Take a fresh look at your lifestyle.

శంకర్‌ గుహ నియోగి

ఒక సమస్య పారిశ్రామిక వివాదం అవుతుందా కాదా, ఆ సమస్య పరిష్కారానికి అధికారం ఎవరికి ఉంది అనే చిన్న చిన్న సమస్యల మీద ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయాయి. సంఘటిత కార్మిక సంఘాల మద్దతు లేని స్థితిలో,నియోగి మహాశక్తివంతులైన యజమానులతో ఒంటరి పోరాటం చేశాడు.

ప్రజల మీద, ప్రజానాయకుల మీద, ఉద్యమకారుల మీద జరిగే దౌర్జన్యాలను, నేరాలను, అత్యాచారాలను సక్రమంగా పరిశోధించడంగాని, న్యాయస్థానాలలో సరిగా విచారణ జరపడంగాని, నేరస్తులకు తగిన శిక్షలు విధించడంగాని జరగదని  మొ­త్తంగా ఒక అభిప్రాయం ఉంది. అది నిజమే కూడా. కాని ప్రతి సూత్రానికీ ఒక మినహాయింపు ఉన్నట్టుగానే, ఈ అభిప్రాయానికి కూడా ఒక మినహాయింపు ఉంది. అది శంకర్‌ గుహ నియోగి హత్యకేసు, ఆ కేసులో నేను ప్రాసిక్యూషన్‌ తరఫున వాదించాను గనుక ఆ కేసు గురించి కొంచెం వివరంగా చెప్పుకోవాలి. చత్తీస్‌ఘర్‌ శ­క్తి మోర్చా అప్పటి ప్రధాన మంత్రి ఐకె గుజ్రాల్‌కు ఒక విజ్ఞప్తి చేసింది. సీనియర్‌ న్యాయవాదిగా, ప్రాసిక్యూషన్‌ తరఫున వాదించడానికి కె.జి. కన్నబిరాన్‌ను నియమించండి అని. నేను అటువైపు నుంచి వాదించిన కేసు అది ఒక్కటే.

చత్తీస్‌ఘర్‌ మైన్స్‌ శ్రామిక్‌ సంఘ్  నాయకుడు శంకర్‌ గుహ నియోగిని అక్కడి పరిశ్రమల, వ్యాపార సంస్థల యజమానులు హత్య చేయించారు. కిరాయి హంతకులను ఏర్పాటు చేసి ఆ హత్య చేయించారు. ఆ హత్యకేసును పోలీసులు సరిగానే పరిశోధించారు. కింది కోర్టు యజమానులకు యావజ్జీవ శిక్ష విధించింది. కిరాయి ­ హంతుకుడు పల్టన్‌ మల్లాకు మరణశిక్ష విధించింది. ఆ విచారణ జరిగినంత కాలం న్యాయవాది నందితా హక్సర్‌ ఆ విచారణ వాయిదా  పడకుండా, అనవసర వివాదాలు రేకెత్తి పక్కదారి పట్టకుండా కాపలా కాశారు. చివరికి సిబిఐ కూడా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఒక మంచి ప్రాసిక్యూటర్‌ వాదనలు జరిపేలా, సాక్షులందరూ సాక్ష్యం చెప్పేలా చూసింది. ఆశ్చర్యకరంగా సాక్షులందరూ కూడా తాము  అంతకు మందు పోలీసులకు ఏమిచెప్పారో పొల్లుపోకుండా తిరిగి అదే చెప్పారు. ఈ మొత్తం క్రమంవల్ల నేరస్తులకు శిక్షలు పడడం సులభమైంది.

బహుశా మన దేశంలోని కార్మిక ఉద్యమాల చరిత్ర మొత్తంలో ఒక కార్మిక నాయకుడిని హత్య చేయించినందుకు యజమానులకు శిక్ష పడిన సందర్భం ఇది ఒక్కటేననుకుంటాను.
శంకర్‌ నియోగి హత్య జరగడానికి చాలా ముందు నుంచీ చాలా కాలంగా నాకు తెలుసు. ఆయన నన్ను ఒకసారి చత్తీస్‌ఘర్‌ పార్లమెంటు నియోజక వర్గానికి పోటీచేయమని కూడా అడిగాడు. నేను నిరాకరించాను. ఆయన చాలా మృదుస్వభావి, స్నేహశీలి. చాలా మంచి కార్యకర్త. ఒక ఆదివాసి యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అప్పుడు చత్తీస్‌ఘర్‌ మధ్యప్రదేశ్‌లో భాగంగా ఉండేది గదా. అర్జున్‌సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో అక్కడి కార్మికులందరిచేతా, నియోగి మద్యపానానికి వ్యతిరేకంగా ప్రమాణం చేయించాడు . అక్కడ సంపూర్ణంగా మద్యనిషేధం అమలైంది. కార్మికులు తమంత తామే స్వచ్ఛందంగా తమలో ఎవరైనా తాగితే జరిమానాలు విధించడం ప్రారంభించారు. దానితో అక్కడి ఎక్సైజ్‌ కాంట్రాక్టర్ల వ్యాపారం నిలిచిపోయింది . ప్రతి రాష్ట్రంలోనూ ఎక్సైజ్‌ కాంట్రాక్టర్లదే రాజ్యం గదా. అందువల్ల ఆ కాంట్రాక్టర్లు నియోగిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయించారు. మన ప్రభుత్వాలు అటువంటివి.

నియోగి మన దేశ కార్మికోద్యమ చరిత్రలో కొన్ని విశిష్టమైన సంప్రదాయాలు ప్రవేశపెట్టాడు. మన ట్రేడ్‌ యూనియన్లకు సాధారణంగా సంఘటితంగా కార్మికులను సమీకరించడం.. వారికి నాయకత్వం వహించడం మీద ఉన్న శ్రద్ధ అసంఘటిత రంగ కార్మికుల మీద ఉండదు.కాని నియోగి మొదటి నుంచీ కూడా అసంఘటిత రంగ కార్మికుల మీద  కేంద్రీకరించి పని చేశాడు. నిజానికి అప్పటికే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలోనూ అసంఘటిత కార్మికులున్నారు. కాంట్రాక్టు, కాజువల్‌, తాత్కాలిక కార్మికులుగా వాళ్లు పని చేస్తుండేవారు. వారిని సంఘటిత పరచాలని, వారి సమస్యల పరిష్కారం కొరకు పోరాడాలని మన పెద్ద ట్రేడ్‌ యూనియన్లు ఎప్పుడూ ఆలోచించలేదు. మన జాతీయ ట్రేడ్‌ యూనియన్లన్నీ కూడా పర్మినెంట్‌, రెగ్యులర్‌ కార్మికుల సమస్యల మీదనే పనిచేస్తూ వచ్చాం­. ఆ తప్పుడు పద్ధతిని వ్యతిరేకిస్తూ, శంకర్‌ గుహనియోగి దల్లి -` రాజ్‌ హరా ఇనుప ఖనిజం గనుల ప్రాంతంలో అసంఘటిత రంగ కార్మికులను సమీకరించాడు. వారి కోసం ఒక కార్మిక సంఘం స్థాపించాడు. వారి సమస్యలపై వారి పని పరిస్థితుల మెరుగుదల కోసం పోరాటాలు ప్రారంభించాడు. ఆయన సాగించిన కార్మికోద్యమ, సాంఘికోద్యమ కృషి వల్ల ఆయన అక్కడి పెత్తందార్లకు కంటిలో నలుసు గా మారాడు. అక్కడి పరిశ్రమల యజమానులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పోలీసులు ఆయనను అంతం చేయదలచుకున్నారు.

సింప్లెక్స్‌ గ్రూప్‌ అనే పారిశ్రామిక సంస్థల యజమానులైన షా లు ఆ ప్రాంతంలో కార్పొరేట్‌ పులులుగా మాఫియా సాయంతో, గూండాల సాయంతో నడుపు కొస్తున్నారు.వాళ్లు పల్టన్‌ మల్లా అనే కిరాయి  హంతకుడికి నియోగిని చంపే పని అప్పగించారు. అప్పటికి ఎన్నో రోజుల నుంచీ వాళ్లు ఆయనను బదనాం చేయడానికి, అక్కడి కార్మికులలో ఆయన పరపతి తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కరపత్రాలు వేశారు. ఆయన మీద కేసులు పెట్టించారు. ఆయన నక్సలైట్‌ అని ఫిర్యాదు చేశారు. అవన్నీ విఫలమైన తర్వాత ఇక ఆయనను భౌతికంగా నిర్మూలించాలనుకున్నారు. ఒక రాత్రి ఆయన నిద్రిస్తుండగా ఆయన మీద దాడి చేసి చంపేశారు.

ఆయన మీద ఎన్నో చోట్ల ఎన్నో కేసులు పెట్టారు. వాటి విచారణ కోసం ఆయన ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు తిరుగుతూ ఉండవలసి వచ్చేది. ఒక చోట పారిశ్రామిక వివాదాల ట్రిబ్యునల్‌, మరో చోట కోర్టు… ఇలా ఆయన తిరుగుతూ ఉండేవారు. నిజానికి అక్కడ అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు చాలా చిన్నవి. వారి జీతభత్యాలు గాని, పని పరిస్థితులుగాని, వారికి సౌకర్యాలు గాని పెద్ద విషయాలు కావు. ఆ సమస్యలన్నిటినీ ప్రజాస్వామికంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించడం సాధ్యమే. కాని యాజమాన్యాలు ఆ సమస్యలకు సులభ పరిష్కారం వెతికే బదులు, కార్మికులను బెదిరించి, లొంగదీసి, బానిసల్లా పని చేయించుకోవాలి, వారికి నాయకత్వం వహిస్తున్న నియోగిని వేధించి అక్కడి నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేశాయి ­. అందుకే  పనికిరాని చిల్లర మల్లర వివాదాలలో ఆయనను పదేపదే కోర్టులకు ఈడ్చేవి. ఒక సమస్య పారిశ్రామిక వివాదం అవుతుందా కాదా, ఆ సమస్య పరిష్కారానికి అధికారం ఎవరికి ఉంది అనే చిన్న చిన్న సమస్యల మీద ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయాయి. సంఘటిత కార్మిక సంఘాల మద్దతు లేని స్థితిలో,నియోగి మహాశక్తివంతులైన యజమానులతో ఒంటరి పోరాటం చేశాడు.

ఆ క్రమంలో ఆయనను హత్య చేయించడానికి యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయని అర్థమైన తర్వాత, నియోగి తన భద్రత గురించి స్వయంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి దిల్లీికి వచ్చాడు. ఆ సమయంలో నేను దిల్లీిలోనే ఉన్నాను. ఆయనను కలిశాను. చత్తీస్‌ఘర్‌లో తనకు రక్షణ ఎట్లా కరువైపోయిందో  ఆయన నాకు వివరించాడు.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply