Take a fresh look at your lifestyle.

రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్టే

సంగారెడ్డి, మే 23(ప్రజాతంత్ర ప్రతినిధి) రైతుకు సేవ చేస్తే దేశంలో ఉన్న సమాజానికి సేవ చేసినట్లేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు.శనివారం సంగారెడ్డిలో ని గోకుల్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో ఏర్పాటుచేసిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానం లాభసాటి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమ స్ఫూర్తితో నూతన సాగు విధానాన్ని అమలు చేయాలన్నారు. నియంత్రిత వ్యవసాయ సాగు విధానాన్ని అందరూ సంయుక్తంగా పోటీతత్వం తో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. వాన కాలంలో జిల్లాలో మొక్కజొన్న సాగు చేయొద్దని, వాన కాలంలో మొక్కజొన్న పంట దిగుబడి తగ్గి ఖర్చులు అధికం కావడంతో రైతుకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. స్వీట్‌ ‌కార్న్, ‌తినే కంకులు, చొప్పా తదితర అవసరాలకు మొక్కజొన్న వేసుకుంటే అభ్యంతరం లేదన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేందుకే ముఖ్యమంత్రి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సన్నరకం వరి సాగుకు ప్రధమ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కంది ,పత్తి పంటల విస్తీర్ణం పెంచి రైతుకు లాభం చేకూరేలా చూడాలన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న నూతన పంట సాగు విధానం అమలు చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధుల పై ఉందని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవనీ, తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వాన కాలంలో కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు సుమారు వాన కాలంలో ఏడు వేల కోట్లు యాసంగి లో 7వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు ఇస్తామని తెలిపారు. జూన్‌ ‌లో ఏడు వేల కోట్లు ఇస్తామన్నారు.జిల్లాలో 6,38,814 ఎకరాల సాగుతుందని అందులో 55 వేల ఎకరాలలో వరి సాగు చేశామని, ఈ సంవత్సరం కూడా అంతే మొత్తంలో వరి సాగు చేయొచ్చని,అందులో కొంత మేర సన్నరకాలు వేయాలని మంత్రి సూచించారు. గత సంవత్సరం మూడు లక్షల నలభై ఏడు వేల ఎకరాలలో పత్తి సాగు చేయగా ఈ సంవత్సరం 362000 ఎకరాలలో పత్తి సాగు చేయాలన్నారు. మంచి పత్తి విత్తనాలు సకాలంలో రైతులకు అందేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు ఏ ఈ ఓ లకు మంత్రి సూచించారు. గత సంవత్సరం 50 వేల ఎకరాలలో కందులు సాగు చేశామని, ప్రస్తుత వానాకాలంలో 75 వేల ఎకరాల వరకు సాగు చేయడానికి రైతులను సంసిద్ధులను చేయాలన్నారు. పండిన కంది పంట మొత్తాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. పెసలు ,మినుములు, సోయాబీన్‌ ‌తదితర మార్కెట్‌ ‌డిమాండ్‌ ‌గల పంటలను వేసుకోవచ్చన్నారు.జిల్లాలో పంటల సాగు విషయమై దశ-దిశ నిర్దేశించుకుని క్షేత్ర స్థాయిలో రైతులతో అమలు చేయాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితి ప్రతినిదులు, వ్యవసాయ అధికారులు ఆయా గ్రామ, మండల స్థాయి ప్రతినిధుల దని అన్నారు. వానాకాలంలో పంట మార్పిడి చేస్తే రైతులకు మేలు జరుగుతుందని,10 శాతం మార్పు మాత్రమే ఉందన్నారు.ప్రతి గ్రామానికి ఎరువులను ముందుగానే తీసుకెళ్లాలని , ఫ్యాక్స్ ‌సంస్థలు, డీలర్ల వద్ద ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నాసిరకం , నకిలీ విత్తనాలను అమ్మి నట్లయితే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల వద్దకు వెళ్లాలని ప్రతి రోజు ప్రతివిస్తరణాధికారి కనీసం 20 మంది రైతులను కలవాలని, నూతన సాగు విధానంపై అవగాహన కల్పించి , వానాకాలంలో లాభసాటి, అధికదిగుబడి, డిమాండ్‌ ఉన్న పంటలను పండించే విధంగా ప్రోత్సహించాలన్నారు. సప్లై డిమాండ్‌ ‌మధ్య సమన్వయం చేయాలని, మార్కెట్‌ ‌డిమాండ్కు అనుగుణంగా రైతులు వంటలు పండించాలనిఅన్నారు.అదేవిధంగా కూరగాయలు, పూల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలకు కేటాయించిన స్థలం అనుకూలంగా ఉన్నది లేనిది వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎంపీపీ పరిశీలించాలని , త్వరితగతిన నిర్మాణాలు జరిగేలా దృష్టి సారించాలని సూచించారు. నాలుగు మాసాల లో గా రైతు వేదికల నిర్మాణాలు జరగాలని, ఒకేరోజు జిల్లాలోని 116 రైతు వేదికలు శంకుస్థాపన చేసేలా సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. రైతు వేదికలకు ఎవరైనా స్థలం ఇస్తే దాతల పేర్లు పెడతామని నిర్మాణానికి దాతలను ముందుకు తీసుకు రావాలన్నారు.వానాకాలం నియంత్రితపంటల సాగు పై అవగాహన కల్పించే దిశగా ముందస్తుప్రణాళికతోజడ్పిటిసిలు ,ఎంపిటిసిలు ,ఎంపీపీలు ,సర్పంచులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, అధ్యక్షులు, వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఏ ఈ ఓ ల పోస్టులు అన్ని భర్తీ చేస్తున్నామన్నారు. అదనపు క్లస్టర్ల కోసం ప్రతిపాదనలు చేస్తామని మంత్రి తెలిపారు.రైతు వేదికకు విరాళంగా రూ. 5 లక్షలను ప్రకటించిన డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌శివకుమార్‌ ‌ను మంత్రి సన్మానించారు.

నారాయణఖేడ్‌ ఏ ఈ ఓ ‌రాందాస్‌ ‌తన పరిధిలో రైతులను చైతన్య పరిచి తక్కువ పెట్టుబడి తో పత్తి పంటలోఎక్కువ దిగుబడి తీసే విధంగా తగు సూచనలు సలహాలు ఇస్తున్న అతని పనితీరును అభినందించి సన్మానించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ఏ జిల్లాలో ఏ పంట పెట్టాలన్నది నిర్ధారించి రైతులను లాభాల దిశలో పయనించేలా సాగు అమలు చేయాలని సూచించారు.ఎంపీ బి బి పాటిల్‌ ‌మాట్లాడుతూ రైతును రాజును చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.శాసనసభ్యులు క్రాంతి కిరణ్‌ ‌మాట్లాడుతూ వ్యవసాయం అంటే నామోషి అనుకున్న రోజులు పోయి వ్యవసాయాన్ని లాభదాయకమైన నూతన ఒరవడిగా భావిస్తున్న రోజులు వచ్చాయన్నారు.జిల్లా కలెక్టర్‌ ‌హనుమంత రావు మాట్లాడుతూ రైతుకు ఏది లాభదాయకమైనదో ఆ పంట వేయాలని, నూతనసాగు విధానం అన్ని పంటలతో కూడి ఎంతో రైతులను సాంప్రదాయ పంటల వైపు కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించాలని సూచించారు. రైతులు లాభాల బాట పట్టే విధంగా సలహాలు సూచనలు ఇచ్చి నూతన సాగు విధానం పై అవగాహన కల్పించి ప్రోత్సహి ంచాలన్నారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ అందరూ బాధ్యత తీసుకొని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి నియంత్రిత వ్యవసాయ సాగు విధానాన్ని ప్రోత్సహించుదా మన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుశ్రీ , జహీరాబాద్‌ ‌శాసనసభ్యులు మాణిక్యరావు, ఎమ్మెల్సీ ఫరూడిద్దీన్‌, ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌విజయలక్ష్మి, డిసిసిబి చైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌ ‌రెడ్డి, డి సి ఎం ఎస్‌ ‌చైర్మన్‌ ‌శివకుమార్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపిటిసిలు, ప్యక్స్ ‌సొసైటీ చైర్మన్‌ ‌లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply