Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిద్దామా, విమర్శిద్దామా..?

‘‘ఏమైనా ప్రపంచ ఇర్రిగేషన్‌ ‌ప్రాజెక్టుల చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ‘ఇంజనీరింగ్‌ ‌మార్వెల్‌’ అని కొనియాడబడుతుంది. ఇలాంటి భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో శాస్త్ర సాంకేతిక నిపుణుల లోతైన సలహాలను తీసుకుంటూ రాష్ట్ర ఖజానాపై అధిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలు, పాలకులు తీసుకొని ఉండాల్సింది.’’

కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు Kaleswaram Lift Irrigation Project, KALIP (కాళేశ్వరం లిఫ్ట్ ఇ‌ర్రిగేషన్‌ ‌ప్రాజెక్టు, కెయల్‌ఐపి) తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం తొందరపడిందని, దాని ప్రయోజనం కన్న ఆర్థిక భారమే రాష్ట్రానికి మోయలేని బరువు అవుతుందని, ఇటీవల వరదల్లో ప్రాజెక్టు పంపులు మునిగిన నేపథ్యంలో లక్షల కోట్ల ధనాన్ని నీటిలో పోసినట్లు అయ్యిందని విమర్శలు సర్వసాధారణమాయ్యాయి. గతంలో ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని ఎత్తి పోస్తూ గ్రామగ్రామాన చెరువులు కుంటలు నింపడంతో ప్రజలు, నిపుణులు ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమైందని, ప్రపంచంలోనే ఒక విలక్షణ ప్రాజెక్టు అని కొనియాడడం, ప్రాజెక్టును దర్శించి ఆశ్చర్యానికి, ఆనందానికి గురికావడం చూసాం.
పలు ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రశంసించడమే కాకుండా ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు కోట్ల రూపాయల రుణాలను ఇవ్వడం జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకాకిని చేసి విఫల ప్రాజెక్టును రూపొందించిందంటూ ముప్పేట దాడి చేయడం సమంజసంగా కనిపించడం లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన అప్పులకు ఏడాదికి 8.25 నుంచి 10.9 శాతం వరకు భారీ వడ్డీలను చెల్లించాల్సి వస్తున్నదని వాపోవడం సమంజసంగానే కనిపిస్తున్నది. డిపిఆర్‌(‌డీటేయిల్లేడ్‌ ‌ప్రాజెక్టు రిపోర్ట్) ‌లేకుండా, నిపుణుల సలహాలను పెడచెవిన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, నీటిని పలు దశల్లో ఎత్తి పోయడానికి విద్యుత్తు ఖర్చులు భారీగా ఉంటాయని, దీర్ఘకాలికంగా దీని నీటిని సాగుకు వినియోగించడం ఆర్థికంగా సాధ్యపడక పోవచ్చనే మాటలు వింటున్నాం. తొలి దశలో 40 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయం 1.4 లక్షల కోట్లకు ఎగబాకిందని వింటున్నాం. ఇటీవల కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు చట్టపరమైన అనుమతులు లేవని, ప్రాజెక్టు డిజైన్‌లో నిపుణుల సలహాలు తీసుకోలేదని, దీనిలోని లోపాల మూలంగా ఇటీవలి భారీ వర్షాలకు మునిగి పోయిందని విమర్శించడం తెలిసిందే.
ప్రారంభం నుండి పలు వివాదాలను ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి వెచ్చించిన భారీ పెట్టుబడులకు, పరిమిత ప్రయోజనాలకు మధ్య అనంత అంతరం ఉందనే మాటలను వింటున్నాం. 2014కు పూర్వం నాటి కాంగ్రేస్‌ ‌ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్టు’ ప్రణాళికలు మార్చి నేటి టిఆర్‌యస్‌ ‌ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పథక రచన చేసి అతి తక్కువ కాలంలో అత్యధిక పెట్టుబడులతో దాదాపు పూర్తి చేసింది. నేటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రుణాలు తీసుకోవడానికి ‘‘కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు కార్పొరేషన్‌’’ ఏర్పాటు చేయడంతో ఈ రుణాలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ‌పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ‘‘డిస్కవరీ చాలెన్‌’’‌లో కూడా డాక్యుమెంటరీ ప్రసారం కావడం చూసాం. ప్రాజెక్టు దర్శనానికి నిపుణులు, ఉన్నతాధికారులు, పౌర సమాజం క్యూ కట్టడం, మెచ్చుకోవడం గత చరిత్రగా మిగిలిపోయింది. ఒక దశలో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నాటి గవర్నర్‌ ‌నరసింహన్‌తో పాటు మహారాష్ట్ర బిజేపి ముఖ్యమంత్రి కూడా హాజరై ప్రశంసించడం జరిగింది.
‘‘సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌’’ (‌సిడ బ్ల్యూసి)కు చెందిన ఉన్నతాధికారులు జనవరి 2018లో ఈ ప్రాజెక్టును దర్శించి ఇదో మానవ నిర్మిత ప్రత్యేక ప్రాజెక్టు అంటూనే ‘ఇంజనీరింగ్‌ అద్భుతం (ఇంజనీరింగ్‌ ‌మార్వెల్‌)’ అని ప్రశంసించడం విన్నాం. సిడబ్ల్యూసి శాఖ ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన 9 అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఆర్థిక సంస్థ నాబార్డ్ అధికారులు కూడా ప్రాజెక్టును చూసి ఈ ప్రాంత రైతులకు వరప్రదాయని అవుతుందని, తెలంగాణ ప్రాంతం కోనసీమలా మారిందని ప్రశంసించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 15 దశల్లో 6 ఆర్థిక సంస్థలు రూ: 97,449.16 కోట్ల రుణాలు అందజేశా యని సమాచార హక్కు చట్టం ప్రయోగించి సేకరించిన వివరాలు తెలుపుతున్నాయి. వీటిలో పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంక్‌ ‌నుంచి రూ. 11,400 కోట్లు, యూనియన్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా నుంచి రూ. 7,400 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా నుంచి రూ. 2,150 కోట్లు, రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌ ‌నుంచి రూ. 30,536 కోట్లు, పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌నుంచి రూ. 37,737 కోట్లు, నాబార్డ్ ‌నుంచి రూ. 8,225 కోట్లు రుణాలుగా తీసుకోవడం జరిగింది. ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌బ్యాంకులు కల్పించడం విశేషంగా గమనించాలి. ఈ రుణాలకు సాలీనా 8.25-10.9 శాతం వడ్డీలను చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణానికి భారీ వడ్డీలను సాలీనా చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి. ఈ రుణాలకు వడ్డీల రూపంలో ప్రతి ఏట రూ. 13,000 కోట్లను రాబోయే 13 ఏండ్ల పాటు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని, మొత్తంగా రూ: 71,575 కోట్లను వడ్డీలుగా మాత్రమే చెల్లిస్తూ, రుణ విముక్తం కావడానికి రూ. 1,69,023 కోట్లను తెలంగాణ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని అంటున్నారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు తోడకపోయినా ఈ రుణాలు చెల్లించడం తప్పనిసరి కానుందని, ప్రాజెక్టును వినియోగిస్తే వచ్చే విద్యుత్తు ఖర్చులు, మెయింటెనెన్స్ ‌భారం కూడా భారీగానే పడుతుందని గమనించాలి.
ఇక కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తి పోయడానికి 13,558 మిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్తు అవసరమని, విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు 10,000-14,000 కోట్ల ఖర్చు సాలీనా అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు రిపోర్ట్ ‌ప్రకారం 18.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అంచనా వేసారు. సాధారణంగా ఒక టియంసీ నీటితో 6,000 ఎకరాల వరికి సాగు నీరు అందుతుందని, 10,000 ఎకరాల ఇతర ఆరుతడి పంటలకు నీరు అందుతుందని గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 144 టియంసీల నీటితో 10 లక్షల ఎకరాలకు వరి/ఇతర పంట పొలాలకు మాత్రమే సాగు నీరు అందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాల ప్రకారం ప్రతి ఎకరా సాగుకు రూ: 2.5 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. ఒకవేళ 18.2 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తే ప్రతి ఎకరాకు రూ: 1.37 లక్షల ఖర్చు అవుతుందని, విద్యుత్తుకు మాత్రమే ఎకరాకు రూ: 55,000 ఖర్చు వస్తుందని గమనించాలి.
కేంద్ర ప్రభుత్వ సంస్థల కొన్ని అనుమతులు, ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాలను పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ‘అతి పెద్ద పెట్టుబడులతో నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టు’గా చరిత్రలో నిలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవడానికి సాలీనా ప్రభుత్వానికి రూ. 25,000 కోట్ల ధనం అవసరం అవుతుంది. కేంద్ర జల మండలి అనుమతులు, ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాలు లేకుండా ఈ ప్రాజెక్టు వచ్చేది కాదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రహస్యంగా నిర్మించలేదు. ప్రాజెక్టు డిజైన్‌ ‌దశలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజనీరింగ్‌ ‌నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోలేదనే విమర్శలు నిజమైతే అది ప్రభుత్వ వైఫల్యంగా మాత్రమే భావించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం భారీ ఆర్థిక పతనమని, ప్రమాదకర సాంకేతిక లోపమని విమర్శించడం వింటున్నాం.
భారీ రుణాలను పొందిన ప్రభుత్వ సంస్థ ‘కాళేశ్వరం ఇర్రిగేషన్‌ ‌ప్రాజెక్టు కార్పొరేషన్‌’ ‌రుణాలను చెల్లించడంలో విఫలమై దివాలా తీసే స్థాయికి చేరితే తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం, రుణాలు ఇచ్చిన బ్యాంకులే బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. ఏది ఏమైనా ప్రపంచ ఇర్రిగేషన్‌ ‌ప్రాజెక్టుల చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ‘ఇంజనీరింగ్‌ ‌మార్వెల్‌’ అని కొనియాడబడుతుంది. ఇలాంటి భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో శాస్త్ర సాంకేతిక నిపుణుల లోతైన సలహాలను తీసుకుంటూ రాష్ట్ర ఖజానాపై అధిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలు, పాలకులు తీసుకొని ఉండాల్సింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల వరప్రదాయినిగా మారుతూ, తెలంగాణకు ‘‘రైస్‌ ‌బౌల్‌ ఆఫ్‌ ఇం‌డియా’’గా పేరు తేవాలని కోరుకుందాం.
image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 994970003

Leave a Reply