Take a fresh look at your lifestyle.

ఆరోగ్యం దృష్ట్యా వరవరరావును విడుదల చేయాలి

  • సిఎం కెసిఆర్‌, ‌ప్రధాని మోడీలకు జానారెడ్డి లేఖ
  • వరవరరావు విడుదలకు పెరుగుతున్న వొత్తిడి

విరసం నేత వరవరరావు విడుదల కోసం కవులు, కళాకారులు, రాజకీయ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వొత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వరవరరావు విడుదల కోసం చేస్తున్న ఉద్యమానికి పలువురు మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. వరవరరావును మైరుగైన చికిత్స అందించి.. విడుదల చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరవరరావుకు మధ్యంతర బెయిల్‌ ‌కోసం చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ‌నేత జానారెడ్డి లేఖలు రాశారు.  వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, కోవిడ్‌ ‌సహా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. ఆయన ఆరోగ్యం, బాగోగులు చూసుకోవడానికి వారి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కోరారు.

2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, నక్సలైట్‌లతో శాంతి చర్చలు జరపడంలో వరవరరావు పాత్ర క్రియాశీలకమైందని జానారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహారాష్ట్రలోని జైళ్లలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలని తెలుగు కవులు, కళాకారులు సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర సీఎం, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు 520 మంది తెలుగు కవులు, కళాకారులు లేఖలు రాసిన విషయం తెలిసిందే. బీమా-కోరేగావ్‌ ‌కేసులో విచారణ ఖైదీగా ఉన్న 81 ఏళ్ల వరవరరావుకు కరోనా సోకడం తమను తీవ్ర దిగ్భ్రాతికి గురిచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావు రెండేళ్లుగా విచారణ ఖైదీగా దుర్భర జైలు జీవితం గడుపుతున్నారని, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉండటం విచారించాల్సిన విషయమని అన్నారు. బీమా-కోరేగావ్‌ ‌కేసు విచారణ ఏమాత్రం ముందుకుపోలేదని, వరవరరావు బెయిల్‌ ‌పిటిషన్లను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply