- ఆదిలాబాద్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
- పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన
- మరోవైపు కనువిందు చేస్తున్న మంచు అందాలు
ప్రజాతంత్ర, ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్ పూర్వపు జిల్లాలోని ప్రాంతాలు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పూర్వపు జిల్లాల్లో వాతావరణం చల్లగా మారింది. రాత్రి ఉష్టోగ్రతలు బాగా పడిపోతున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో అతి తక్కువ స్థాయికి పడిపోతున్నాయి. అయితే ఎత్తయిన గుట్టలు, కొండలు, లోయ ప్రాంతాలతో చూడముచ్చటైన మనోహర దృశ్యాలతో కనువిందు చేస్తోంది.
వాటిమాటునే చలివాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలితో గిరిజనుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గతంలో ఎన్నడు లేనివిధంగా రోజు రోజుకు వాతావరణంలో భారీ మార్పులతో కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలిపులి పంజా విసురుతోంది. అలాగే హైదరాబాద్లో పెథాయ్ తుఫాన్ కారణంగా ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఇప్పుడిప్పుడే సాధారణ స్తాయికి వస్తుంది. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. పొట్టకూటి కోసం కూలినాలి చేసుకొనే కష్టజీవులపై తీవప్రభావం పడింది. ఉదయం పూటపనిచేసే కార్మికులు, కర్షకులకు వాతావరణం చాలా ఇబ్బందికరంగా మారింది. గత వారంరోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొని చలి పెరిగిపోతోంది. సాయంత్రం ఐదు గంటలు దాటిందంటే చీకటితోపాటు చల్లనిగాలులు వీస్తున్నాయి.