Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఏర్పడి ఏడేళ్లయినా… నిరుద్యోగ యాత్ర చేయాల్సి రావడం దారుణం

  • స్వామి అగ్నివేశ్‌ ‌మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
  • ప్రభుత్వం రైతులను బెదిరించి అసైన్డ్ ‌భూములు లాక్కుంటోంది
  • టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా ఏ ఒక్కటీ నెరవేరలేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. కొరోనా కష్ట కాలంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికుల బాధలను తొలగించడంలో ఘోరంగా విఫమైందని విమర్శించారు. శనివారం నాంపల్లిలోని టీజెఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, జీవో 45 ప్రకారం ఆదాయ భద్రత డిమాండ్ల సాధనకై హలో నిరుద్యోగి చలో అసెంబ్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రొ.కోదండరాం టీజేఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వెంకటరెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వామి అగ్నివేష్‌ ‌మృతి బాధాకరమనీ, ఆయన మృతి ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్లు అయినప్పటికీ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ నిరుద్యోగ యాత్ర చేయాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధప్రదేశ్‌ ‌లాగా స్థానికులకే ఉద్యోగం కల్పించే విధంగా చట్టం చేయాలనీ, ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనకు క్యాలెండర్‌ ‌విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. నాగులు లాంటి వాళ్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో లక్షా 48 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, కొత్త జిల్లాలు, కొత్త మండలాలతో కలిపి దాదాపు 50 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై అఖిలపక్షం చర్చ చేశామనీ, పేద రైతుల హక్కులు కాపాడే విధంగా కొత్త చట్టం ఉండాలనీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కొత్త చట్టంలో పరిష్కారం చూపలేదని ఆరోపించారు. సాదా, బినామీ, పోడు భూములు, కౌలు రైతులపై కొత్త చట్టంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని విమర్శించారు. అసైన్డ్ ‌భూములను ప్రభుత్వం రైతుల నుంచి బెదిరించి లాక్కుంటున్కనదనీ, ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. టీజేఎస్‌ ‌విద్యార్థి విభాగం అధ్యక్షుడు నిజ్జన రమేశ్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో రెండు బృందాలుగా యాత్ర చేపడతామనీ, సోమవారం భువనగిరి నుంచి భూపాలవల్లి వరకు ఒక బృందం, నల్గొండ నుంచి భద్రాచలం వరకు మరొక బృందం బయల్దేరుతుందని చెప్పారు. ఈనెల 21న హలో నిరుద్యోగి చలో అసెంబ్లీ పేరుతో భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply