- సిఎం కెసిఆర్ నిర్ణయంతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ…బాధ్యతల స్వీకరణ
- ప్రభుత్వ పథకాలను సమర్థంగా ముందుకు తీసుకువెళతా : సిఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి సిఎం కెసిఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి గతంలో సీఎంవోలో కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్‌గా మహిళ శాంతికుమారికి అవకాశం దక్కింది. శాంతికుమారి 2025 ఏప్రిల్ వరకూ పదవిలో ఉండేందుకు అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైపే మొగ్గు చూపింది. గతంలో.. శాంతి కుమారి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆయన ఆంధప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని మంగళవారం హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలోని సివిల్ సర్వెంట్ల విభజన వివాదానికి ఈ తీర్పు ద్వారా ముగింపు పలికింది. ఉమ్మడి ఆంధప్రదేశ్ క్యాడర్ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సోమేశ్ కుమార్ 2014లో సెంట్రల్ అడ్మినిస్టేట్రివ్ ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. దీనిని హైకోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వ పథకాలను సమర్థంగా ముందుకు తీసుకువెళతా : సిఎస్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయని, వాటిని మరింత సమర్థంగా ముందుకు తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తానని కొత్త సిఎస్‌గా బాద్యతలు చేపట్టిన శాంతికుమారి అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్‌కు సీఎస్ శాంతి కుమారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తొలి మహిళా సీఎస్‌గా బాధ్యతల స్వీకరణ సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్లాగ్ షిప్ కార్యక్రమాలతో పాటు అన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో సహచర అధికారులతో సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయడానికి కృషిచేస్తాను అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి కుమారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.