Take a fresh look at your lifestyle.

టీకాతో సైడ్‌ ఎఫెక్ట్సు తక్కువే..!

కొరోనా నిరోధానికి దేశీయ టీకాలను వేసే కార్యక్రమం గత పదిహేను రోజులుగా స్వల్ప సంఘటనలు మినహా ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సజావుగా సాగుతుంది. ఈ టీకాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల అనుమానాలు వ్యక్తం చేసిన వారు సైతం ఇప్పుడు ఇవి బాగానే ఉన్నాయనీ, సైడ్‌ ఎఫెక్టులు లేవని చెబుతున్నారు. ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ‌డాక్టర్లు, నర్సులు, పోలీసు సిబ్బంది, అధికారులకు ఈ టీకాలు వేయడంలో ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వాలు..ఇప్పుడు 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఏప్రిల్‌ ఒకటి నుంచి వ్యాక్సిన్‌కు అనుమతినిస్తూ కార్యక్రమాన్ని ఉధృతం చేయనున్నారు. మంగళ వారం ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 10,07,091 శిబిరాల ద్వారా 6,11,13,354 టీకాల పంపిణీ జరిగినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల యాభైవేల మందికి మొదటి దశ వాక్సినేషన్‌ ‌కార్యక్రమం పూర్తయింది. ఈ టీకా తీసుకున్న తర్వాత ఎటువంటి తేడా కానీ, సైడ్‌ ఎఫెక్ట్సు ఉండవని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ ‌శ్రీనివాస్‌ ‌రావు భరోసానిస్తున్నారు.

టీకా తీసుకున్న తరువాత ఎటువంటి ఆహార, పానీయ నిబంధనలు అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. వేగంగా విస్తరిసున్న రెండవ దశ కొరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని సూచించారు. గత వారం రోజులుగా ఆందోళన కలిగిస్తున్న కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి కారణంగా ప్రజలు స్వచ్ఛందంగా వాక్సిన్‌ ‌తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. ప్రముఖులు, సామాన్యులు వరసలో ఉండి టీకాలు తీసుకుంటున్నారు. కొరోనా సృష్టించిన భయం కారణంగా ఈ టీకాలు తీసుకునేందుకు జనం వెనకడుగు వేయడం సర్వసాధారణమే, కానీ, ఒకరిద్దరు మినహా అందరూ ఈ టీకాల వల్ల సైడ్‌ ఎఫెక్టులు లేవని చెబుతుండటంతో జనానికి ధైర్యం వస్తుంది. ఇంతకు ముందు విముఖంగా ఉన్నవారు సైతం టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామం.

భారత్‌ ‌వంటి అతి పెద్ద దేశంలో ఈ టీకాల కార్యక్రమం ఎటువంటి హడావిడి లేకుండా సాగడం చెప్పుకోదగిన విషయం. ప్రభుత్వం ముఖ్యంగా, వైద్య ఆరోగ్య శాఖ మరికొన్ని రోజులు ముందే ఈ టీకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేయడానికి వైద్యులు, ఈ రంగానికి చెందిన ప్రముఖులు తమ అనుభవాలను ఒక్కొక్కరూ తెలియజేస్తున్నారు. ఈ టీకా వేయించుకున్న తర్వాత మామూలుగానే విధులకు హాజరవుతున్నామనీ, ఎటువంటి మార్పు రాలేదని పలువురు తమ అనుభవాలను వివరిస్తున్నారు. టీకాలు వేయించుకోవడానికి ప్రజల్లో కొందరు ప్రారంభంలో సందేహాలను వ్యక్తం చేసినా గత కొన్ని రోజులుగా స్వచ్ఛందంగా ముందుకు రావడంతో పండుగ వాతావరణం కనిపించిందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడొకరు చెప్పారు. అలాగే, ఇతర నగరాల్లో కూడా పలువురు వైద్య ప్రముఖులు తమ అనుభవాలను తెలియజేస్తున్నారు.

కొరోనా ప్రారంభంలో వైద్యులతో పాటు ప్రభుత్వంలోని పలు శాఖలు పడ్డ శ్రమను గుర్తు చేస్తూ..ఈ సారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు ప్రతి ఒక్కరు కొరోనా నిబంధనలను పాటిస్తూ..వాక్సిన్‌ ‌తీసుకోవాలని డైరెక్టర్‌ ‌శ్రీనివాస్‌ ‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణలలో ఈ టీకాల కార్యక్రమం జోరుగానే సాగుతుంది. వాక్సినేషన్‌ ‌కార్యక్రమం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌టీకాలు వేసే ప్రదేశానికి వెళ్ళి టీకాలు వేయించుకున్న వారికి వెన్నుతట్టి ధైర్యం తెలిపారు. ప్రభుత్వాధినేత తమకు ధైర్యం చెప్పడంతో వారిలో కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేం. అంతేకాకుండా ఎక్కడా లోపాలు లేకుండా ఒక సమాహారంగా టీకాలు వేసే కార్యక్రమం సాగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించవొచ్చన్న నమ్మకం ఇంతవరకూ అనుమానాలు వ్యక్తం చేసినవారికి సైతం కలుగుతుంది. ఇది మంచి పరిణామం. టీకాలు వేయించుకున్న ప్రముఖ వైద్యులు వెల్లడిస్తున్న స్వీయ అనుభవాలు ఈ కార్యక్రమానికి ఊపిరి కానున్నాయి.

బెంగళూరు మణిపాల్‌ ‌హాస్పిటల్‌ ‌ప్రధాన వైద్యాధికారి తనకు టీకా వేయించుకున్న తర్వాత ఎటువంటి ఎఫెక్ట్సు కలగలేదనీ, చాలా సాదారణంగానే ఉన్నానని చెప్పారు. అలాగే, కోల్‌ ‌కతా, ముంబాయి. తదితర నగరాల్లో వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా వేలాది కేంద్రాల్లో ఒకే సారి టీకాలు వేసే కార్యక్రమం అమలు జరగడం అపూర్వమైన విషయం. ఎక్కడా సమాచార లోపం లేకుండా అంతా సజావుగా సాగడం సంతోషించాల్సిన విషయం. కొన్ని చోట్ల టీకాలు వేయించుకున్నవారు కళ్ళు తిరిగినట్టు ఫిర్యాదు చేశారనీ, కొందరికి వళ్ళు పలవరింతగా అనిపించినట్టు కనిపించినట్టు చెప్పారని వైద్యాధికారులు తెలిపారు. ఇవన్నీ, ప్రాథమికమైన ఫిర్యాదులేననీ, కొద్ది గంటల సేపు ఇలాంటివి సహజమని వైద్యరంగం నిపుణులు చెబుతున్నారు.

కొరోనాని అరికట్టడంలో ఈ రెండు స్వదేశీ వ్యాక్సిన్లు బాగా ఉపయోగ పడితే భారత దేశం ఘనవిజయం సాధించినట్టే. తొలి డోస్‌ ‌తీసుకున్న తర్వాత పన్నెండు రోజులకు 30 నుంచి 40 శాతం యాంటీ బాడీలు వృద్ధి అవుతాయనీ, నాలుగు వారాలకు 60-70 శాతం యాంటీ బాడీలు వృద్ధి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. టీకా తీసేసుకున్నాం కనుక ఇంకేం పర్వాలేదనే ధైర్యం పనికి రాదనీ, ఇంతకు ముందు ఏ జాగ్రత్తలు పాటించారో వాటిని కొనసాగించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోవొచ్చు. తమ అనుభవాలను పంచుకోవడానికి జనంలోకి వెళ్ళకూడదు. కొరోనా నియంత్రణకు చాలా మంది ఇప్పటికే జాగ్రత్తలు పాటిస్తున్నారు.

వాటిని కొనసాగించడంలో పెద్ద ఇబ్బందులేమీ ఉండవు. అంతేకాకుండా ఇంటిపట్టున ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. టీకా వేయించుకుంటే బయట స్వేచ్ఛగా తిరగొచ్చన్న అభిప్రాయం తప్పు. ఏ వైద్యానికైనా ముందు జాగ్రత్తలతో పాటు తర్వాత జాగ్రత్తలు కూడా అవసరమే. వంద శాతం యాంటీ బాడీలు వృద్ధి చెందకపోతే పూర్తి రక్షణ లభించదని చెబుతున్నారు. అంతేకాకుండా, 28 రోజుల్లో రెండో డోస్‌ ‌టీకా తీసుకోవాలనీ, అశ్రద్ధ చేస్తే ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. కొరోనా నుంచి బయటపడేందుకు ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పటికీ పడుతున్నాం, ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారి నుంచి పూర్తి విజయం సాధించనట్టే.

Leave a Reply