Take a fresh look at your lifestyle.

‘సిట్‌’ ‌దర్యాప్తు అటకెక్కిందా ..!

‘‘‌విదేశాలలో శిక్షణ పొంది, నక్సలైట్లను అణచడానికి ‘‘గ్రేహౌండ్స్ ‌పోలీసు దళాలను’’ సృష్టించిన ఐపిఎస్‌ అధికారి కె.ఎస్‌. ‌వ్యాస్‌ను పీపుల్స్‌వార్‌ ‌యాక్షన్‌ ‌టీం 1993లో, ఆయన ఉదయం జాగింగ్‌ ‌చేస్తుండగా కాల్చివేసింది. ఆ యాక్షన్‌ ‌టీములో సభ్యుడైన అబ్దుల్‌ ‌నయీం కొంత కాలం తర్వాత ప్రభుత్వానికి లొంగిపోయి, ప్రభుత్వ సలహా, సహకారంతో ‘గ్యాంగ్‌స్టర్‌ ‌నయీం’గా మారాడు. పీపుల్స్‌వార్‌ ‌పార్టీ సానుభూతిపరులను, పౌరహక్కుల, ప్రజాసంఘాల నేతలను హతమార్చడానికి పోలీసుల కనుసన్నల్లో మెదిలి, పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా, ప్రజాకంఠకుడుగా మారాడు. ప్రజా కంటకుడుగా మారిన నయీమ్‌ను చివరకు ప్రభుత్వమే ఎన్‌కౌంటర్‌ ‌పేరుతో హత్య చేసింది. నయీం అకృత్యాల విచారణకు ప్రభుత్వం ఒక స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌టీమును వేసింది. ఇప్పటికీ ఇంకా ఆ విచారణ పూర్తి కాలేదు. నయీం పుట్టుక, పెరుగుదల, అంతమే ఈ వ్యాసం’’

నక్సలైట్‌ ఉద్యమం ప్రారంభమయిన తొలిరోజుల్లో, ఈ ఉద్యమం సామాజిక కారణాలవల్ల ఉద్భవించిందని, దీనికి ఒక సామాజిక, ఆర్థిక నేపథ్యం ఉందని ప్రభుత్వాలు విశ్వసించినట్టుగా అనిపించింది. ఉద్యమం రావడానికి కారణమైన సామాజిక, రాజకీయ అంశాలు ఏంటి, ఏ రంగంలో ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వ పాలనలో, పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళికలు ఆ ప్రణాళికల అమలులో ఉన్న లోపాలు ఏమిటి అనే విషయాలపై సామాజిక శాస్త్రవేత్తలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ప్రభుత్వం కొంత మేరకు అంగీకరించినట్టుగానే అనిపించింది. భూసంస్కరణలు ప్రవేశపెట్టడం, ఆదివాసీల భూమి, హక్కుల విషయంలో 1/70 లాంటి చట్టాలు తేవడం, ఆదివాసీలకు ప్రత్యేకంగా గిరిజన సమగ్రాభివృద్ధి (ఐటిడిఏ) లాంటి సంస్థను ఏర్పరచడం, వాళ్ళకు రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలు స్థాపించడం, దళితులకు, వెనకబడిన బలహీనవర్గాలకు బడ్జెట్‌ ‌పెంచడం, ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కోసం పథకాల రచన చేయడం జరిగింది. ఇవన్నీ నిజాయితీగా చేపట్టారా అన్నది వేరే విషయం. కాని, కొంత కాలం ఆ దిశగా ప్రభుత్వం ఆలోచనలు కొనసాగాయి.

కొద్దిరోజుల్లోనే ఈ ఉద్యమానికి సామాజిక ఆర్థిక నేపథ్యంతోబాటు ఒక రాజకీయ ఆశయం కూడా ఉందని ప్రభుత్వానికి అర్థం అయింది. దీని వెనక సోషలిస్టు సమాజ స్థాపన, పార్లమెంటరీ పంథాపట్ల తీవ్ర వ్యతిరేకత, సమసమాజం స్థాపనకోసం సాయుధ పోరాట కార్యాచరణ ఒక పంథాగా ఉందని ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అర్థం అయింది. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక రంగంలో గుత్త పెట్టుబడులు ప్రవేశించడం, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థలు ఉనికిలోకి రావడంతో నక్సలిజం పట్ల భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి పూర్తిగా మారింది. నిర్బంధ పద్ధతుల ద్వారా నక్సలిజాన్ని నియంత్రించాలని, అణచివేయాలని సంకల్పించింది. శ్రీకాకుళంలో నక్సలైట్‌ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా అయిదు సంవత్సరాలు పరిపాలించిన జలగం వెంగళరావు, దాదాపుగా అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధార్థ శంకర్‌రే నక్సలైట్లపై పూర్తి స్థాయిలో నిర్బంధం కొనసాగించారు. దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ కూడా నక్సలైట్ల ఉద్యమాన్ని అన్ని పద్ధతుల్లో అణచివేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

శ్రీకాకుళ పోరాటం ప్రారంభంలో ఉద్యమ నాయకులైన పంచాదికృష్ణమూర్తి, వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహి, పంచాది నిర్మల ఎన్‌కౌంటర్‌లలో మరణించారు. వందల సంఖ్యలో నక్సలైట్‌ ‌కార్యకర్తలను, సానుభూతిపరులను అరెస్టు చేసి కేసులు పెట్టడమే కాకుండా, ఎన్‌కౌంటర్‌ ‌హత్యలతో నాయకులను భౌతికంగా నిర్మూలించడమే ఒక విధానంగా ప్రభుత్వం ఎంచుకుంది. సిద్ధార్థ శంకర్‌రే పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రోజుకు నలుగురు ఎన్‌కౌంటర్లలో మరణించారని, 2,900 మందిపై కేసులు పెట్టిజైళ్లకు పంపడం జరిగిందని నివేదికలు తెలుపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వెంగళరావు పాలించిన దాదాపు అయిదు సంవత్సరాల కాలంలో 350 పైగా నక్సలైట్‌ ‌కార్యకర్తలు ఎన్‌కౌంటర్లలో మరణించినట్టు, నాలుగువేలకు పైగా జైళ్ళలో కుక్కబడినట్లు సమాచారం ఉంది. ఆ సమయంలోనే రైతు గెరిల్లా నాయకులు భూమయ్య కిష్టాగౌడ్‌లను ఉరితీయడం జరిగింది.

నక్సలైట్‌ ఉద్యమం తెలంగాణ జిల్లాలలో మైదాన ప్రాంతాలకు, కోల్‌ ‌బెల్ట్ ‌ప్రాంతానికి విస్తరిస్తుండటంతో ప్రభుత్వం పటిష్టమైన సమాచార వ్యవస్థను, ఏర్పరచుకొని అందుకోసం ఇన్‌ఫార్మర్‌లను తయారు చేసుకోవడం అజ్ఞాత దళాల్లోకి కోవర్టులను ప్రవేశపెట్టడం జరిగింది. పోలీసు శాఖలో సమాచారం అందగానే నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ ‌పేరుతో హత్య చేసే ‘‘ఆంటీ నక్సలైట్ల స్క్వాడ్‌’’‌లు, వెంటాడి, వేటాడే పద్దతిలో శిక్షణ పొందిన పోలీసులను ‘‘గ్రేహౌండ్స్’’ ‌పేరుతో హంతక దళాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులు కశ్మీర్‌, ‌పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలలో అణచివేత చర్యలను పద్దతులను అధ్యయనం చేయడమే కాకుండా, ప్రభుత్వం ఎంపిక చేసిన ఐపిఎస్‌ ‌స్థాయి అధికార్లను బాసిలోనియా, ఇజ్రాయిల్‌ ‌దేశాలకు పంపించి అక్కడ అణచివేత పద్ధతులపై శిక్షణ కూడా ఇప్పించింది. దాదాపు డజను మంది ఐ.జి. క్యాడర్‌ అధికార్లు ఇలా శిక్షణ తీసుకున్నారు.
– యస్‌. ‌జీవన్‌కుమార్‌
(‌మిగతా రేపటి సంచికలో ..)

Leave a Reply