Take a fresh look at your lifestyle.

సంప్రదాయాల సిరి… ధర్మపురి

‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుస్తం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా,  పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా విరాజిల్లుతున్నది… సుప్రసిద్ధ ప్రాచీన ధర్మపురి పుణ్యతీర్థం. అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లా కేంద్రానికి క 71 కిలోమీటర్ల ఉత్తరాన, ప్రస్తుత జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కిలోమీ టర్ల ఈశాన్యన,  తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షే త్రంగా, దక్షిణకాశీగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, పౌరాణిక, ఐతిహాసిక, చారి త్రక ప్రాధాన్యతను సంతరించుకున్నది క్షేత్ర రాజం. ప్రధానంగా శివకేశవుల నిలయమై, అపురూపమైన బ్రహ్మ, యమ ధర్మరాజు దైవాలతో  త్రైమూర్త్య క్షేత్రంగా,  శ్రీలక్ష్మీనరసింహ, రామలింగేశ్వర ఆలయాలు, మసీదు పక్కపక్కనే కలిగి అనాదిగా వైష్ణవ, శైవ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా నిలచి ఉన్నదీ గోదావరీ తీరస్త పుణ్యతీర్ధం. బ్రహ్మండ, స్కంధ పురాణాలలో, మడికి సింగన పద్మ పురాణంలో, చెరికొండ ధర్మన్న చిత్ర భారతంలో, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో, ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో, నృసింహదాసు మైరావణ చరిత్రలో, పోతనామాత్యుని నారాయణ శత కంలో, పింగళి సూరనార్యుని కళాపూర్ణోదయంలో, శేషాచలదాసు… నరహరి, నృసింహ, నృకేసరి శతకాలలో, కాకతీయానంతర శాసనాలలో, మధ్యయుగ దాన పత్రాలలో ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యం ప్రశంసించ బడింది.

పూర్వం ధర్మవర్మ మహారాజు ధర్మదేవత భక్తుడై, ప్రజలను ధర్మ కార్యోన్ముఖులను చేయడానికి చేసిన తపస్సు ఫలితంగా ‘‘ధర్మపురి’’ నామాంకితయై, నృసిం హుడు భక్తుల కోర్కెల తీర్చేందుకై ఇచ్చట వెలసి యున్నాడని, పురాణాలు స్పష్ట పరుస్తున్నాయి.  గౌతమ మహర్షి, తన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టు కునేందుకు పరమశివుని గూర్చి తపస్సు చేసి, ఆయన జటాజూటం నందు గల ‘‘గంగా దేవి’’ని ధర్మపురికి రప్పించినందున ‘‘గౌతమి’’ ‘‘గోదావరి’’ అని నదీ పేర్లు వచ్చినట్లు స్థల పురాణం విశదపరుస్తున్నది. శ్రీరామచంద్ర స్థాపిత రామేశ్వరాలయం, అక్కపెల్లి రాజేశ్వరాలయం, శ్రీరామాలయం, దత్తాత్రేయ, గౌతమేశ్వర, శ్రీసాయి శివ బాలాజీ, అయ్యప్ప, ప్రసన్నాంజనేయ,  భక్తాంజనేయ, యమ ధర్మరాజు, సంతోషిమాత, సత్యవతీ, మహాలక్ష్మి మందిరాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. రామాయణ, భారత, భాగవతాది పురాణ ఘట్టాలు చెక్కబడిన నృసింహాల యపు కాకతీయుల శిల్పకళకు అద్దం పట్టే కళ్యాణ మంటపం, శివాలయంలోని గణేష చండిక, సప్తమాతృకలు, నల్లశనపు రాతిపై సమంశ పద్ధతిలో చెక్కబడిన శ్రీరామలక్ష్మణ, సీతాదేవిల విగ్రహాలు మిగుల మనోజ్ఞమై ఉన్నాయి. ధర్మపురి క్షేత్రం మొదట జైన, బౌద్ధ యుగము లందు ఆర్ష విద్య ప్రచార కేంద్రమై, విధర్భ రాజ్య పోషణలో మున్యాశ్రమంగా ఉండేది. తర్వాత శాతవాహన, బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య, కాకతీయ, రేచర్ల వెలమల మరియ నిజాం రాజుల ఏలుబడిలో అద్వితీయ వైభవాన్ని అనుభవించింది. ప్రతాప రుద్రుని కాలంలో ఢిల్లీని ఏలిన అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీ సేనాని మాలిక్‌ ‌నాయబ్‌ ‌కాపూర్‌ ‌సైన్యం క్రీస్తు శకం 1309లో ఇందూరు (నిజామాబాద్‌) ‌మీదుగా కాకతీయులపై దండెత్తిన సమయంలో ఇచ్చటి నరసింహ ఆలయం, రామేశ్వరాలయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతున్నది. 14వ శతాబ్ది మూడవ పాదంలో నారాయణాశ్రమ స్వామి అనే సన్యాసి, నాటి రామగిరి పాలకుడైన ముప్ప భూపతి సేనాని కేశనమంత్రి సాటంత్‌ ‌నారాయణ పురమను మఠంను స్థాపించి, భాష్మణులకు గృహములను నిర్మింపజేసి, ఆన్న సత్రాన్ని నెలకొల్పారు. 1724-50 మధ్య ధర్మపురి వాసులు తిరిగి నృసింహాలయాన్ని నిర్మించారు.

క్షేత్ర ప్రాశస్త్యం

అద్వితీయ మహిమాన్వియైన ధర్మపురి క్షేత్రమున యాత్రికుల సౌకర్యార్ధం నివాస స్థానములను కట్టించు వారు భగవత్కటాక్షమున ఉత్తమ భవనముల పొందగలరని, ఇచ్చటి జీర్ణమందిర ములను ఉద్దరించు వారు వైకుంఠమునందు ఉత్తమ సుఖములను అనుభవించ గలరని, శ్రీనృసింహుని పూజ కొరకు పూల చెట్లను పెంచు వారు నందనాది వనములతో సౌఖ్యములను అనుభవించగ లరని, శ్రీనృసింహు శౌల్యన్నమును, దద్యన్నమును మరియు పులిహోరను నైవేద్యమిడు వారు అన్నదాతలై భగవత్కటాక్షమునకు పాత్రులగుదురని, నృసింహుని ప్రీతికై క్షేత్రమున బ్రహ్మణులకు భూదానం, గోదానం మరియు హిరణ్యాది దానముల నొసంగువారు ముందు జన్మమున సార్వభౌములగుదురని, క్షేత్రమున దీనాదులకు, దంపతులకు, బ్రహ్మచారులకు పశు పక్ష్యాదులకు అన్నదాన మొనర్చినచో, నృసింహ కటాక్షమున వారి వారి పితృ దేవతలు మోక్షమును పొంద గలరని, శౌనకాది మహర్షులకు నైమిషారణ్యము నందు సూత పౌరాణికులు వివరించినట్లు స్కంధ పురాణాంతర్గత ధర్మపురి
క్షేత్ర మహాత్మ్యం విశద పరుస్తున్నది.

నరసింహ అవతార ప్రత్యేకత

రామకృష్ణాది అవతారములవలె గాక, నిర్యాణం లేని శాశ్వత అవతారమైన శ్రీనరసింహుని జయంతి, హిందూ పండగలలో అత్యంత ఆధ్యా త్మిక ప్రాధాన్యత నొందింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పుణ్య తిథియందు ఉద్భవించిన నారసింహుని పూజలతో, అకాల మృత్యుభయ ముండదని, దుష్ట గ్రహ బాధలు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నారసింహ మంత్రానికి గల దని భక్తుల, సాంప్రదాయాచరణాసక్తుల ప్రగాఢ విశ్వాసం. ‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం: నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం’’ అనే మంత్రంతో నరసింహ స్వామిని పూజిస్తే శతృ జయం కలుగుతుంది. పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవ మూ కాని చేతిగోళ్ళతో, హిరణ్య కశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, ఆంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అమారాలకు భిన్నం..

13రోజుల బ్రహ్మోత్సవాలు

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి లక్ష్మీ సమేత నారసింహ (యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు మార్చి 24 వ తేదీ నుండి ఏప్రిల్‌ 5 ‌వ తేదీ వరకు సాంప్ర దాయ రీతిలో జరుగనున్నాయి. సర్వ దేవమూ ర్తులను కలిగి ‘ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు’ అని విఖ్యాతి నందిన ప్రాచీన చరిత్ర,  పౌరాణిక ప్రాధాన్యత కలిగిన ధర్మపురి క్షేత్రంలో ఏటా ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుండి 13రోజులు వరుసగా స్థానిక దైవాల వార్షిక ఉత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించడం అనాదిగా ఆచరణలో ఉంది. ఈ సంవత్సరం మార్చి 24 వతేదీ బుధవారం నుండి  ఏప్రిల్‌ 5‌వ తేదీ సోమవారం వరకు, ప్రధానంగా మార్చి 25 వ తేదీ గోధూళి సుముహూర్తంలో  స్వామి వారల కల్యాణోత్సవం, 28, 29, 30 తేదీలలో వరుసగా… బ్రహ్మపుష్కరిణీ (కోనేరు)లో సాయంత్రం శ్రీ యోగానంద నరసింహ, శ్రీ ఉగ్ర నరసింహ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారల  తెప్పోత్సవం, డోలోత్సవంబీ ఏప్రిల్‌ 2‌న సాయంత్రం రథోత్సవం, 3,4,5 రోజులలో మువ్వురు స్వామి వారల ఏకాంతోత్సవాలు  ఘనంగా, సంప్రదాయ రీతిలో జరుగ నున్నాయి. నిత్య ఆరాధనలతో పాటు ప్రత్యేక, పూజాదికాలు నిర్వహించ నున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్‌ ‌రవి గుగులోతు అధ్యక్షతన, దేవస్థానం ఏసీ, ఈఓ .ఈ అమరేందర్‌, ఆస్థాన పారోహితులు కందాల పురుషోత్తమా చార్య, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ,  వివిధ ఆలయాల అర్చకులు, సిబ్బంది కార్యక్రమాల ఏర్పాట్ల నిర్వహణలలో నిమగ్నమై  ఉన్నారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply