ఈ విషయం చెప్పాము. అక్కడి డి.జి.పి. స్వరజిత్‌సేన్‌, ‌చర్చలను మానిటర్‌ ‌చేస్తున్న ఒక అధికారి, అరవిందరావులు ఉండిరి, చిన్న వాదన తర్వాత హోంమంత్రి జానారెడ్డి సర్‌ అట్లానే చేస్తాం, పార్టీ వాళ్ళకు చెప్పండి అన్నాడు. చర్చలు ఆగిపోయిన తర్వాత రెండు వారాలకు నాకు, బాలగోపాల్‌కు నయీం నుండి బెదిరింపులు ఉత్తరాలు వచ్చాయి. నేను జానారెడ్డి గారికి నాకొచ్చిన ఉత్తరం చూపిస్తే, చాలా ఆశ్చర్యపడి, విచారణ జరిపిస్తా అన్నాడు. ఏ స్థాయిలో నయీంకు పోలీసుతో సంబంధాలు ఉండేవో ఈ సంఘటన తెలుపుతుంది.

2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడు. కాని నయీం కార్యక్రమాల విషయంలో మార్పేమి రాలేదు. వైఎస్‌ఆర్‌కు వ్యక్తిగత భద్రతకోసం తెచ్చుకున్న సూరి కడప నుండి తన ముఠాతో వచ్చాడు. నయీంతో ఆయన ముఠాకు ఘర్షణ రాలేదు. ఒక ఒప్పందంతో మాదాపూర్‌, ‌కూకట్‌పల్లి, మియాపూర్‌, ‌చందానగర్‌ ‌ప్రాంతాల్లోసూరి ముఠా భూదందాలు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడేది. నయీం అటువైపు వెళ్ళేవాడు కాదు. చాలా మంది తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్‌ ‌నాయకులు, కాలక్రమేణా పార్టీలు మార్చి టిఆర్‌ఎస్‌లో చేరిన వారందరికీ నయీంతో మంచి సంబంధాలు వుండేవి. ఇప్పుడు కౌన్సిల్‌ ‌చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్‌, ఉమామాధవరెడ్డి, మేచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్‌, ‌ప్రస్తుత మంత్రి శ్రీనివాసగౌడ్‌లతో సహా నయీంకు సన్నిహితులని వార్తలు వెలువడ్డాయి. వరంగల్‌, ‌కరీంనగర్‌లోని రాజకీయ ప్రముఖులు 2005లో మక్తల్‌ ఎమ్మెల్యేలు, చిల్లెమ్‌ ‌నర్సిరెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వరరెడ్డితోబాటు ఇంకా అయిదుగురిని పీపుల్స్‌వార్‌ ‌నక్సలైట్లు కాల్చి చంపారు.

అందులో అనుమానితులుగా భావించిన ముగ్గురు పీపుల్స్‌వార్‌ ‌కార్యకర్తలను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చివేయగా, ఇదే సంఘటనలో అరెస్టుకాబడ్డ వడ్డెర కులానికి చెందిన బండారు మల్లేశ్‌, ‌ముదిరాజ్‌ ‌కులానికి చెందిన మనోహర్‌, ఉస్మానియా పోస్టు గ్రాడ్యుయేషన్‌ ‌చేస్తున్న యువకులు, మహబూబ్‌నగర్‌ ‌జైలు నుంచి  విడుదల అయినప్పుడు తల్లిదండ్రుల ముందే పోలీసులు ఎత్తుకెళ్ళారు. ఆ ఇద్దరి యువకుల్ని పోలీసులు నయీంకు అప్పగించారు. వారి శవాలు కూడా లభించలేదు. ఆ సమయంలో నయీం భరత్‌ ‌సింహారెడ్డి, డికె అరుణ ఇంట్లోఉన్నాడని, భరత్‌ ‌సింహా రెడ్డి నయీంకు మంచి మిత్రుడని చెప్పుకున్నారు. భూదందాలు చేసుకునే రాజకీయ నాయకులంతా నయీంతో సెటిల్మెంట్లు చేయించుకున్నారు. కొందరు పోలీసు ఆఫీసర్లు కూడా వాళ్ల ప్రమోషన్లలో, బదిలీలలో, వాళ్ళభూమి సమస్యల పరిష్కారం విషయంలో నయీంను వాడుకున్నారు.

అయితే ఇంత సజావుగా నడుస్తున్న నయీం సామ్రాజ్యంపై తెలంగాణ ప్రభుత్వానికి కోపం ఎందుకు వచ్చిందో! తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చిన తర్వాత, ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం జోరందుకుంది. నయీం ముఠా అక్కడి వ్యాపారంలో జోక్యం చేసుకొని బెదిరింపులకు పాల్పడి, వసూళ్లు చేయడం మొదలు పెట్టింది. స్థానిక టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కూడా బెదిరింపులకు గురిచేసి, మీ ముఖ్యమంత్రికి చెప్పుకోకపోండి అనే వరకు వ్యవహారం పోయింది. ఈటెల రాజేందర్‌ను డబ్బు అడిగితే కాదన్నందుకు ఆయన డ్రైవర్‌ను కిడ్నాప్‌ ‌చేసి నయీం గ్యాంగ్‌ ‌చిత్రహింసలు పెట్టింది. టిఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధి వేముల వీరేశంను బెదిరించాడు.

అందరు వెళ్ళిముఖ్యమంత్రికి నయీం ఆగడాల గురించి చెప్పి రక్షించమని మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రికి సమీప బంధువు, ఆయనకు ఆధ్యాత్మిక గురువు, బడా రియల్‌  ఎస్టేట్‌  ‌వ్యాపారిని నయీం వందకోట్లు ఇవ్వాలని బెదిరించాడనే వార్త ప్రచారం జరిగింది. ఇదే సమయంలో సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్‌షాకు ఆ కేసులో నయీం సాక్ష్యం చెబుతాడేమోననే అనుమానం వేసిందనే వార్త కూడా వచ్చింది. అమిత్‌షా కుట్ర  చేసి ఎన్‌కౌంటర్‌ ‌చేసిన సోహ్రబుద్దీన్‌, ఆయన భార్య సంగీత ట్రావెల్స్ ‌బస్‌లో వస్తున్నారని పోలీసులకు సమాచారం అందించింది నయీమేనన్న విషయం పత్రికల్లో వచ్చింది. కేంద్రం నుండి వచ్చిన సూచనలను, రాష్ట్రంలోని నేపథ్యాన్ని సాకుగా తీసుకొని ఎలాగైనా నయీంను అంతం చేయమని ముఖ్యమంత్రి నుండి పోలీసు శాఖకు ఆదేశాలు వెళ్ళాయని ప్రజలు అనుకున్నారు.
(రేపటి సంచికలో…)
– యస్‌. ‌జీవన్‌కుమార్‌

Leave a Reply