Take a fresh look at your lifestyle.

‘సిట్‌’ ‌దర్యాప్తు అటకెక్కిందా ..!

“తన సోదరితో ఈదన్న అనే ఒక దళ సభ్యురాలి భర్త అనైతికంగా ప్రవర్తించాడని, పార్టీ బాధ్యులకు చెప్పినా పట్టించుకోలేదని, ఈదన్నను పార్టీ చంపాలని కోరినా, నిర్లక్ష్యంగా పార్టీ వ్యవహరించిందని, అదే జైలులో ఉన్న పీపుల్స్‌వార్‌ అ‌గ్రనాయకులైన శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ, పటేల్‌ ‌సుధాకర్‌ ‌రెడ్డిలపై అక్కసు పెంచుకున్నాడు. జైలులో ఉండి పథకం వేసి తన తమ్ముడు అలీమొద్దీన్‌ ‌ద్వారా ఈదన్నను చంపించాడు. ఈదన్నను చంపి ఆయన కనుగుడ్లను పెరికించి తనకు చూపెట్టమని తమ్మునికి జైలు నుంచి కబురు పంపాడని వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈదన్న హత్య జరిగిన కొద్దినెలలకు, ఆయన బంధువులు, స్నేహితులు కలిసి నయీం సోదరుడు అలీమొద్దీన్‌ను హత్య చేసారు..”

(‌నిన్నటి సంచిక తరువాయి )….

1998,ఆగస్ట్5-‌సెప్టెంబర్‌ 30.. ‘‌ప్రజాతంత్ర ‘సంచిక …

ఒక నేర సామ్రాజ్యాన్ని ప్రభుత్వ పూర్తి అండదండలతో నిర్మించుకొని రెండు దశాబ్దాలు ఘోరమైన హత్యలు, కిడ్నాప్‌లకు, అక్రమ వసూళ్ళకు పాల్పడుతూ చివరకు ఈయన ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో హత్యగావింపబడ్డాడు. భువనగిరి ప్రాంతానికి చెందిన సాధారణ ముస్లిం కుటుంబానికి చెందిన అబ్దుల్‌ ‌నయీమ్‌, ‌పీపుల్స్‌వార్‌లో చేరి కొంతకాలం అజ్ఞాత దళంలో పనిచేసాడు. గ్రేహౌండ్స్ ‌పోలీసు దళ సృష్టికర్త, మనుషులను ‘‘అదృశ్యం’’ చేసే ప్రక్రియ మొదలు పెట్టిన ఐ.పి.ఎస్‌. ‌పోలీసు అధికారి ఎస్‌.‌కె. వ్యాస్‌ను 1993, జనవరి 27వ తేదీన, ఉదయం లాల్‌ ‌బహదూర్‌ ‌స్టేడియంలో ఆయన జాగింగ్‌ ‌చేస్తుండగా పీపుల్స్‌వార్‌ ఆక్షన్‌టీము కాల్పులు జరిపి చంపింది. ఈ ఆక్షన్‌ ‌టీములో నయీం సభ్యుడు. ఈ అధికారి నల్లగొండ ఎస్‌.‌పి.గా ఉండగా చాలా ఎన్‌కౌంటర్లకు పథకం వేసాడని, క్రూరమైన అధికారిగా పేరు ఉంది. వ్యాస్‌ ‌హత్య కేసులో ముద్దాయిగా ఉన్న నయీమ్‌ ‌రెండువారాల తర్వాత అరెస్టయి, ఆరు సంవత్సరాలు (1993) వరకు ముషీరాబాద్‌ ‌జైలులో వున్నాడు.

జైలులో వున్నప్పుడే నయీం, అక్కడ ఉన్న పీపుల్స్‌వార్‌ ‌నాయకులతో గొడవలు పెట్టుకోవడం, ఆవేశంగా ప్రవర్తించడం, పోలీసు నిఘా వర్గాలు గమనించాయి. తన సోదరితో ఈదన్న అనే ఒక దళ సభ్యురాలి భర్త అనైతికంగా ప్రవర్తించాడని, పార్టీ బాధ్యులకు చెప్పినా పట్టించుకోలేదని, ఈదన్నను పార్టీ చంపాలని కోరినా, నిర్లక్ష్యంగా పార్టీ వ్యవహరించిందని, అదే జైలులో ఉన్న పీపుల్స్‌వార్‌ అ‌గ్రనాయకులైన శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ, పటేల్‌ ‌సుధాకర్‌ ‌రెడ్డిలపై అక్కసు పెంచుకున్నాడు. జైలులో ఉండి పథకం వేసి తన తమ్ముడు అలీమొద్దీన్‌ ‌ద్వారా ఈదన్నను చంపించాడు.

ఈదన్నను చంపి ఆయన కనుగుడ్లను పెరికించి తనకు చూపెట్టమని తమ్మునికి జైలు నుంచి కబురు పంపాడని వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈదన్న హత్య జరిగిన కొద్దినెలలకు, ఆయన బంధువులు, స్నేహితులు కలిసి నయీం సోదరుడు అలీమొద్దీన్‌ను హత్య చేసారు. తన తమ్ముడి హత్య పీపుల్స్‌వార్‌ ‌పార్టీనే చేయించిందని విశ్వసించి, నయీం పార్టీపై కక్ష పెంచుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు, రహస్యంగా నయీమ్‌తో సంబంధాలు పెట్టుకొని, ఆయనను తమ దారిలోనికి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నయీం పోలీసులతో ఒప్పందాలు చేసుకున్నాడు. తాను పోలీసులతో చేస్తున్న మంతనాలు తెలంగాణ కళాకారిణి బెల్లి లలితకు తెలిసిందనే అనుమానంతో ఆమెను తన స్నేహితులద్వారా అతిదారుణంగా హత్య చేయించాడు. ఆమె శరీర భాగాలను 17 ముక్కలుగా నరికి వేరు వేరు ప్రదేశాలలో వేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో జరిగిన ఈ హత్య పెద్ద సంచలనం రేపింది. ఈ సందర్భంలో రకరకాల కథనాలు వినిపించాయి. ప్రత్యేక తెలంగాణ కోసం సాంస్క•తిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, పాటలు పాడుతూ ప్రజల్లోకి చొచ్చుకు పోతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిరాయి గ్యాంగుతో బెల్లి లలిత హత్య చేయించాడనే ఆరోపణ కేశవరావు జాదవ్‌తో బాటు తెలంగాణ వాదులంతా చేసారు. ఇప్పటికీ అదే కథనం ప్రచారంలో వుంది. బెల్లి లలిత హత్య విషయంలో పౌర హక్కుల సంఘం వాస్తవాలు సేకరించడానికి ప్రయత్నించింది. తన సోదరుని విషయంలో పౌర హక్కుల సంఘం న్యాయం చేయలేదని, బెల్లి లలిత హత్యను మాత్రం సంస్థ రాద్దాంతం చేస్తుందని, ఇంకా జైలులో పార్టీ శ్రేణులతో జరిగిన చాలా వివాదాలతో, పార్టీపై, పార్టీ ప్రజా సంఘాలపై, పౌర హక్కుల సంఘంపై విపరీతమైన ద్వేషంతో రగిలిపోయాడు నయీమ్‌.

1999 ‌జులై మాసంలో నయీమ్‌ ‌బెయిల్‌ ‌పై విడుదలై వచ్చి, ఇదివరకే లైసెన్స్‌డ్‌ ‌కిల్లర్స్‌గా ఉన్న మాజీలందరిని పోగు చేసాడు. 1999 నవంబర్‌ 23‌న, ఆంధ్రప్రదేశ్‌ ‌పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి కె. పురుషోత్తంను ఎల్‌.‌బి. నగర్‌లోని, ఒక కాలనీలో ఉదయం పదకొండు గంటలకు, తమ ఇంటి దగ్గరలో ఉన్న కిరాణాషాపుకు సబ్బు తెచ్చుకోవటానికి వెళ్ళినప్పుడు నయీమ్‌ ‌గ్యాంగు ఆయనను కత్తులతో నరికి భయంకరంగా హత్య చేసింది. పోలీసులు వారం రోజుల తర్వాత నయీంను, కత్తుల సమ్మయ్యను అరెస్టు చేసి, సిటీ సివిల్‌ ‌కోర్టుకు తీసుకొచ్చినప్పుడు, పురుషోత్తంను తానే చంపానని, ఇంకా 17 మంది హక్కుల కార్యకర్తలను సానుభూతిపరులను చంపవలసి ఉందని, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన పథకాన్ని అమలు చేస్తానని టివి ఛానెళ్ళతో, పత్రికా విలేకర్లతో చెప్పాడు. ప్రక్కన ఉన్న పోలీసు అధికార్లుపారవశ్యంతో టివి ఛానళ్ళలో కనిపించారు. సివిల్‌ ‌దుస్తుల్లో ఉన్న పోలీసులు నయీంకు పూలదండవేసి ‘‘నక్సలైట్స్ ‌డౌన్‌, ‌డౌన్‌’’ అని నినాదాలు చేసారు.

2001 ఫిబ్రవరి నెలలో, నల్లగొండ పట్టణంలో, కె. పురుషోత్తం సంస్మరణ సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న, జిల్లా పౌర హక్కుల సంఘం శాఖ, సహాయ కార్యదర్శి, ఉపాధ్యాయుడైన మహమ్మద్‌ ఆజాం అలీని ఉదయం 10 గంటలకే, కలెక్టర్‌ ఆఫీసుకు దగ్గరలోనే నయీం గ్యాంగ్‌ ‌హత్య చేసింది. ఆ కేసు నిమిత్తం జైలు నుండి నల్లగొండ కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు, ఆజాం అలీని తానే తన మనుషులతో చంపించానని ప్రకటించాడు. ఆజాం అలీ హత్య కేసులో నయీం నిర్దోశి అని నల్లగొండ కోర్టు తీర్పు చెప్పినప్పుడు, సంతోషంతో 30 వేల రూపాయలు తన అడ్వకేట్లకు ఇచ్చి అడ్వకేట్లందరికీ పార్టీ ఇవ్వమని నయీం చెప్పినట్టుగా పత్రికల్లోవార్త వచ్చింది.

(రేపటి సంచికలో…)
– యస్‌. ‌జీవన్‌కుమార్‌

Leave a Reply