Take a fresh look at your lifestyle.

శివోహం..!

  • శివ నామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు
  • భక్తులతో పొటెత్తిన ఆలయాలు
  • దుర్గా భవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్‌రావు
  • స్వరాష్ట్రంలోనే ఏడుపాయల అభివృద్ధి: మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, మార్చి 11 (ప్రజాతంత్ర బ్యూరో): మహా శివరాత్రి సందర్భంగా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణంతో మారుమోగాయి. భక్తులతో ఆలయాలు పోటెత్తాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకని గురువారం వేకువ జాము నుంచి భక్తులు శైవ క్షేత్రాల వద్దకు బారులు తీరారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అన్ని ఆలయాల వద్ద శివరాత్రి సందడి నెలకొంది. కొమురవెళ్లి, పొట్లపల్లి, సిద్ధిపేటలోని శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వరస్వామి ఆలయం, నారాయణరావుపేట సమీపంలోని బుగ్గరాజేశ్వరస్వామి టెంపుల్‌, ‌మెదక్‌లోని ఏడుపాయల వన దర్గమ్మ ఆలయం, నంగునూరు మండలంలోని రాంపూర్‌ ‌స్పటిక లింగం, తొగుట మండలంలోని రాంపూర్‌లోని స్పటికలింగేశ్వర ఆలయాలు భ••క్తులతో కిటకిటలాడింది. ఏడుపాయల వద్ద మంజీర నదీలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మహా శివారాత్రిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉపవాస దీక్షలలో పాల్గొన్నారు.

దుర్గ భవాని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్‌రావు…
మహా శివరాత్రి సందర్భంగా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చిలుముల మదన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. స్వరాష్ట్రంలోనే ఏడుపాయల అభివృద్ధి చెందిందనీ, జాతర కోసం సింగూరు నుంచి 0.35 టిఎంసిల నీళ్లను విడుదల చేశామనీ, పోతం శెట్టిపల్లి నుంచి 36 కోట్ల రూపాయలతో 100 ఫీట్ల రోడ్డును అందుబాటులోకి తెస్తామన్నారు. ఏడుపాయలో పోలీస్‌ అవుట్‌ ‌పోస్ట్, ఏటిఎంను ఏర్పాటు చేమనీ, రూర్బన్‌ ‌పథకం నుంచి ఏడుపాయలో కన్వెన్షన్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దుర్గా భవాని అమ్మవారి దయతో ఈప్రాంతమంతా సుభిక్షమవుతుందనీ, కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. కోటి ఎకరాలలో పంటలు సాగవుతాయనీ, దేశంలోనే కోటి ఎకరాలు సాగు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. సిఎం కేసీఆర్‌ ‌కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, ‌స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

దేదీప్యమానం…శైవ క్షేత్రాలు..
కిక్కిరిసిన వన దుర్గామాత ఆలయం
మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో ఉన్న శివాలయాలతో పాటు మిగతా ఆలయాలు కూడా దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ముఖ్యంగా ప్రకృతి అందాలకు నెలవైన ఏడుపాయల వనదుర్గమ్మ దేవాయలం మహా శివరాత్రిని పురస్కరించుకుని సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయం మండపాన్ని రంగులతో, రంగు రంగుల విద్యుత్‌ ‌దీపాలతో చూడముచ్చటగా ముస్తాబు చేశారు. మంజీర నదీ తీరాన రాతి గుట్టల మధ్యన ఈ ఆలయం దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతుంది. మహా శివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని వేకువ జామున 4గంటలకు వన దుర్గామాతకు పంచామృత అభిషేకం, అలంకారం, సహస్ర కుంకుమార్చనతో జాతర ప్రారంభమైంది. అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం మొదలైంది. మహా శివరాత్రి సందర్భంగా మంజీర నదీ తీరాన వెలిసిన ఏడుపాయల వన దుర్గా మాత ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. నాడు గీకారణ్యంగా ఉన్న ఏడుపాయల భక్తులతో జనారణ్యంగా మారింది. జాతరకు పెద్దయెత్తున భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. సుమారు 50సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు.

సిద్దిపేట శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర ఆలయంలో..
మహా శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్ధిపేటలోని శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం నుంచి వేలా సంఖ్యలో భక్తులు కోటిలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply