Take a fresh look at your lifestyle.

ప్రజాకళాకారుడు… బుర్రకథా పితామహుడు షేక్‌ ‌నాజర్‌

“ఆయన ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా పక్రియకు విస్తృత ప్రచారం కల్పించారు. దీంతో ఆ బుర్రకథా పితామహుడుగా, గొప్పనటుడుగా, ప్రజారచయితగా, మహాగాయకుడుగా వెలుగులోకి వచ్చిన ఆయనను ప్రజలు సన్మానించడానికి ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఆయన మాత్రం ఎన్నడూ ఒప్పలేదు. ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు’’ అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేస్తానని చెప్పేవారు.తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్‌ ‌కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది.
నేడు నాజర్‌ ‌వర్ధంతి”

ఆయన జనం మెచ్చిన కళాకారుడు. జనం భాషలో పాడాడు. జనం కోసం పాడాడు. ఆ జనాన్ని తన కథలతో ఆకట్టుకున్నాడు. ‘వినరా భారత వీర కుమారా విజయం మనదేరా’ అంటూ పాడుతూ ప్రజలను చైతన్య పరిచేవారు. అతను పాడే ‘ఏరన్న రాకమునుపె ఎరువాక వచ్చెరన్న’ పాట విని జనం ఊగిపోయేవారు. తన కథలతో ఎంతో మంది జనాల మనసులో స్థానం సంపాదించుకున్నారు. హరికథ అనగానే జముకుల పాట అంటే సుబ్బారావు పాణిగ్రాహి, ఆదిభట్ల నారాయణదాసు గుర్తుకొచ్చినట్లు బురక్రథ అనగానే తెలుగువారికి స్మరించదగ్గ మహనీయ కళాకారుడు ఒకరు గుర్తొస్తారు. ఆయనే ‘బుర్రకథ పితామహుడు’ షేక్‌ ‌నాజర్‌. ‌తెలుగు నాట జానపద, వినోద గాన పక్రియ బుర్రకథను ఆయన తనదైన శైలిలో తెరకెక్కించారు. తెలుగు వారి సాంస్కృతిక జీవనంలో ప్రముఖ స్థానం వహించిన బుర్రకథతో అందరి మనసునూ దోచుకున్నాడు.

ఆయన బుర్రకథకు గొప్ప గౌరవం కల్పించారు. పదహారణాల ప్రజా కళగా తీర్చిదిద్దారు. రాజు కథలు, రాజ్యమేలుతున్న రోజుల్లో మధ్యతరగతి, అట్టడుగు వర్గాల కష్ట సుఖాలను, పురాణ గాథలను హృద్యంగా వినిపించేవారు. తెలుగు నాట విశేష ప్రచారంలో ఉన్న భజన పాటలు, కోలాటం, బిచ్చగాళ్ళ పాటలు, వీధి భాగవతుల గాన శైలి, జక్కుల వరసలు పరిశీలించి ఒక నవీన మార్గం ఏర్పరచి పాటలు, పద్యాలు పాడేవారు. జానపద సాహిత్యాన్ని, బాణీలను అవగతం చేసుకున్నారు. సమాజంలో ప్రబోధాలు చేయాలన్నా, ప్రచారాలు చేయాలన్నా ఈయన బుర్రకథనే సాధనంగా తీసుకునేవారు.

షేక్‌ ‌నాజర్‌ ‌గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న బీబాబ్‌, ‌షేక్‌ ‌మస్తాన్‌ ‌దంపతులకు జన్మించారు. నాజర్‌కు బాల్యంలో చదువుపై శ్రద్ధ ఉండకపోయేది. ఎక్కాలు, లెక్కలు కూడా ఎంత చదివినా గుర్తుండేవి కావంట కానీ, పాటలన్నా, రాగసాయలన్నా ఎంతో శ్రద్ధ ఉండేది. దీంతో ఆయన వాటిని ఒక్కసారి వింటే చాలు అలాగే గుర్తుంచుకునేవారు. దీంతో ఆ ప్రాంతంలో చెక్క భజనలో గొప్ప కళాకారుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళగిరిలో మురుగుళ్ల సీతారామయ్య వద్ద హార్మోనియం నేర్చుకున్నారు. ముట్లూరు కోటవీరయ్య అనే హరికథా భాగవతార్‌ ‌వద్ద శాస్త్రీయ రాగాలు అభ్యసించారు. మొదట్లో నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించారు. ‘కృష్ణలీల’లో ‘దేవకి’, ‘భక్త రామదాసు’లో ‘ఛాందిని’ వంటి పాత్రలు ధరించారు. అంతే కాదు పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి, శ్రీకృష్ణరాయబారంలో రుక్మిణి పాత్రలు వేశారు. పాఠశాలలో ఉన్న సమయంలో ‘‘ద్రోణ’’ పాత్ర పోషించడంతో ప్రముఖ హార్మోనిస్టు ఖాదర్‌ ఆయనను ప్రశంసించారు. అంతే కాదు ఆయన ‘బాల మహ్మదీయ సభ’ పేరిట వీధినాటకాలు ఆడి మంచిపేరు గడించారు. అనంతరం తమ జీవనోపాధి కోసం ఆ కళాకారుడు దర్జీగా మారారు. దాంతో పాటుగానే ఆ గ్రామ పెద్ద కొమ్మినేని బసవయ్య పిల్లలకు సంగీతం నేర్పుతూ, నాటకాలు ఆడిస్తూ సంగీత గురువయ్యారు. ఇలా కొంత కాలం గడిచిన తరువాత ఆయన నాటకాలను చూసిన కొండపనేని బలరామ్‌, ‌వేములపల్లి శ్రీకృష్ణ ఆయనను గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్పితే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. దీంతో ఆయన జీవితాన్ని మలుపు తిరిగింది. ఆయన ప్రోత్సాహంతో బుర్రకథ దళం ఏర్పడింది. రామకోటి కథకుడు, నాజర్‌ ‌హాస్యం, పురుషోత్తం రాజకీయ వంతలుగా కథ చెప్పారు. ఆ తరవాత నాజర్‌ ‌కథకుడయ్యారు. నాజర్‌ ‌కథకుడిగా మొదటి బుర్రకథ ‘వీరనారి టాన్యా’ తాడికొండలో జరిగింది.

- Advertisement -

తరువాత ఆయన ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా పక్రియకు విస్తృత ప్రచారం కల్పించారు. దీంతో ఆ బుర్రకథా పితామహుడుగా, గొప్పనటుడుగా, ప్రజారచయితగా, మహాగాయకుడుగా వెలుగులోకి వచ్చిన ఆయనను ప్రజలు సన్మానించడానికి ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఆయన మాత్రం ఎన్నడూ ఒప్పలేదు. ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు’’ అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేస్తానని చెప్పేవారు.తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్‌ ‌కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతం మీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్‌ ‌కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. ‘అసామి ‘ అనే నాటకం రాసి ప్రదర్శనలిచ్చాడు. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్‌ ‌జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన పింజారీ అనే పుస్తకంగా ప్రచురించాడు. పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు. కొంతకాలం విరసం సభ్యుడు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో నాజర్‌ అనేక సార్లు జైలుశిక్ష అనుభవించారు.

ఆయన ‘ఆసామి’ నాటక రచనకు 18వ ఆంధ్ర నాటక పరిషత్‌ ‌ప్రథమ బహుమతి పొందారు. దీంతో ప్రముఖ పాత్రికేయుడు కె.ఎ.అబ్బాస్‌ ‌నాజర్‌ను ‘ఆంధ్రా అమర్‌ ‌షేక్‌’ అని అభివర్ణించారు. 1981వ సంవత్సరంలో ఆంధ్ర నాటక కళాపరిషత్‌ అం‌దించిన ఉత్తమ కళాకారుడి పురస్కారం అందుకున్నారు. 1986లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది. 1997 ఫిబ్రవరి 22 తేది ఆయన 77ఏళ్ల వయస్సులో అంగలూరులో ఆయన తుది శ్వాస విడిచారు.  ఆయన తెలుగు జాతి సంస్కృతిక చరిత్రలో చిరస్మరణీయుడు.ఆయన చేసిన అనేక సేవాకార్యక్రమాలు యావత్‌ ‌తెలుగు జాతికే కాకుండా యావత్‌ ‌భారతదేశానికి బుర్ర కథ ద్వారా విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి.

– నరేష్‌ ‌జాటోత్‌.  ఎంఏ.,‌బిఈడి.,
కాకతీయ విశ్వవిద్యాలయం
8247887267

Leave a Reply