మట్టెవాడ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ మార్పిడి చేసి మితిమీరిన శబ్ధ్దంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ద్విచక్ర వాహనదారులపై వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్‌కు పలు ఫిర్యాదు రావడంతో స్పందించిన సిపి దీనిపై ప్రత్యేక డ్రైవ్ చెపట్టాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. దీనితో వరంగల్ ట్రాఫిక్ ఏసిపి బాలస్వామి అధ్వర్యంలో వరంగల్ ట్రాఫిక్ సిఐ తూడిచర్ల స్వామి, ఎస్ఐ ఫసియుద్దీన్, సిబ్బందితో వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బట్టల బజార్, జెపిఎన్ రోడ్ లో గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈసందర్భంగా సైలెన్సర్ మార్పిడి చేసి మితిమీరిన శబ్ధంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న 9 రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ సిఐ స్వామి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వచ్చిన 2 ఆటోలలో నుండి సౌండ్ బాక్స్‌లు తీసివేసి వారికి ఫైన్ విధించారు. అలాగే నెంబర్ ప్లేట్ లేని 2 వాహనాలకు ఫైన్ విధించారు. ఒక మైనర్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి ఫైన్ విధించారు. అనంతరం బట్టల బజార్లో వ్యాపారం కోసం రోడ్ ఆక్రమించిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్ మీద వున్న వస్తువులను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఫసియుద్దీన్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: mattevada, police commissioner, two wheeler silencers, sound pollution