Take a fresh look at your lifestyle.

నాడు క్విట్‌ ఇం‌డియా..నేడు?

రెండు రోజుల కింద జరుపుకున్న డెబ్బై ఎనిమిదివ క్విట్‌ ఇం‌డియా వార్షికోత్పవం సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, జాతీయ పార్టీలు అదే స్ఫూర్తితో పోరాటాలు చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చాయి. అనాడు ఆంగ్లేయులను భారత్‌ ‌నుండి వెళ్ళగొట్టేందుకు ఇచ్చిన క్విట్‌ ఇం‌డియా పిలుపు దేశ ప్రజలందరినీ ఒకటి చేసింది. మహత్మాగాంధీ ఇచ్చిన ఆనాటి పిలుపుకు మరో అయిదేళ్ళలో ఆంగ్లేయులకు దేశం విడిచిపోక తప్పలేదు. కాని, అదేస్ఫూర్తితో వ్యవహరించాలని ప్రతిక్షాలిస్తున్న పిలుపు ఏ విదేశీ పాలకుల కోసం కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలచేత ఎన్నుకోబడి అధికారంలో ఉన్న పాలకులకోసం. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీలు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నాయన్నది వారి ఆరోపణ. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు పోతుందని ఒక పక్క ప్రశంసల వర్షం కురుస్తుంటే, మరో పక్క సిపిఐ లాంటి జాతీయపార్టీ క్విట్‌ ‌బిజెపి అంటోంది. డెబ్బై మూడేళ్ళ కింద ఇదే ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చిన రోజైతే, ఇదే ఆగస్టు 5న దేశ రాజ్యాంగాన్ని మోదీ ప్రభుత్వం అవమానించిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి పిలుపిచ్చిన గాంధీజీ   విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపిస్తే, ఈనాడు మోదీ ప్రభుత్వం విదేశీ సంస్థలను ఆహ్వానిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తున్నది. రాముడిపేరున రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నమే ఇది. అందుకే క్విట్‌ ఇం‌డియా రోజును క్విట్‌ ‌బిజెపి అంటూ ఆపార్టీ పిలుపిచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇతర వామపక్షాల సంస్థలు సంఘటితంగా అదేరోజున సేవ్‌ ఇం‌డియా అంటూ పిలుపునిచ్చాయి. ఇందులో వివిధ కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు కలిసికట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నినాదమిచ్చాయి. అదే క్విట్‌ ఇం‌డియా స్ఫూర్తితో భారత రైతాంగం కూడా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ‘కార్పోరేటర్లను తరుముదాం- రైతాంగాన్ని రక్షిద్ధా’మన్నది  వారి పిలుపు. ఈ సంస్థలు, పార్టీలన్నీ కూడా మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్స్‌లపైన ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నాయి. అగ్రికల్చరల్‌  ‌ప్రొడ్యూస్‌, ‌కామర్స్ అం‌డ్‌ ‌ట్రేడ్‌ (‌ప్రమోషన్‌ అం‌డ్‌ ‌ఫెసిలిటేషన్‌) అర్డినెన్స్-2020,  ‌ది ఫార్మర్స్ (ఎం‌ఫర్‌మెంట్‌ అం‌డ్‌ ‌ప్రొడక్షన్‌) అ‌గ్రిమెంట్‌ ఆన్‌ ‌ప్రైస్‌ అస్యూరెన్స్ అం‌డ్‌ ‌ఫామ్‌ ‌సర్వీసెస్‌ ఆర్డినెన్స్-2020, ‌చివరగా ఎసన్షియల్‌ ‌కమోడిటీస్‌ ‌యాక్ట్(అమెన్‌డ్‌మెంట్‌)2020 అన్నవి అటు కార్మికుల, ఇటు రైతాంగ హక్కులను కాలరాచేవిగా ఉన్నాయని పలు విమర్శలు వస్తున్నాయి.

కార్మికుల హక్కులను కాలరాసి, యాజమానులను బానిసలుగా మార్చడమేనని, అలాగే స్వేచ్ఛా వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌ ‌కబంధ హస్తాల్లో పెట్టడమే ఈ ఆర్డినెన్స్‌ల ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్విట్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌గవర్నమెంట్‌ ‌పేరుతో ముందుకువెళ్ళాలని పిలుపునిచ్చింది. ఆనాడు క్విట్‌ ఇం‌డియా ఉద్యమంతో దేశానికి స్వాతంత్య్రం తేగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి తామే కారణమంటున్న కాంగ్రెస్‌, ‌తెరాస ప్రభుత్వపాలనలో సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని అన్నిటిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నదని, గిరిజన, దళిత వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నదంటూ, రానున్న రెండు మూడు కార్పొరేషన్‌ ఎన్నికలు మొదలుకుని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని క్విట్‌ ఇం‌డియా వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు, తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. భారతీయ జనతాపార్టీ కూడా ఇందుకేమీ తీసిపోలేదు. తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం భూమిపూజ చేసిన సందర్భంగా ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు ఢిల్లీనుంచి వర్చువల్‌గా పాల్గొని అదే విషయాన్ని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్‌కు తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సిందేనంటూ పిలుపిచ్చారు.  ఒక పక్క రాష్ట్రంలో మరణమృందంగం మోగుతుంటే ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని, కొరోనా వ్యాధిని కట్టడిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయనతోపాటు ఆపార్టీ రాష్ట్ర నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  అయితే టిఆర్‌ఎస్‌ ఏమీ తక్కువ తినలేదు.  కాకపోతే క్విట్‌ ఇం‌డియాను పోలుస్తూ ప్రకటన చేయకపోయినా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించే నదీజలాలపై ఆరేళ్ళుగా తేల్చకుండా నాన్చడంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నీటి సమస్య కేవలం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వరకే పరిమితం కాలేదని, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని జలవివాదాలపట్ల కేంద్రం ఇలానే ఉదాసీన వైఖరిని అవలంబిస్తోందని అధికార టిఆర్‌ఎస్‌ ‌కూడా ద్వజమెత్తటం చూస్తుంటే, డెబ్బై ఎనిమిదేళ్ళ కింద విదేశీపాల నుండి  విముక్తి పొందామనుకుంటున్న మనం నిజంగానే స్వేచ్ఛా జీవితం గడుపుతున్నామా అన్న అనుమానానికి తావేర్పడుతోంది. ఆనాటి వారి త్యాగాల ఫలాలను అనుభవిస్తున్న మనం, ముందుతరాలకోసం ఎలాంటి బాటలువేస్తున్నామన్నది నిజంగానే ఆలోచించుకోవాల్సిన అవసరముంది.

Leave a Reply