Take a fresh look at your lifestyle.

విత్తనోత్పత్తికి..సిద్ధిపేట అనుకూలం

  • ఉత్పత్తికి ముందుకొచ్చే విత్తన కంపెనీలకు సంపూర్ణ సహకారం
  • విత్తనోత్పత్తి రంగం అభివృద్ధి వల్ల రైతుల ఆదాయం రెట్టింపు
  • విత్తన కంపెనీ ప్రతినిధులు, శాస్త్రవేత్తల సమావేశంలో మంత్రి హరీష్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ద్వారా సాగునీటి సౌకర్యం జిల్లాలో మెరుగవడంతో విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాల అనుకూలంగా మారిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. జిల్లాలో విత్తనోత్పత్తికి ముందుకు వచ్చే విత్తన కంపెనీలకు ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. సిద్ధిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బుధవారం రంగనాయక సాగర్‌ ‌గెస్ట్ ‌హౌస్‌లో విత్తన కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్‌ ‌కార్పొరేషన్‌ అధికారులతో హరీష్‌రావు సమావేశం నిర్వహించారు. దేశంలో పేరిన్నికగల కావేరి, ప్రసాద్‌, ‌గంగా కావేరి, యజ్ఞ, జెమిని, మోనోశాంట్‌, ‌రాశి, కార్తికేయ తదితర 23సీడ్‌ ‌కంపెనీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…సాగునీటి సౌకర్యం మెరుగవడం, జిల్లాలో 5 రిజర్వాయర్‌లతో వాతావరణంలో తేమ శాతం పెరగడం, సారవంతమైన నేలలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు జిల్లా చేరువలో ఉండడం, రహదారి సౌకర్యం, ఉద్యాన వన విశ్వ విద్యాలయం, ఉద్యానవన, అటవీ పరిశోధన కేంద్రాలు, మొక్కజొన్న పొద్దు తిరుగుడు పరి శోధన కేంద్రం, నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ ‌తదితర అన్ని అంశాల పరంగా సిద్దిపేట జిల్లా అనువుగా ఉందన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు 100 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉండడం వల్ల వేసవిలో సైతం విత్తనోత్పత్తికి సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంటుందన్నారు.

జిల్లాలో మొత్తం 5 లక్షల ఎకరాలు సాగులో ఉండగా..ప్రస్తుతం జిల్లాలో సీడ్‌ ‌కార్పొరేషన్‌ ‌ద్వారా 1500 ఎకరాలు, ప్రైవేట్‌ ‌విత్తన కంపెనీల ద్వారా 25 వేల ఎకరాలలో మొక్కజొన్న, వరి, కాటన్‌, ‌బెంగాల్‌ ‌గ్రామ్‌, ‌వేరు శనగ విత్తనాలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. 25 సీడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌ప్లాంట్‌లు, 3 కోల్డ్ ‌స్టోరేజ్‌లు జిల్లాలో ఉన్నాయన్నారు. ఇటీవలే ఫామ్‌ ఆయిల్‌ ‌సాగుకు సైతం సిద్ధిపేట జిల్లా అనుకూలమని కేంద్ర ప్రభుత్వం తేల్చిందన్నారు. రానున్న రోజుల్లో సంప్రదాయ పంటల స్థానంలో కనీసం 1 లక్ష ఎకరాలలో విత్తనోత్పత్తిని చేపట్టడం తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ కార్యచరణ సిద్ధం చేస్తుందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో విత్తనోత్పత్తి సాగు విస్తీర్ణం, అభివృద్ధిని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విత్తన కంపెనీలకు – రైతులకు ఇద్దరికీ ప్రయోజనం విన్‌ – ‌విన్‌ ‌పరిస్థితి ఉండడం వల్ల సిద్ధిపేట జిల్లాను సీడ్‌ ‌గ్రోయింగ్‌ ‌జిల్లాగా తీర్చిదిద్దేందుకు విత్తన కంపెనీల సహకారం కావాలని మంత్రి కోరారు. విత్తనోత్పత్తితో పాటు జిల్లాలో కూరగాయల నర్సరీ, టీస్యూ కల్చర్‌ ‌వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తనోత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు రైతులు- విత్తన కంపెనీ మధ్య సమన్వయానికి విశ్రాంత వ్యవసాయ అధికారులను నియమిస్తామన్నారు. విత్తనోత్పత్తికి సమాయత్తం చేసేందుకు ఇప్పటికే పలు గ్రామాలలో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. రైతుకు సైతం ఆసక్తిగా ఉన్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. వచ్చే రబీలో కొన్ని గ్రామాలను విత్తన కంపెనీ యాజమాన్యాలు అడాప్ట్ ‌చేసుకొని విత్తనోత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాలని మంత్రి హరీష్‌ ‌రావు విజ్ఞప్తి చేశారు. మొదటి విడతలో విత్తన కంపెనీలకు విత్తనోత్పత్తికి సంబంధించి అన్ని రకాలుగా అనువైన గ్రామాలను కేటాయిస్తామన్నారు.

కంపెనీ ప్రతినిధులు తాము జిల్లాలో రబీ సీజన్‌లో ఎన్ని ఎకరాలలో విత్తనోత్పత్తి చేపట్టనున్నారో తెలియచేయాలన్నారు. డ్రిప్‌, ‌ఫామ్‌ ‌మెకనైజేషన్‌కు ప్రభుత్వం సహకరిస్తామని మంత్రి తెలిపారు. ప్రజల అరోగ్య పరిరక్షణ దృష్ట్యా పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వాలు నిరుత్సాహపరుస్తున్నందున జిల్లాలో బీడీలు చుట్టి ఉపాధి పొందుతున్న మహిళలను విత్తనోత్పత్తి రంగంలో భాగస్వామ్యం అయ్యేలా చూస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ…జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు రిజర్వాయర్లను నిర్మించామన్నారు. 46 వేల భూసేకరణ జరిపామన్నారు. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూషన్‌ ‌కాలువలు నిర్మాణం పూర్తి చేశామన్నారు. రానున్న 5 నెలల్లో పిల్ల పంట కాల్వల నిర్మాణం కోసం మిగిలిన సుమారు 6 వేల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి..నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తద్వారా ప్రతి గ్రామంకు సాగు నీటి సౌకర్యం చేకూరుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం, ఉచిత 24 గంటల నాణ్యమైన సాగు విద్యుత్‌, ఎరువులు, రైతు బీమా అందిస్తున్నారు.

సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వల్ల భూగర్భ జలమట్టం గణనీయంగా పెరగడం, ఉపరితల సాగునీటి లభ్యత పెరగడం వల్ల క్షేత్ర స్థాయిలో విత్తనోత్పత్తికి జిల్లా అనుకూలంగా మారిందన్నారు. విత్తన అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ విత్తన రాజధాని హైదరాబాద్‌ ‌మాదిరి తెలంగాణకు విత్తన కేంద్రంగా సిద్దిపేట చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందనీ, ఇందుకు విత్తన కంపెనీలు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్‌ ‌కోరారు. సీడ్‌ ‌కార్పొరేషన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌కేశవులు మాట్లాడుతూ…విత్తనోత్పత్తికి జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. సీడ్‌ ‌కార్పొరేషన్‌, ‌సీడ్‌ ‌సర్టిఫికేషన్ల ద్వారా జిల్లాలో సీడ్‌ ‌కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. విత్తనోత్పత్తికి యాసంగి అనుకూలమన్నారు. సమయం తక్కువగా ఉన్నందున కంపెనీలు సీడ్‌ ఉత్పత్తికి సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో సీడ్‌ ‌కార్పొరేషన్‌ అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌పద్మాకర్‌, ‌శిక్షణ కలెక్టర్‌ ‌దీపక్‌ ‌తివారీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌, ‌ప్రముఖ విత్తన కంపనీ ఉత్పత్తిదారులు, తోర్నాల విత్తన పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply