“మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన ‘సకలజనులు ..’సుదీర్ఘంగా కాలంగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమానికి కొనసాగింపుగా 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సకల జనుల సమ్మెకు రాజకీయ పార్టీల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. సకల జనుల సమ్మె పిలుపు సింగరేణి కార్మికుల నుండి అమోఘమైన స్పందన వచ్చింది. అప్పటి నాలుగు జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని 45 గనులు, వివిధ శాఖతో పాటు దాదాపు 60వేల మంది సింగరేణి కార్మికులు సమ్మె పిలుపునకు స్పందించారు. సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం నుంచి బొగ్గు బాయిలన్ని బంద్‌లో పాల్గొన్నాయి. సమ్మెను విజయవంతం చేయడానికి కార్మిక వర్గం అత్యంత ఆసక్తి కనబరిచారు. సెప్టెంబర్ 13 తరువాత అక్టోబర్‌లో దసరా పండుగ కూడా ఈ సకల జనుల సమ్మెలోనే జరిగింది. తెలంగాణ ప్రాంతంలో పెద్దగా జరుపుకునే పండగ దసరా మహిళా సోదరిమణులకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండగ ఈ పండగల సమయంలో కార్మికులు అనేక రకాలుగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కార్మికులు సమ్మెను విరమింపజేయలేదు. సమ్మె విరమణ జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రకటన జరగాలని పట్టుబట్టారు.”
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటాలలో సింగరేణి కార్మికులది ప్రత్యేకత ఉంది. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాల్లో అగ్రభాగాన నిలిచారు. తెలంగాణ ప్రజలకు, కార్మిక వర్గానికి పోరాట స్ఫూర్తినిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి వ్యూహరచనలు చేసేందుకు కోల్‌బెల్ట్ ఏరియాకు చెందిన నాయకులు ప్రముఖ పాత్ర పోషించారు. ఉద్యమ పార్టీకి అండగా ఉంటూ తెలంగాణలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి సంస్థలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏకచత్రాధిపత్యంగా తీర్చిదిద్దారు. వారి పిలుపునకు కార్మికులు సంపూర్ణ మద్దతుతో సకల జనుల సమ్మె విజయవంతమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించింది. సింగరేణి కార్మికుల పోరాటాలు అన్ని గుర్తు చేసుకోవడానికి ఇదో సందర్బంగా భావిస్తున్నాం. 9 సమ్మెలు – 45 రోజులు: సింగరేణి కార్మికులు మొక్కవోని ధైర్యంతో పోరాటాలు చేసి ఉద్యమ చరిత్రలో తమదైన పాత్ర పోషించారు. మలిదశ ఉద్యమంలో సింగరేణి పోరాటాలే ఉద్యమానికి ఊపిరాయ్యయి. మొత్తం సింగరేణి వ్యాప్తంగా 9 సమ్మెలు, 45 రోజుల సమ్మె జరిగింది. కార్మికుల పోరాటం తెలంగాణ ప్రజలను ఆలోచింపజేసింది. సింగరేణి కార్మికుల సమ్మెకు ఒక నాయకుడు లేదా ఒక సంఘం నాయకులు సమ్మె చేయాలని, సమ్మె చేస్తేనే తెలంగాణ రాష్ఠ్రం ఏర్పడుతుందనే ప్రచారమే లేదు. ఒక్క రోజు సమ్మె విజయవంతం చేయాలంటే ఆ సమ్మె చేయడానికి గల కారణాలు వివరిస్తూ బొగ్గు గనులపై సభలు, సమావేశాలు నిర్వహించి విస్త•తంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది.
కానీ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజుల్లో ఉన్న పొలిటికల్ జేఏసీ సింగరేణి కార్మికులను ఉద్యమంలోంచి పుట్టిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఏస్) నేత కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి లాంటి వారు ఒక పత్రిక ప్రకటన ద్వారా పిలుపునిస్తే ఆ రోజు సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో విస్తరించి వున్న దాదాపు 45 బొగ్గు గనుల్లో 60వేల మంది కార్మికులు విధులను బహిష్కరిస్తే.. ఆ రోజు ఒక్క బొగ్గు పెల్ల బయటకు వచ్చేదికాదు. ఒక సమ్మె చేస్తే దాని ఫలితాన్ని కార్మికులే అంచనా వేసి రాష్ట్ర సాధన కోసం కార్మిక వర్గం మరో ఆందోళన కోసం ఎదురుచూసే వారు. నాయకుడు సమ్మె అంటే సమ్మె…రాస్తారోకో అంటే రాస్తారోకో లు, వంటా వార్పు అంటే రోడ్లపై వంటలు. ఇలా ప్రతి పోరాటంలో కార్మికులంతా రోడ్డుపైకి వచ్చి ప్రత్యక్ష పోరాటాలు చేసిండ్రు. సింగరేణిలో మొట్టమొదటిసారిగా జరగిన సమ్మె నవంబర్ 30, 2009వ సంవత్సరంలో ఆ రోజు నిజంగా తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు వెళ్తుంటే అల్గునూరు అనే గ్రామం వద్ద కేసీఆర్‌ను వందలాది మంది సాయుధ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా అల్గునూరులో అరెస్ట్ చేసిన కేసీఆర్‌ను ఖమ్మం జిల్లాకు తరలించి జైలు పాలు చేశారు. ఈ అక్రమ అరెస్ట్‌ను కార్మికవర్గం నిరసన వ్యక్తం చేస్తూ సింగరేణిలో కార్మికులు విధులు బహిష్కరించి తొలి పోరాటం ప్రారంభించారు. ఆ తరువాత 2వ సారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు – సత్యగ్రహాలు చేస్తుంటే ఆంధ్ర వలసవాదుల ప్రభుత్వం ఆ విద్యార్థులపై పైశాచికంగా లాఠీచార్జీ చేయించారు. ఈ పోలీసుల లాఠీచార్జీలో వందలాది మంది విద్యార్ధిని విద్యార్థులు తీవ్రగాయాలపాలైనారు. ఆ సంఘటనకు చలించిన కార్మిక వర్గం కనెర్రజేసింది. 2009, డిసెంబర్ 7వ తేదీన తమ బిడ్డలపై ఆంధ్రా వలసవాదుల పైశాచికదాడులను ఇకపై సహించమని ప్రభుత్వానికి తెలియజేస్తూ డిసెంబర్ 7వ తేదీన సింగరేణి వ్యాప్తంగా 60వేల మంది కార్మికులు సమ్మె చేసి ప్రభుత్వానికి కనువిప్పు కల్గించే ప్రయత్నం చేసింది. 2009, డిసెంబర్ నెలలో వీరోచిత పోరాటం జరిగింది. దరిమిలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ విద్యార్థుల ్మబలిదానాలు, మూడున్నర కోట్ల మంది ప్రజల మనోభావాన్ని గమనించి డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నిస్తున్నట్టు ప్రకటించిన డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ ప్రకటన, డిసెంబర్ 23న ఢిల్లీ పార్లమెంటులో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేత రక్షణ మంత్రి చిదంబరం డిసెంబర్ 9న సోనియాగాంధీ చేసిన ప్రకటనను ‘యూ టర్న్’గా తీసుకున్నట్లు ప్రకటించారు
పార్లమెంటులో చిదంబరం చేసిన ప్రకటనను సింగరేణి కార్మిక వర్గం తీవ్రంగా ఆగ్రహించింది. 23వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న ప్రకటనను కేంద్ర ప్రభుత్వం తిరిగి వాపస్ తీసుకుంటే కార్మిక వర్గం డిసెంబర్ 24, 25 రెండు రోజులు టోకెన్ సమ్మె చేసి కార్మికుల ఐక్యతను పోరా•ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆ తరువాత తెలంగాణ పోరాటం ఉదృతంగా ఆరిపోని అసంతృప్తిలో పోరాటాలు నిరంతరం కొనసాగుతూ.. విద్యార్థి, యువకుల ఆత్మబలిదానాలు చేసుకుంటుండగానే రాష్ట్ర రాష్ట్ర పర్యటనపై శ్రీకృష్ణ కమిటిని నియమిస్తూ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు ఆవేశం వ్యక్తం చేసి శ్రీకృష్ణ కమిటి లేదు.. ఏది లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సవాల్‌గా 2010 మార్చి 4వ తేదీన టోకెన్ సమ్మెను కార్మికులు విజయవంతం చేశారు. ఆ తరువాత తెలంగాణ ప్రాంతంలో రాజకీయ కూటమి ఏర్పడింది. ఈ రాజకీయ కూటమి (పొలిటికల్ జేఏసీ) ఉద్యమంలో భాగంగా ఇచ్చిన రెండు రోజుల బంద్‌కు సంపూర్ణ మద్దతుగా 2010 జూన్, 24, 25వ తేదీల్లో సింగరేణలోని 60వేల మంది కార్మికులు బొగ్గు బాయిల్లో బంద్‌పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన వ్యక్తం చేసి రెండు రోజుల సమ్మె చేశారు. ఈ సమ్మెతో పొలిటికల్ ఐక్య నాయకులు మరింత స్ఫూర్తితో ఉద్యమాలు తీవ్రతరం చేసింది.
తెలంగాణ ప్రాంతంలో నిర్వీరమంగా కొనసాగుతున్న ఆందోళనలు, విద్యార్థి, యువకుల ఆత్మబలిదానాలు విపరీతమయ్యాయి. ఈ నేపథ్యంలో 2011 మార్చి 4, 5వ తేదీల్లో తెలంగాణలో కొనసాగుతున్న ఆత్మబలిదానాలు ఆపి తల్లుల కొడుపుకోత నివారించాలని వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని రాజకీయ పార్టీల ఐక్యవేదిక (జేఏసీ) మరోసారి రెండు రోజులు టోకెన్ సమ్మె చేయాలన్న పిలుపుకు కార్మికులు చిరునవ్వుతో 48 గంటల సమ్మె చేసి మరోసారి తెలంగాణ సాధనపై ఉన్న మమకారాన్ని ప్రకటించారు. ఆ తరువాత జరిగే భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తూ అనేక నిరసనలు, బంద్‌లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్న 10 జిల్లాల్లో సకల జనుల సమ్మె కోసం జేఏసీ సమాయత్తమవుతూ వ్యూహరచనలు చేసింది. అందుకోసం సాహసోపేతమైన సకల జనుల సమ్మె కోసం పిలుపునివ్వాలనే సంకల్పాన్ని జేఏసీ ప్రకటించింది. సుదీర్ఘంగా అప్పటి దాదాదాపు దశాబ్దం కాలంగా జరుగుతున్న పోరాటాలకు అలుపెరగని కార్మికులు 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సకల జనుల సమ్మెకు రాజకీయ పార్టీల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. సకల జనుల సమ్మె పిలుపు సింగరేణి కార్మికుల నుండి అమోఘమైన స్పందన వచ్చింది. అప్పటి నాలుగు జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని 45 గనులు, వివిధ శాఖ)తో పాటు దాదాపు 60వేల మంది సింగరేణి కార్మికులు సమ్మె పిలుపునకు స్పందించారు. సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం నుంచి బొగ్గు బాయిలన్ని బంద్‌లో పాల్గొన్నాయి. సమ్మెను విజయవంతం చేయడానికి కార్మిక వర్గం అత్యంత ఆసక్తి కనబరిచారు. సెప్టెంబర్ 13 తరువాత అక్టోబర్‌లో దసరా పండుగ కూడా ఈ సకల జనుల సమ్మెలోనే జరిగింది.
తెలంగాణ ప్రాంతంలో పెద్దగా జరుపుకునే పండగ దసరా మహిళా సోదరిమణులకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండగ ఈ పండగల సమయంలో కార్మికులు అనేక రకాలుగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కార్మికులు సమ్మెను విరమింపజేయలేదు. సమ్మె విరమణ జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రకటన జరగాలని పట్టుబట్టారు. కార్మికుల సమ్మె ప్రభావం కేవలం రాష్ట్రానికో.. దక్షిణాది రాష్ట్రాలకో కాకుండా ఢిల్లీ పెద్దలను ప్రభావితం చేసింది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర పెద్దలు స్పష్టమైన ప్రకటనతో సమ్మె విరమణకు పరిస్థితులు అనుకూలించాయి. ఫలితంగా అక్టోబర్ 17వ తేదీన కార్మికులు సమ్మె విరమించారు. అప్పుడు బొగ్గు గనులు బొగ్గును ఉత్పత్తి సాధించాయి. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన శ్రీకృష్ణ కమిటి మరో ఏడాదికి రాయల తెలంగాణ అని కొత్త ప్రతిపాదనను తెచ్చింది. కార్మికుల్లో మళ్లీ అసంతృప్తి జ్వాలలు రేగాయి. 2013 డిసెంబర్ 2వ తేదీన రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మరో సమ్మె జరిగింది. హైదరాబాద్ నగరం రాజధానిగా 10 జిల్లాల తెలంగాణే కావాలని బొగ్గు గనుల కార్మికులు గొంతెత్తి నినదించారు. సింగరేణి కార్మికులు అనేక సమ్మెలను తిప్పి కొట్టడానికి సీమాంధ్రవాదులు ఎన్ని కుట్రలు పన్నినా కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని తప్పుడు నివేదికలు ఇచ్చినా వాటన్నింటిని ఎప్పటికప్పుడు నిలదీస్తూ కార్మిక వర్గం పోరాటాలకు సిద్దమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యమని – రెండో కోరిక లేదని స్పష్టం చేసింది.
కార్మికులను ఐక్యం చేసిన సమ్మె: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన సింగరేణి కార్మికుల సమ్మె ఈ ప్రాంతంలోని అన్ని రకాల కార్మికులను ఐక్యం చేసింది. సింగరేణి కార్మికుల ఏకైక డిమాండ్ తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ చేసిన సమ్మె ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థ లలోని కార్మిక వర్గంకు స్ఫూర్తినిచ్చింది. సింగరేణి కార్మికులు చేస్తున్న సకల జనుల సమ్మెకు మద్దతు ప్రకటించని సంఘమే లేదు. చిన్న చిన్న సంఘాల నుండి ఆర్టీసీ, ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు ఇలా చెపుతూపోతే లెక్కలేనన్ని సంఘాలు ప్రత్యక్ష పరోక్షంగా మద్దతు ప్రకటించాయి. ఒక దశలో ఆర్టీసీ కార్మికులు కూడా ఒక వారం రోజుల పాటు సమ్మె చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వం కంటే ప్రత్యక్షంగా ప్రజలపైనే భారం పడింది. అన్ని రకాలుగా ఆలోచించి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమింపజేయటానికి అందరు సహకరించారు. పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఆర్టీసీ సమ్మెతో నష్టపోవాల్సి వచ్చింది. కార్మికుల సమస్యలను ప్రజల సమస్యలను కూడా సింగరేణి కార్మికులు విశ్లేషించి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల సమ్మెలపై విశ్లేషిస్తే ఒకప్పుడు అప్పటి కార్మికులకు సికాస చెప్పిందే వేదం. నిషిద్ధ పీపుల్స్‌వార్ అనుబంధ కార్మిక సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య చేసిన ఆందోళనలు, ఉద్యమాలు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజుల్లో సికాస సమ్మె పిలుపు ఒక్క పత్రిక ప్రకటన చేస్తే ఆ పిలుపునకు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో కోల్‌బెల్ట్ పూర్తిగా ఆగిపోయాయి. సికాస సమ్మెను వ్యతిరేకించడానికి పోలీసులు తప్పితే కార్మిక సంఘాలు కూడా ధైర్యం చేసిన సందర్బాలు లేవు. కార్మికుల కళాకారులు: సకల జనుల సమ్మెలో సింగరేణి కళాకారుల పాత్ర చాలా గొప్పది. సమ్మెలో కళాకారులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమ్మె జరిగిన రోజులలో కార్మికులు కళా బృందాలుగా బయలు దేరి బొగ్గు గనులపై పట్టణంలోని పలు కార్మిక వాడలలో వారి ప్రతిభను చూపించి తెలంగాణ ఆటా-పాటలతో కార్మిక కుటుంబాలను ఉత్సహపరిచి తెలంగాణ వచ్చేదాక పోరాడుడే అనే డిమాండ్‌ను ఇనుమడింప చేశారు. కోల్‌బెల్ట్ ఏరియాలోని సింగరేణి కార్మికులు వారు సభ్యులుగా ఉన్న అరుణోదయ కళాకారులు ప్రజానాట్య మండలి కళాకారులు, నాస్తిక సమాజం కళాకారులు వందలాది మంది కళాకారుల బృందాలు స్వచ్ఛందంగా బయలుదేరాయి. సింగరేణి కళాకారులు పల్లె లింగన్న, కొప్పుల రాజనర్సు, సీహెచ్.జాకబ్, కె.స్వామి, కన్నం లక్ష్మీనారాయణ, భానూరి సత్యనారాయణ, ఈదునూరి పద్మ, సౌమ్య, మధుప్రియ, ఎం.పద్మ, మౌనిక, నాస్తిక వెంకన్న, రామస్వామి, రాయనర్సు, మోహన్, డప్పు రవి, రమేశ్, సతీష్‌లు డప్పులు, గొంగళ్లు వేసుకొని కళాకారులు కోల్‌బెల్ట్ మొత్తం చుట్టి చేసే ప్రదర్శనలు, కార్మికులను, ప్రజలను, వ్యాపార వాణిజ్య సంస్థలను బలంగా ఆకర్షించాయి. సకల జనుల సమ్మెలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ నాయకులు కాసిపేట లింగయ్య 35 రోజుల పాటు వేదిక నిర్వహించి కళాకారులతో ప్రతి రోజు సాయంత్రం కళాకారులచే కార్యక్రమాలు నిర్వహించడం గోదావరిఖని కోల్‌బెల్ట్ ఏరియా చరిత్రలో మిగిలి వుంటుంది. ప్రెస్‌క్లబ్ పాత్ర – జతకలిపిన హెచ్ఎంఎస్: సకల జనుల సమ్మెలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అప్పటి పాత్రికేయులు ప్రత్యక్ష పోరాటాలకు దిగడం హైలెట్‌గా నిలిచింది. సీనియర్ జర్నలిస్ట్ ఎస్.కుమార్ కేసీఆర్ దీక్ష సమయంలో ఆయన నిరాహారదీక్ష చేయటం గోదావరిఖని పోరాట చరిత్రో మరువలేనిది. నాలుగు రోజుల ఎస్.కుమార్ దీక్షను పోలీసులు జోక్యంతో ఆగిపోయింది. సుదీర్ఘంగా జరిగిన పోరాటాలలో ఖని పాత్రికేయులు ఎం.వంశీ, పిట్టల రాజేందర్, నాయిని మధునయ్య, ఎం.రామమూర్తి, బాలసాని స్వామిగౌడ్ తదితరులు పరోక్ష, ప్రత్యక్ష పోరాటాలలో భాగస్వాములయ్యారు. సింగరేణి కార్మికుల సుదీర్ఘ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, జేఏసీ నాయకులు ఎం.విజయానంద్, జేవీ రాజుకు అందరు సహకారాలు అందించారు. బొగ్గు గని కార్మికుల పోరాటాలకు మద్దతుగా నిలబడ్డారు.
సకల జనుల సమ్మె – సింగరేణి కార్మికులు:
– 2009 డిసెంబర్ 7న ఓయూ విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా, విద్యార్థుల బలిదానాలను వ్యతరేకిస్తూ సమ్మె.
– 2009 డిసెంబర్ 2,4 25న రెండు రోజులు, 23న చిద•బరం యూటర్న్ తీసుకున్నందుకు నిరసనగా సమ్మె. పార్లమెంటులో ప్రకటనకు నిరసనగా బాయిలు బంద్ చేశారు.
– 2010 మార్చి 4న శ్రీకృష్ణ కమిటి బహిష్కస్తూ సమ్మె
– 2010 జూన్ 24, 25న జేఏసీ పిలుపుకు సమ్మె
– 2011 మార్చి 4 జేఏసీ సమావేశం
– 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 17 5రోజులు సమ్మె
– 2013 డిసెంబర్ 2న రాయలతెలంగాణకు వ్యతిరేకంగా చివరి సమ్మె
నాయిని మధునయ్య, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రజాతంత్ర ప్రతినిధి.