డిప్యూటీ మేయర్‌గా ఆలీ మహమ్మద్ ఇక్బాల్
పోటీనుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు
ఆప్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక
అభినందనలు తెలిపిన సిఎం కేజ్రీవాల్
న్యూ దిల్లీ, ఏప్రిల్ 26 : దిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్‌గా తిరిగి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు తగినంత బలం లేకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. ఇక డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యింది. ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంసీడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికలో వీరు ఏకగ్రీవం అయ్యారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి షిఖా రాయ్ బుధవారంనాడు తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక నుంచి కూడా బీజేపీ తప్పుకుంది. ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్, మహమ్మద్ ఇక్బాల్‌లను సీఎం అరవింద్ కేజ్రివాల్ అభినందించారు. ప్రజలకు ఆప్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయని, వారి అంచనాలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేద్దామంటూ కేజీవ్రాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక రొటేషనల్ పద్ధతిలో ఐదు సింగిల్ ఇయర్స్ టర్మ్‌తో ఉంటుంది.
తొలి సంవత్సరం మహిళలకు రిజర్వ్ చేయగా, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరిగా, మూడు సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరిగా, తక్కిన రెండేళ్లు ఓపెన్ కేటగిరిగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత సిటీకి కొత్త మేయర్ వస్తారు. డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు జరగగా, ఆప్ అత్యధిక సీట్లు దక్కించుకుంది. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 134 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జెండా ఎగురవేశారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. మేయర్ ఎన్నికలో షెల్లీ ఒబెరాయ్, షిఖారాయ్ మధ్య ముఖాముఖీ పోటీ ఉంటుందని అందరూ అంచనా వేసినప్పటికీ బీజేపీ నామినేషన్ ఉపసంహరించు కోవడంతో మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
ఒబెరాయ్ ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్‌గా నాలుగో ప్రయత్నంలో ఎన్నికయ్యారు. దీనికి ముందు మూడు సమావేశాల్లో ఆప్, బీజేపీ మధ్య గందరగోళం తలెత్తింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కుల వ్యవహారంపై గొడవ జరగడంతో మూడుసార్లు వాయిదా పడి నాలుగోసారి ఎన్నిక జరిగింది. బీజేపీకి చెందిన రేఖా ఖప్తాను షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో ఓడించారు. మొత్తం పోలైన 266 ఓట్లలో రేఖా గుప్తా 116 ఓట్లు సాధించారు. గత ఏడాది డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు జరగగా, ఆప్ విజయకేతనం ఎగురవేసింది.