Take a fresh look at your lifestyle.

సంబరాలకేనా.. సచ్చిపోతే రారా..!

* కార్మికుల ఫండ్‌ ‌నుండి 40 కోట్లు ఇస్తరు
* సచ్చిపోతే స్పందించరా..?
* మంత్రులు, సింగరేణి యాజమాన్యంపై వీహెచ్‌ ‌ఫైర్‌
రాష్ట్ర మంత్రులు పార్టీ సంబరాలకే పరిమితమవుతున్నారని కార్మికులు చనిపోయినా కనీసం మానవతా హృదయంతో పరామర్శించడానికి కూడా రావడం లేదని ఏఐసీసీ నాయకులు వీ.హన్మంతరావు ధ్వజమెత్తారు. గురువారం గోదావరిఖని పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమానికి ముందుండే సింగరేణి కార్మిక క్షేత్రంలో హృదయ విదారకంగా ఓసీపీ బ్లాస్టింగ్‌లో చనిపోతే ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీలు తాపీగా తమ కార్యక్రమాలు ముగించుకుని రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీయం రిలీఫ్‌ ‌ఫండ్‌కు కార్మికుల జీత భత్యాల నుండి కోత విధించి 40 కోట్లు దానం చేసిన సీఅండ్‌ఎం‌డీ మరీ నలుగురు కార్మికులు ముక్కలు, చెక్కలై చనిపతే వారి కుటుంబానికి మృత్యుపరిహారంగా డబ్బులు ఇవ్వడానికి 38 గంటల సమయం తీసుకోవడం పట్ల మండి పడ్డారు. పక్క రాష్ట్రంలో ఒక ప్రైవేట్‌ ‌కంపెనీలో ప్రమాదం సంభవిస్తే రూ. 50 లక్షలు డిమాండ్‌చేస్తే ఒక చనిపోయిన వ్యక్తికి కోటి రూపాయలు అందజేస్తే ఇక్కడి ప్రభుత్వం ఒక్క కోటి డిమాండ్‌చేస్తే కేవలం 40 లక్షల రూపాయలు అందజేసి చేతులు దలుపుకోవడం దురదృష్టకరమని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి రావడానికి కూడా మంత్రులు జంకుతున్నారని కేసీఆర్‌ ఆదేశాలతోనే అడుగు బయట పెట్టేలా వ్యవహార శైలిని మంత్రులు అవలంబిస్తున్నారని విమర్శించారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవిత కూడా ప్రమాదం పట్ల స్పందించకపోవడం, ట్విట్టర్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే కేటీఆర్‌ ‌కూడా కామెంట్‌ ‌చేయకపోవడం కార్మికుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని తెలుపుతుందని అన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను పరిశీలిద్దామని పోతే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని, ఇది ప్రజాస్వామ్యమా లేదా రాచరికమా అని ప్రశ్నించారు. రెండు ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ కూడా నేడు కేంద్రంలో అధికారంలో ఉందన్నది మరిపోవద్దని తరువాత నీకు, నీ పార్టీకి అధోగతి తప్పదని కేసీఆర్‌ను హెచ్చరించారు. అంతకుముందు మృతుల కుటుంబ సబ్యులను పరామర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాములు నాయక్‌, ‌పెద్దపల్లి పార్లమెంట్‌ ‌నియోజకవర్గ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంఛార్జి ఆగం చంద్రశేఖర్‌, ‌పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, శాఫ్‌ ‌మాజీ ఛైర్మన్‌ ‌రాజ్‌ఠాకూర్‌ ‌మక్కాన్‌ ‌సింగ్‌, ‌నాయకులు గుమ్మడి కుమార స్వామి, మహంకాళి స్వామి, యండీ ముస్తఫా, నాయకులు పెద్దెల్లి ప్రకాశ్‌, ‌గాదం విజయ, యండీ రహీమ్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply