తీవ్ర పంట నష్టం…దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
ప్రభుత్వం అప్రమత్తం….ముందస్తు చర్యలకు అధికారులకు హెచ్చరిక
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రక్షణ చర్యలకు ఆదేశం
హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం
నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుతో మేకల కాపరి, పదుల సంఖ్యలో మేకలు మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షం వర్షం బీభత్సం సృష్టించింది. అన్నదాతను ఆగం జేసింది. మొక్కజొన్న, వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా యి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వరి, మామిడి పంటలకు తవ్ర నష్టం కల్గింది. గాలి దుమారానికి మామిడి పంట నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి బస్తాలు తడవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. పలుచోట్ల వడగండ్లు కురవడంతో చేతికొచ్చిన పంట నేలరాలింది. ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఇక అకాల వర్షాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. బుధవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30-40 కిలోవి•టర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.
రైతులు వరి కోతలను నిలిపేయాలని, కోసిన పంటల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో 8.3 సెంటీవి•టర్లు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో 7.9 సెంటీవి•టర్లు, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 7.7, యాదాద్రి భువనగిరి జిల్లా నందనం, మేడ్చల్ జిల్లా కీసరలో 7.5 సెంటీవి•టర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ వి•దుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే దశలో వడగండ్లు కురిసి నష్టాన్ని మిగిల్చింది. పలుచోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇందల్వాయి మండలంలో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకు పోయింది. ధర్పల్లి మండలంలో వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పినా ఈదురు గాలులకు ఎగిరిపోయి ధాన్యం తడిసిపోయింది. బాన్సువాడ, గాంధారి, మోర్తాడ్, రాజంపేట, ఎల్లారెడ్డి, చందూర్ మండలాల్లో వడగండ్ల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఆరబోసిన ధాన్యం కుప్పలు, పొలాల్లో ఆరబెట్టిన మక్కజొన్న కుప్పలు తడిసిపోయాయి.
కోత దశలో ఉన్న వరి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కాగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఈదురు గాలుల ధాటికి రేకులు ఎగిరి మహిళపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి బీమారం మండలం గోవిందారంలో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో మేకలు మృత్యువాతపడ్డాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో పిడుగు పడటంతో మేకల కాపరి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లాలో వడగండ్లు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దుబ్బాక పట్టణంతోపాటు చీకోడు, కమ్మర్‌పల్లి, పోతారం, హబ్షీపూర్, తిమ్మాపూర్, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి, తడ్కపల్లి, బూర్గుపల్లి, పొన్నాల, బక్రిచెప్యాల తదితర గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. వడగండ్లకు వరి, మామిడి, కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలని వ్యవసాయ, రెవెన్యూ అధికారులను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఆయన హావి• ఇచ్చారు. వికారాబాద్, జనగామ, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షం పడింది.
హైదరాబాద్‌లోనూ మంగళవారం రాత్రి వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, అవి•న్‌పూర్, అల్వాల్, నేరెడ్‌మెట్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, చందానగర్, మియాపూర్, బాలానగర్, సూరారం, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, అవి•ర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాచుపల్లి, ఈసీఐఎల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హుస్సేన్ సాగర్‌లో భాగమతి లాంచి మంగళవారం రాత్రి ప్రయాణికులతో బయలుదేరింది. కొద్ది సేపటికే భారీ వర్షం, ఈదురుగాలుల ధాటికి లాంచీ ఒక్కసారిగా అదుపుతప్పింది. సమాచారం అందుకున్న సిబ్బంది స్పీడ్‌బోట్లతో వెళ్లి తాళ్ల సాయంతో దాన్ని ఒడ్డుకు చేర్చారు. ఆ సమయంలో అందులో 40 మంది ఉన్నారు.