Take a fresh look at your lifestyle.

సత్వర న్యాయం జరుగకనే…

దేశం వివిధ రంగాల్లో అబివృద్ధి సాధిస్తున్నా, నైతిక విలువలు అంతకంతకూ పతనమవుతున్నాయి. అనాగరిక, ఆటవిక చర్యలతో దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నది. ఎన్ని చట్టాలు రూపొందించినా నేరాల రేటు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అత్యాచార ఘటనలు సమాజాన్ని తల దించుకునేట్లుగా చేస్తున్నాయి. పెద్ద, చిన్న తారతమ్యాలు లేవు. సోదరి, కూతురు అన్న వాయి వరుసలను కూడా మరిచిపోతున్నారు. అరవై ఏండ్ల వాడు అయిదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ముక్కు పచ్చలారని పిల్లలకు తండ్రిగా, తాతగా లాలించాల్సి ఉండగా, చాకెట్లు, బిస్కట్లు, ఆట బొమ్మల ఆశ చూపించి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2013లో దేశ వ్యాప్తంగా చిన్నా పెద్ద వాళ్ళమీద జరిగిన అత్యాచారాల సంఖ్య 95 వేలు. అదే 2019 చివరినాటికి లక్షా 45 వేలకు చేరుకుంది. అలానే 2021 వొచ్చేసరికి ఆ ఘటనలు రెండు లక్షలుగా నమోదు అయినట్లు తెలుస్తున్నది. అంటే దేశంలో అదికారం చేపట్టిన బిజెపి ప్రభుత్వం కూడా వీటిని అదుపులోకి చేయలేక పోయిందన్నది స్పష్టమవుతున్నది. ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం తెలంగాణలో కూడ 2018లో 606గా ఉన్న ఈ సంఖ్య మరుసటి సంవత్సరానికి అంటే 2019లో 823కు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో ఈ అత్యాచార ఘటనల నిరోధానికి ఎన్ని కొత్త చట్టాలను రూపొందించినా ఫలితం లేకుండా పోతున్నదన్నది స్పష్టమవుతున్నది. దేశంలో పెద్ద సంచలనాత్మకంగా మారిన నిర్భయ ఘటన అనంతరం పార్లమెంటు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టినా భయమన్నది లేకుండా పోయిందనడానికి హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటనే సాక్ష్యం. అయితే ఈ కేసులో మాత్రం సత్వరన్యాయం జరిగిందని ప్రజలు కొంతవరకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా, దీనివల్ల మానవ మృగాల్లో ఏమాత్రం మార్పు రాలేదనడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఓ దగ్గర అత్యాచార సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసి, గొంతునులిమి చంపిన మానవమృగాన్ని నడిబజారులో ఉరి తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని లక్షలాది గొంతుకలు ప్రశ్నిస్తున్నాయి.

దిశ కేసులో జరిగిన న్యాయాన్ని అన్ని అత్యాచార కేసుల్లో అమలు పర్చినప్పుడు కొంతైనా బాధిత కుటుంబాలకు ఊరట కలుగుతుందంటున్నారు. ఆ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నా శిక్ష వేయడంలో ఇంకెందుకు తాత్సారం చేస్తున్నట్లు అని వారు ప్రశ్నిస్తున్నారు. సమాజానికి చీడపురుగులైన ఇలాంటి వ్యక్తులను బతకనిస్తే సమాజమే చెడిపోతుందని, ప్రధానంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ప్రజా సంఘాలు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యాచారాలకు పాల్పడిన దాదాపు అన్ని కేసుల్లో కూడా నిందితులంతా మత్తు మందు సేవించి ఉన్నవారేనని అందుకు రాష్ట్రంలో మత్తుపానీయాలను ముందుగా నిషేధించాల్సిన అవసరాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. నేరం జరిగిన గంటల్లోనే వారిని శిక్షించలేక•పోవడం, ప్రాణహాని లాంటి శిక్షలు అన్ని అత్యాచార కేసుల్లో అమలు కాకపోవడం కారణంగా నేరాల సంఖ్య పెరుగుతుందన్న ఆరోపణ ఉంది. దానితో పాటు పేద ప్రజలకు ఒక న్యాయం, ధనికులకు ఒక న్యాయంగా పాలక పార్టీలు వ్యవహరిస్తున్న తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి.

రాష్ట్ర రాజధానిలో ఆరేళ్ళ బాలకపై అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్యచేసిన సంఘటన జరిగితే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్షించకపోవడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. నిరుపేద గిరిజనులు కావడం వల్లే వారిని పరామర్శించకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో పేరున్న వారైతే మాత్రం మంత్రులు పరిగెత్తుకు పోతారంటూ, తాజాగా సినిమా హిరో రోడ్డు ప్రమాదంలో గాయపడితే మంత్రులతో సహా పలువురు అధికార పార్టీ నాయకులు వెళ్ళి పరామర్శించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ను మాత్రం పంపించి, ట్విట్టర్‌లో ఒక మంత్రి, ప్రకటన ద్వారా మరో మంత్రి సానుభూతి వ్యాఖ్యలు చెప్పి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. విచిత్రమేమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇద్దరు బాలికలపై అత్యాచారం ఇదే సందర్భంలో జరుగడం. ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన ఆదివాసులు బ్రతుకుదెరువు కోసం భవన నిర్మాణ కార్మికులుగా భద్రాచలం వొచ్చిన వారిపై అక్కడి మేస్త్రీలే అత్యాచారం జరుపడం. ఇలా నిమ్న వర్గాలపై అత్యాచార సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం వెంటనే స్పందించి, కఠిన శిక్షలు అమలు జరుపలేకపోతున్నదన్న అరోపణలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రజా తప్పిదాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్న ప్రభుత్వానికి ఈ ఘటనలు ఎందుకు కల్పించడం లేదని వారు నిలదీస్తున్నారు.

Leave a Reply