Take a fresh look at your lifestyle.

అభివృద్ధిలో సిద్ధిపేట ఎల్లకాలం ఫస్టు ప్లేస్‌..

  • అం‌దుకు ప్రజలు భాగస్వాములు కావాలి..మంత్రి హరీష్‌రావు ఆశాభావం
  • పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో మహిళలది కీలక పాత్ర
  • పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధికరణ కేంద్రం ప్రారంభం
  • ఎస్‌టిపి ద్వారా శుద్ధిచేసిన నీరు నర్సాపూర్‌ ‌చెరువులోకి

సిద్ధిపేట, ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 20  : అభివృద్ధిలో సిద్ధిపేట ఎల్లకాలం మొదటి స్థానంలో నిలిచేలా పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్ధిపేట పట్టణంలోని 21వ వార్డులో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిద్ధిపేట పట్టణ భూగర్భ మురుగు నీరు శుద్ధీకరణ కేంద్రంను మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మంజుల రాజనర్సుతో కలిసి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ…అందరి సహకారంతో సిద్దిపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు, కేవలం మూడున్నర సంవత్సరాల కాలంలోనే సిద్దిపేట పట్టణంలో అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసి, 300 కోట్ల రూపాయలతో మురుగునీరు శుద్ధీకరణకు ఎస్‌టిపి ప్లాంటును  ఏర్పాటు చేసిన మొదటి మునిసిపాలిటీ సిద్దిపేట నిలిచిందని అన్నారు.

ఎస్‌టిపి ద్వారా శుద్ధిచేసిన మురుగునీటిని నర్సాపూర్‌ ‌చెరువులోకి విడుదల చేస్తున్నామనీ, అక్కడి నుండి హరితహారం మొక్కలకు పంట పొలాలకు నీరు ఉపయోగిస్తామన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ముఖ్యమని చెత్తను మురుగునీటి పైపులలో వేస్తే  పైపులు జామయి నీరు మ్యాన్‌వోల్స్ ‌నుంచి బయటకొస్తుందనీ, తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించి చెత్తను సేకరించే మున్సిపల్‌ ‌వాహనాల్లో వేయాలన్నారు. అందరి సహకారంతో సిద్దిపేట విద్య, వైద్య ఆరోగ్యం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రస్తుతం సిద్ధిపేటలో మహిళా డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్‌, ‌మెడికల్‌, ‌పీజీ, నర్సింగ్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేసామన్నారు. అభివృద్ధిలో సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో 18 అవార్డులు వొచ్చాయని ఇదేవిధంగా ఎల్లకాలం అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచేలా పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.

ఒకప్పుడు తాగునీటి సమస్యతో పిల్లనివ్వడానికి ముందుకు రాని సిద్దిపేటలో ప్రస్తుతం ఇంటింటికి శుద్ధమైన గోదావరి నీరు సరఫరా చేస్తున్నామని, కాళేశ్వరం నీటితో సిద్దిపేటలో కాలమేదైనా సాగునీటి వనరులు కలకలలాడుతూ మత్తడి దూకుతూ వానకాలంను తలపిస్తున్నాయని, మండుటెండలో కూడా కోమటిచెరువు మత్తడి దుంకుతుందనీ మం్రతీ హరీష్‌ ‌రావు తెలిపారు. మెదక్‌ ‌పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సహకారంతో మంత్రి హరీష్‌రావు కృషితో సిద్దిపేట అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి సాధిస్తుందని, జరుగుతున్న పనులకు జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతూ సిద్ధిపేట పట్టణం ఇతర రాష్ట్రాలకు అధ్యయన కేంద్రంగా మారిందన్నారు.

ప్రైవేట్‌ ‌విద్యా వ్యవస్థకు తావులేకుండా జిల్లాలో ఉత్తమమైన ప్రభుత్వ విద్య అందించబడుతుందన్నారు. పేద ప్రజలు సుదూర ప్రాంతానికి వైద్యం కోసం వెళ్లకుండా డయాలసిస్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేశారని, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాలో మోకాళ్ల చిప్ప మార్పిడి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న వారికి ఉచితంగా కోచింగ్‌ ‌సెంటర్ల నెలకొల్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌జిల్లా అదనపు కలెక్టర్‌ ‌ముజామ్మిల్‌ ‌ఖాన్‌, ‌మునిసిపల్‌ ‌వైస్‌ ‌ఛైర్మన్‌ ‌కనకరాజు, ఏఎంసి ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, సూడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌రెడ్డి, స్థానిక కౌనిల్సర్‌ ‌నాజియా, మునిసిపల్‌ ‌కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముస్లింలకు రంజాన్‌ ‌కానుక, తోఫాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సిఎం కేసీఆర్‌ ‌నిరుపేద ముస్లింలకు రంజాన్‌ ‌కానుక తోఫాలు అందిస్తున్నారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని కేసీఆర్‌ ‌నగర్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌లో బుధవారం 550 మంది నిరుపేద ముస్లింలకు రంజాన్‌ ‌కానుక, తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలు సైతం పండుగలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని లక్ష్యంతో నిత్యావసర సరుకులతో పాటు దుస్తులను అందిస్తున్నామని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కొరోనా కారణంగా మీ అందరినీ కలవలేకపోయానని, అయినా ఆ రెండేళ్లు రంజాన్‌ ‌కానుకలను మీ ఇంటి వద్దకే పంపించామని చెప్పారు. సిద్ధిపేట కేసీఆర్‌ ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కాలనీ ఆదర్శంగా నిలవాలని కోరారు.

కేసీఆర్‌నగర్‌ ‌కాలనీ చూసేందుకు దూర  ప్రాంతాల నుంచి ఎంతో మంది వొచ్చి చూసి వెళ్తున్నారని, కాలనీని పరిశుభ్రంగా నిలిపే బాధ్యత మనందరిపై ఉన్నదని తెలిపారు. గతంలో నిరు పేదలు నెల వొచ్చిందంటే అద్దె కట్టడానికి ఎంతో ఇబ్బందులు పడేవారని, ఇవాళ డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌సంతోషంగా గౌరవంగా జీవిస్తున్నారని, రూపాయి ఖర్చు లేకుండా బట్టలు పెట్టి మీకు ఇంటి తాళం అప్పగించామని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను కొంత మంది కిరాయి ఇస్తున్నారని, విక్రయాలు జరిపేందుకు చూస్తున్నట్లు తమ దృష్టికి వొచ్చిందన్నారు. కిరాయికి ఇల్లు ఇస్తే ఇచ్చిన ఇల్లు వాపస్‌ ‌తీసుకుని మరో అర్హులైన వారికి ఇస్తామని, విక్రయాలు జరిపితే అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీ పరిశుభ్రతను విస్మరించి ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి పోలీసులకు, మున్సిపల్‌ అధికారులకు అప్పగించాలన్నారు. కేసీఆర్‌నగర్‌లో త్వరలో పోలీస్‌ ఔట్‌ ‌పోస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సెల్‌ఫోన్‌ ‌టవర్‌, ‌వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌, ‌హైమాస్ట్ ‌లైట్‌, ‌స్కూల్‌ ‌ఫర్నీచర్‌ ‌త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కాలనీలో ఇప్పటికే సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఇక ముందు సైతం కావాల్సినవన్నీ దశల వారీగా సమకూరుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం పట్టణంలోని మదీనా ఫంక్షన్‌ ‌హాల్‌లో తంజీమ్‌ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్‌ ‌మాసం పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని 75 మంది ఇమామ్‌, ‌మౌజమ్‌లకు మంత్రి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ ‌హుస్సేన్‌, ‌మునిసిపల్‌ ‌మాజీ  చైర్మన్‌ ‌రాజనర్సు, మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌పాల సాయిరాం, మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply