Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌కు ‘చెక్‌’ ‌పెడుతున్న ‘షా’

కేంద్రం ఆదేశం మేరకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా తన రెండు రోజుల పర్యటనను సద్వినియోగం చేసుకున్నారా అంటే అవుననే అనిపిస్తున్నది. కర్ణాటక తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టిని పెట్టిన భారతీయ జనతాపార్టీ గత కొంత కాలంగా విస్తృత కార్యకలాపాలను చేపట్టింది. నిత్యం అధికార పార్టీని నిలదీయడంతోపాటు, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పనులపై దృష్టిసారించి, వాటిని ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తున్నది. అందుకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ పాదయాత్రలు, సైకిల్‌ ‌యాత్రలను ఎంచుకుంది. పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమాలపై ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన అమిత్‌షా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర ప్రధాన నాయకత్వంతో విస్తృత చర్యలు చేపట్టారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కొనసాగిస్తున్న అప్రజాస్వామ్య చర్యలను ప్రతిఘటించడంలో రాష్ట్ర శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమాలను ఇలానే కొనసాగిస్తే తెలంగాణపైన కాషాయ జండా ఎగురవేయడం ఖాయమన్న తన నమ్మకాన్ని పార్టీ ముఖ్యనేతలముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర నాయకత్వం చేపట్టిన సైకిల్‌ ‌ర్యాలీపైన కూడా ఆయన సంతృప్తి చెందారు.

అయితే ఈ ర్యాలీని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరాన్ని పార్టీ వర్గాలకు నొక్కి చెప్పినట్లుగా తెలుస్తున్నది. రాష్ట్రంలో సుమారు పదివేల గ్రామాలుంటాయి. ఈ పదివేల గ్రామాలను సైకిల్‌ ‌ర్యాలీ ద్వారా చుట్టబెట్టాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలేమిటన్న విషయాన్ని అన్ని గ్రామాల ప్రజలకు సవిస్తరంగా వివరించాలన్నది ఆయన సూచన. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ ‌కుటుంబ పాలన, ప్రాజెక్టుల పేరున సాగిస్తున్న అవినీతి, అక్రమాలన్నిటినీ ప్రజలకు సోదాహరణగా వివరించాల్సిన అవసరాన్ని ఆయన వారికి గుర్తుచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌కు ఏమాత్రం మినహాయింపు లేదని చెప్పడం చూస్తుంటే ఈ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పకనే చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్‌ ‌తమకు పెద్ద పోటీదారు కాదన్నట్లుగా అది మునిగి పోతున్న నావేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించడంలో కాంగ్రెస్‌ ‌ప్రధాన పాత్రదారి. అందుకు జరుగుతున్న పరిణామాలకు కూడా ఆ పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఆయన పార్టీ వర్గాలతో అన్నట్లు తెలుస్తున్నది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో తమ పాత్రకూడా ఉందని, తమ మద్దతు లేకపోతే తెలంగాణ ఏర్పడేదేకాదని ఇంతకాలం చెబుతూ వస్తున్న బిజెపికి, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఏమాత్రం ఇష్టంలేదన్న విషయం దీనివల్ల  అర్థమవుతున్నది. ఈ విషయంలో రాష్ట్రశాఖ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే తాజాగా జరుగబోతున్న మునుగోడు ఉప ఎన్నికతోపాటు, రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుండే సమాయత్తం కావాల్సిందిగా ఆయన పార్టీ నేతలకు సూచించినట్లు స్పష్టమవుతున్నది. రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలు చూస్తుంటే మునుగోడు తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం తనకున్నట్లుగా అమిత్‌షా చెబుతున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల  పోలింగ్‌ ‌బూతులుండగా ఇప్పటి వరకు 25వేల పోలింగ్‌ ‌బూతులకు బిజెపి రాష్ట్ర నాయకత్వం  ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడంపట్ల కూడా ఆయన తన పార్టీ వర్గాలను అభినందించారు. ఈ పోలింగ్‌ ‌బూత్‌ ‌కమిటీలు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయని, ఇవి సమర్థవంతంగా పనిచేస్తే ఎన్నికల్లో గెలుపు ఖాయంటూనే, ఈ కమిటీలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు.

కాగా, గోలకొండపైన కాషాయ జండా ఎగురవేసే విషయంలో బిజెపి వేస్తున్న ఎత్తుగడలు అధికార పార్టీతోపాటు ఇతర ప్రతిపక్షాలను హడలగొడుతున్నాయి. తెలంగాణను వశం చేసుకునేందుకు సాక్షాత్తు కేంద్ర నాయకులే నడుం కట్టడంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి, పార్టీ ముఖ్యనేత హోదాలో అమిత్‌షా తరుచు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడల్లా ప్రజల్లో ఆద•రణ, గుర్తింపు ఉన్న వారిని బిజెపిలోకి చేర్చుకోవడం లేదా వారిని మచ్చికచేసుకునే పనిలో పడ్డారు. గత ఆగస్టులో హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షా ఎవరూ ఊహించని రీతిలో టాలివుడ్‌ ‌ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను భోజనానికి ఆహ్వానించి సుమారు అరగంట పాటు ఆయనతో ముచ్చటించారు. వీరిద్దరు కూడా తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరుగలేదని చెబుతున్నప్పటికీ  రెండు తెలుగురాష్ట్రాల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక పథకం ప్రకారమే ఎన్టీఆర్‌ను కలిశాడన్నది కాదనలేని నిజం. ఆలాగే  మీడియా దిగ్గజం రామోజీరావును కూడా ఆయన కలుసుకున్నారు. రామోజీరావు కూడా తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరుగలేదని చెప్పారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే మరో టాలివుడ్‌ ‌హీరో నితిన్‌ను కలుసుకున్నారు. తాజాగా ప్రముఖ బ్యాట్‌మింటన్‌ ‌కోచ్‌ ‌పుల్లెల గోపీచంద్‌తో భేటి కావడం, సీనియర్‌ ‌సినీనటుడు కృష్ణంరాజు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్షించడంతోపాటు మరో ప్రముఖ హీరో ప్రభాస్‌ను కలుసుకోవడం లాంటి చర్యలు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు, సెలబ్రెటీస్‌లను వాడుకోవాలన్న అమిత్‌షా ఆలోచనను స్పష్టం చేస్తున్నది. దానికి తగినట్లుగా ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకునేందుకు తాజా హైదరాబాద్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ జన్మదిన వేడుక కూడా ఇక్కడే జరుపడం కూడా ఒక ఎత్తుగడగానే భావించాల్సి ఉంది. ఈ సందర్భంగా దివ్యాంగులకు వాహనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటి హాస్టళ్ళలో టాయిలెట్‌లను శుభ్రపరిచే యంత్రాలను వితరణ చేయడంలాంటి మునుపెన్నడూ చేయని కార్యక్రమాలను చేపట్టడం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది సుస్పష్టం. తెలంగాణలో షా పర్యటించిన ప్రతీసారి పార్టీ పటిష్టకు ఒక్కో అడుగు ముందుకే వేస్తున్నాడన్నది స్పష్టమవుతున్నది.
– మండువ రవీందర్‌రావు

Leave a Reply