Take a fresh look at your lifestyle.

‘సిట్‌’ ‌దర్యాప్తు అటకెక్కిందా ..!

“జులై మాసంలో ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ అనే సంస్థ నయీం విచారణలో సిట్‌ ‌రిపోర్టు వివరాలు అందించాలని సమాచార హక్కు చట్టం కింద పిటీషన్‌ ‌వేసింది. ఇంకా విచారణ సాగుతుందని, డబ్బులు, బంగారంకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. రాజకీయ నాయకుల, పోలీసుల పాత్ర గురించి ఏమీ మాట్లాడటం లేదు. విచారణలో ఉంది కాబట్టి ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వడం కుదరదు అని సిట్‌ అధికార్లు అంటున్నారు. వారం రోజుల క్రితం ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్, అధ్యక్షుడు పద్మనాభరెడ్డిగారు పత్రికల, మీడియా సమావేశం నిర్వహించి నయీం ఎన్‌కౌంటర్‌ ‌జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా, విచారణ ముందుకు సాగడం లేదని, ఆ నేరస్తునితో సంబంధమున్న పోలీసు అధికార్లను గాని, రాజకీయ నాయకుల్ని గాని ఇంతవరకు న్యాయస్థానం ముందు నిలబెట్టలేదని అన్నాడు.”

(‌నిన్నటి సంచిక తరువాయి )….

పోలీసులకు నయీమ్‌ ‌సమాచారం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆదేశాలు వచ్చాయి కాబట్టి నయీమ్‌కు దగ్గరగా ఉండే పోలీసుల ద్వారా 2016 ఆగస్టు 6వ తేదీ రాత్రే నయీంను అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్‌లో ప్రధాన మంత్రి బహిరంగ సభ ఉండటం వల్ల, ఆగస్టు 8వ తేదీన షాద్‌నగర్‌లో ఆయన అప్పుడుంటున్న స్థావరం దగ్గరికి తీసుకెళ్ళి కాల్చేసి, ఎప్పటి లాగే ఎన్‌కౌంటర్‌ ‌కట్టుకథ ప్రచారంలో పెట్టారు. సిఎఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణగారు, నయీం సంపాదించిన ఆస్తులు, డబ్బులు బాధితులకు పంపిణీ చేసి న్యాయం చేయమని కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం వేసాడు. ప్రభుత్వం సిట్‌ను నియమించి, విచారణకు ఆదేశించింది కాబట్టి, విచారణ సంతృప్తికరంగా లేకుంటే కోర్టుకు రమ్మని నారాయణగారు వేసిన పిటీషన్‌ను కోర్టు ప్రక్కన పెట్టింది. నయీం రిమాండ్‌ ‌రిపోర్టులో ఆయన నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ‌హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మెదక్‌ ‌జిల్లాలలో ఒక గ్యాంగును ఏర్పాటు చేసుకొని భూకబ్జాలు, కొనసాగించినట్టు 18 హత్యలు చేసినట్లు ఆరోపణలున్నాయని పేర్కొంది. పిస్టల్స్, ‌మిషన్‌ ‌గన్స్, ‌గొడ్డళ్లు ఆయన స్థావరాల్లో లభించాయని, 2 కోట్ల, 8 లక్షలనగదు, 2 కిలోల బంగారం, 900 గ్రాముల వెండి, 258 సెల్‌ఫోన్లు లభించినట్లు రాసారు. 7కార్లు, 6 మోటార్‌ ‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని 246 భూమికి సంబంధించిన కాగితాలు లభించాయని తెలిపారు.

దాదాపు 34 మందిని నయీం గ్యాంగు సభ్యులనే ఆరోపణతో అరెస్టు చేసారు. భార్యతో సహా ఆరుగురు బంధువులను అరెస్టు చేసారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో నయీం ముఖ్య అనుచరులు బెయిల్‌పై బయటికి వచ్చి సిట్‌ అధీనంలో ఉన్న భూములను అమ్మే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీవాళ్ళను అరెస్టు చేసారు. ముఖ్య అనుచరుడైన శేషన్నను ఇంకా అరెస్టు చేయలేదు. ఆయన దొరకడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆయన కదలికలు గమనిస్తున్నామని అరెస్టు చేస్తామని ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు, ప్రభుత్వం ప్రకటనలు చేసింది. జులై మాసంలో ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ అనే సంస్థ నయీం విచారణలో సిట్‌ ‌రిపోర్టు వివరాలు అందించాలని సమాచార హక్కు చట్టం కింద పిటీషన్‌ ‌వేసింది. ఇంకా విచారణ సాగుతుందని, డబ్బులు, బంగారంకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. రాజకీయ నాయకుల, పోలీసుల పాత్ర గురించి ఏమీ మాట్లాడటం లేదు. విచారణలో ఉంది కాబట్టి ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వడం కుదరదు అని సిట్‌ అధికార్లు అంటున్నారు. వారం రోజుల క్రితం ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్, అధ్యక్షుడు పద్మనాభరెడ్డిగారు పత్రికల, మీడియా సమావేశం నిర్వహించి నయీం ఎన్‌కౌంటర్‌ ‌జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా, విచారణ ముందుకు సాగడం లేదని, ఆ నేరస్తునితో సంబంధమున్న పోలీసు అధికార్లను గాని, రాజకీయ నాయకుల్ని గాని ఇంతవరకు న్యాయస్థానం ముందు నిలబెట్టలేదని అన్నాడు. సంఘటన జరిగినప్పుడు ఏ స్థాయి అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా వదిలేది లేదని ముఖ్యమంత్రి ప్రకటన చేసాడని అన్నాడు. నయీం నుండి నష్టపోయిన బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నాడు. నయీం స్థావరాల్లో చాలా డబ్బు దొరికిందని, మూడు రోజులు నాలుగు కౌంటింగ్‌ ‌యంత్రాలు స్థావరాలలో దొరికిన కరెన్సీని లెక్కించాయని టి.వి. ఛానెళ్ళలో చూపెట్టారని, తమ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారంలో కేవలంలో 2 లక్షల 30 వేల క్యాష్‌ ‌దొరికినట్టు తెలిపారని, ప్రభుత్వానికి నిజాయితీగా విచారణ చేయించే ఉద్దేశం లేదని ఆరోపించాడు.

సిట్‌ ఏర్పడగానే నయీం వల్లభూములు, ఆస్తులు నష్టపోయిన వాళ్ళు వాళ్ళ వివరాలతో పిటీషన్లుసమర్పించారు. ‘‘నయీం బాధితుల సంఘం’’ అనే పేరుతో ఒక సంఘం ఏర్పడి ప్రభుత్వంలో ఉన్న అందరు మంత్రులకు పిటీషన్‌లు ఇచ్చారు. దానికి అధ్యక్షుడుగా జగదీష్‌ ‌గౌడ్‌ అనే బాధితుడు వ్యవహరిస్తున్నాడు. ఆయన కష్టపడి ఏర్పాటు చేసిన గోకుల్‌ ‌కో-ఆపరేటివ్‌ అర్బన్‌ ‌బ్యాంకు నుండి నయీం, సభ్యులను బెదిరించి 3.50 కోట్లు బలవంతంగా డ్రా చేయించి తీసుకున్నాడని చెప్పుతున్నాడు. సహకార బ్యాంకు నయీం చేతుల్లో దోపిడీకి గురైందని సహకార శాఖ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేస్తే, తానే డిపాజిటర్లను మోసం చేసి బ్యాంకులో డబ్బు మాయం చేసినట్టు తనపై కేసు పెట్టి అరెస్టు చేయించారని, ‘‘గోకుల్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌బ్యాంకు’’ అధ్యక్షుడు జగదీశ్‌గౌడ్‌ ‌చెప్పుతున్నాడు. నయీం బాధితుల సంఘం సంస్థ దగ్గర ఉన్న వివరాల ప్రకారం నయీం గ్యాంగు 1200 ఎకరాలస్థలం, 240 ఇళ్ళస్థలాలను అక్రమంగా, దౌర్జన్యంగా కబ్జా చేసుకుంది. ఈ సంస్థ నయీం నేతృత్వంలో 56 హత్యలు జరిగినట్టు ఆరుగురి శవాలు లభించలేదని తెలుపుతుంది. ఈ సంస్థ రెండుసార్లు ధర్నాలు నిర్వహించింది. విచారణ జరిపి తమ భూములు, ఆస్తులు తమకు ప్రభుత్వం తిరిగి ఇప్పిస్తుందని ఈ సంస్థలోని సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఈ సంస్థలోని నయీం బాధితులు. తమకు న్యాయం చేస్తుందని, అదృశ్యం అయిన తమ వాళ్ళు తిరిగి వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు.

నయీం మరణించగానే అన్ని పత్రికలు, టివీ చానెళ్లు పుంఖాను పుంఖాలుగా వార్తలు ప్రచురించాయి. ప్రసారం చేసాయి. దాదాపు వారం రోజులు పత్రికలన్నీ నయీం వార్తలు, ఆయన కొల్లగొట్టిన ఆస్తులు, ఆయనకు స్త్రీలతో ఉన్న సంబంధాలు, రాజకీయ నాయకుల, పోలీసులతో ఉన్న స్నేహ సంబంధాల గురించి కథనాలు రాసాయి. అబ్బ! నయీమ్‌ ఇకలేడు అని భయం లేకుండా స్వేచ్ఛగా విలేకర్లు రాసారు. నయీమ్‌తో చెట్టా, పట్టాలేసుకున్న రాజకీయ నాయకులను, పోలీసు అధికార్లను ఎవ్వరిని వదిలేదిలేదు, అని ముఖ్యమంత్రి ప్రకటన చేసి నాగిరెడ్డి, ఐజితో, సిట్‌ను నియమించాడు. రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు భుజాలు తడుముకున్నారు. కొందరు ఐజి స్థాయి అధికారి అయిన నాగిరెడ్డి, డిజిపి స్థాయి అధికార్లపై విచారణ ఎలా చేస్తాడు అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు కొందరు తమకు నయీం ఎవరో తెలియదని పత్రికా ప్రకటనలు చేసారు. అయిదుగురు పోలీసు అధికార్లను సస్పెండ్‌ ‌చేసారు. సంవత్సరం తర్వాత ఆరోపణలు ఋజువు కాలేదని వాళ్లను విధుల్లోకి తీసుకున్నారు. ఆరోపణలు చేయబడ్డ అధికార్లు కొంత మంది పదవీ విరమణ చేసారు.

నయీంలో సంబంధం ఉన్న పోలీసు అధికార్లు చాలా తెలివిగా నయీంకు ఒక ముప్పై మంది పోలీసు అధికార్లకు సంబంధాలు ఉన్నట్టు ఒక మెసేజ్‌ను వాట్సప్‌తో సర్క్యులేషన్‌లో పెట్టారు. అందులో ప్రస్తుతం పదవిలో ఉన్న డిజిపితోబాటు పదవీ విరమణ చేసిన ముగ్గురు డిజిపిలపేర్లుకూడా చేర్చారు. ఇదంతా విచారణ సజావుగా జరుగకుండా గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం అని పోలీసు వర్గాలే పత్రికలకు చెప్పుకున్నాయి. అందులోని నిజా నిజాల గురించి విచారణ మాత్రం చేపట్టలేదు. రాజ్యం, ప్రభుత్వం పెంచి పోషించిన అత్యంత క్రూరమైన నరహంతకుడిగా, భూముల కబ్జాదారుడిగా, సెటిల్మెంట్లరౌడీగా, పోలీసుల రాజకీయ నాయకులసన్నిహితుడిగా మసలిన, పేరు మోసిన అబ్దుల్‌ ‌నయీమొద్దీన్‌ ‌చరిత్రనే ఈ వ్యాసం. ప్రభుత్వానికి నిజాయితీగా విచారణ జరిపించి నయీంతో అంటకాగిన దోషులైన రాజకీయ నాయకులను, పోలీసు అధికార్లను శిక్షించాలనే నిబద్ధత లేదు. ఒక రాజకీయ సంకల్పం లేదు. నయీంను చంపేశాం అదే చాలులే అనుకుంటుంది ప్రభుత్వం. నయీం అవశేషాలు ఇంకాఉన్నాయి. అప్పుడప్పుడు బయటకొస్తున్నాయి. రాజకీయ నాయకులు, పోలీసులు కలిసి పెంచి పోషిస్తున్న ఈ నేర సంస్క•తిని ఎండగట్టడం అరికట్టడం మన బాధ్యత. నయీం వల్ల నష్టపోయిన వాళ్ళకు న్యాయం చేయించడానికి ప్రభుత్వంపై వత్తిడి తెద్దాం. హక్కుల సంఘంగా మనం ఆ దిశగా ప్రయత్నిద్దాం.
– యస్‌. ‌జీవన్‌కుమార్‌

Leave a Reply