Take a fresh look at your lifestyle.

సిరాజ్‌ను తీసుకోవాలి..!

కొత్త, పాత బంతులతో రాణించే సత్తా కలిగిన పేసర్‌
చెన్నై వేదికగా జరిగిన ఫస్ట్ ‌టెస్ట్ ‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 227 పరుగుల తేడాతో ఓడిపోయి అప్రతిష్టను మూట గట్టుకుంది. అయితే, ఫస్ట్ ‌టెస్ట్ ‌లో అశ్విన్‌ ‌తప్ప మిగతా బౌలర్లు విఫలమయ్యారు. బుమ్రా, ఇషాంత్‌ ‌శర్మలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మరోవైపు, ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటి అందరి చేత ప్రశంసలు అందుకున్న టీమిండియా యువ పేసర్‌ ‌మహ్మద్‌ ‌సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో జరిగిన ఫస్ట్ ‌టెస్ట్‌లో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్‌ ‌పేసర్‌ ఇషాంత్‌ ‌శర్మ అందుబాటులోకి రావడంతో ఈ హైదరాబాద్‌ ‌క్రికెటర్‌ను పక్కనపెట్టారని అందరూ భావించారు. దీంతో చర్చంతా కుల్దీప్‌ ‌యాదవ్‌ ‌వైపు మళ్లింది. భారత జట్టు ఓటమి తర్వాత అనుభవలేమి స్పిన్నర్లు ఇంగ్లండ్‌ ‌బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపించలేకపోయారని విమర్శలు వచ్చాయి.

కుల్దీప్‌ను తుది జట్టులో చేర్చితే బాగుండేదని అందరూ అన్నారు. కానీ కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ మాత్రం కుల్దీప్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వెనుకున్న కారణాన్ని తెలియజేశాడు. అదే సమయంలో సిరాజ్‌ ‌గురించి ఎవరూ ప్రస్తావించలేదు. అయితే ఫస్ట్ ‌టెస్ట్‌లో అటు బుమ్రా, ఇషాంత్‌ ‌శర్మలు పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ 38 ఏళ్ల ఇంగ్లండ్‌ ‌పేసర్‌ ‌జేమ్స్ అం‌డర్సన్‌ ‌మాత్రం భారత బ్యాటింగ్‌ ‌లైనప్‌ ‌వెన్ను విరిచాడు. తన రివర్స్ ‌స్వింగ్‌ ‌బంతులతో స్పిన్నర్లకు ధీటుగా బంతిని అటూ ఇటూ స్వింగ్‌ ‌చేసి ముప్పు తిప్పలు పెట్టాడు.

ఇప్పుడున్న ఇషాంత్‌ ‌శర్మ మంచి వేగంతో కూడిన లైన్‌ అం‌డ్‌ ‌లెంగ్త్ ‌బంతులు వేస్తాడు. జస్‌‌ప్రీత్‌ ‌బుమ్రా అద్భుతమైన యార్కర్లు సంధించగలడు. కానీ స్వింగ్‌ ‌చేయడం కొంచెం కష్టమే. పైగా, బుమ్రా తొలిసారి భారత పిచ్‌లపై టెస్ట్ ‌మ్యాచ్‌ ఆడుతున్నాడు. గతంలో అతను దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడిన అనుభవం కూడా పెద్దగా లేదు. దీంతో చెన్నై టెస్ట్‌లో స్పిన్నర్లు వికెట్లు తీయగలిగినా, వారికి తోడుగా పేసర్లు వికెట్లు కూల్చలేకపోయారు.

- Advertisement -

ఫస్ట్ ‌టెస్ట్ ‌జరగతుండగానే.. తాను ఇషాంత్‌ ‌శర్మకు బదులు సిరాజ్‌ను తీసుకునేవాడినని మాజీ ఓపెనర్‌ ‌గౌతం గంభీర్‌ అన్నాడు. ఇషాంత్‌ ‌కన్నా ఎక్కువ మ్యాచ్‌ ‌ప్రాక్టీస్‌ ఉం‌డటంతో పాటు సిరాజ్‌ ‌మంచి రిథమ్‌లో ఉన్నాడని పేర్కొంటూ కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.రెండో టెస్ట్ ‌కూడా చెన్నైలోని చెపాక్‌ ‌స్టేడియంలోనే జరగనున్నది. తొలి టెస్ట్‌కు వాడిన పిచ్‌ ‌కాకుండా వేరే పిచ్‌ను ఈ మ్యాచ్‌ ‌కోసం సిద్దం చేస్తున్నారు. అయినా రెండు పిచ్‌లు దాదాపు ఒకేలా ఉంటాయని అక్కడి క్యూరేటర్‌ ‌చెబుతున్నాడు.

ఈ నేపథ్యంలో రెండో టెస్ట్‌కు మహ్మద్‌ ‌సిరాజ్‌ను తీసుకోవాలని క్రికెట్‌ ‌విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అంటున్నారు. మహ్మద్‌ ‌సిరాజ్‌ ‌కొత్త, పాత బంతులతో రాణించే సత్తా కలిగిన పేసర్‌. ‌మూడేళ్ల క్రితం అతను కేవలం ఎనిమిది ఇన్నింగ్స్‌లో 37 వికెట్లు తీశాడు. బెంగళూరులో ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. పాతబడిన బంతితో రివర్స్ ‌స్వింగ్‌ ‌సాధించి ఎనిమిది వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులే ఇవ్వడం గమనార్హం. ఆనాడు అతను తీసిన వికెట్లలో మార్నస్‌ ‌లబుషేన్‌ ‌కూడా ఉన్నాడు.

Leave a Reply