‘చిన్న సన్న’కారు రైతతడు
బక్కచిక్కిన మట్టి మాణిక్యమతడు
గడియ తీరిక లేక చెమటోడ్చే..
అన్నామృత సృష్టికర్త కూడా అతడే !
బతుకంతా భవసాగర వెతలు
ఎన్నడు తరగని అప్పుల కుప్పలు
నాగలినే నమ్మిన పల్లె పరిమళమతడు
భూమిని కూడా పోషించగల త్యాగధనుడు !
అతనో ఆదర్శ హలధారి
ఆరుగాలం ఆరాటపడే..
అవిశ్రాంత శ్రామిక జీవతడు
లోక కళ్యాణ కారకుడైన జీవుడు !
వడ్ల బస్తాలు ఒంటిచేత్తో లేపగడు
బురద పొలాల్లో అంగలు వేయగడు
మొద్దుల్ని బాహుబళిలా మోయగలడు
సంసార భారీ భారాన్ని భరించగలడు !
అతని హస్తం మన్నుకు నేస్తం
మండుటెండలో శ్రమాగ్ని కణం
జడివానలోనూ తడబడని ధైర్యం
చలినే వణికించగల ఉక్కు కండరం !
బాధల్ని నవ్వు పరదాలతో కప్పి..
బాధ్యతల్ని నిర్భీతితో సంకనెత్తుకొని..
చేమటతో సేద్యం చేయగల ధీరుడు
ఒంటెద్దు ఎగుసంలో మరో ఎద్దు కాగడు !
మన్ను మర్మమెరిగిన ఘనుడు
చేనుతో ముచ్చటించగల నిపుణుడు
పాల కంకితో ఊసులాడగల యోధుడు
మబ్బుల్నే చదువగల నిరక్షరాస్యుడు !
చేనును ముద్దాడిన చేతులు
అదృష్ట రేఖలే అరిగిన జీవులు
కరువు కాటేసినా బెదరని బడుగులు
ఆకలే అలవాటైన అన్నదాతలు !
సాగుబడితో కర్షకుడే నేలపై నేచిన..
హరితవస్త్రాలేగా భూమాత దుస్తులు
తన చెమట చమురేగా జాతికి వెలుగులు
కర్షకుడు కుదేలైతే జాతి ఆర్థికం చితుకు !
రైతన్న కోపాలే జాతికి పెనుశాపాలు
ఆయన దీవెనలే బంతి భోజనాలు
తను అలిగితే కడుపులన్నీ మాడు
రైతు లేని జాతి వెన్నెముకే విరుగు !

విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగరం – 9949700037